వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్‌కు ముందు టీమిండియా మేనేజ్‌మెంట్‌కు ఓ విషయం పెద్ద సమస్యగా మారింది. ఫైనల్ మ్యాచ్‌లో వికెట్‌కీపర్‌గా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై వారు తలలు పట్టుకుని కూర్చున్నారు. ఈ విషయంపై విశ్లేషకులు, మాజీలు, అభిమానులు ఎవరికి తోచిన సలహాలు వారు ఇస్తున్నారు. అయినా మేనేజ్‌మెంట్ ఎటూ తేల్చుకోలేకపోతుంది.
తాజాగా ఇదే విషయమై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మరోసారి స్పందించాడు. తొలుత భారత వికెట్‌కీపర్‌గా కేఎస్ భరత్ బెటర్ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన భజ్జీ.. తాజాగా తన యూట్యూబ్ ఛానల్‌తో మాట్లాడుతూ మాట మార్చాడు. భరత్‌తో పోలిస్తే ఇషాన్ కిషన్ బెటర్ ఆప్షన్ అవుతాడని అభిప్రాయపడ్డాడు. 4 మ్యాచ్‌ల్లో కేవలం 101 పరుగులు చేసిన భరత్‌పై అంత నమ్మకం కలగడం లేదని, అతని కంటే ధాటిగా బ్యాటింగ్ చేయగల ఇషాన్‌ను ఆడించడమే సమంజసమని అన్నాడు.
ఇషాన్‌కు రిషబ్ పంత్‌లా అగ్రెసివ్‌గా ఆడే సామర్థ్యం ఉందని, అతను ఇంత వరకు టెస్ట్ అరంగేట్రం చేయలేదని కారణం చూపి ఆడించకపోతే టీమిండియాకే లాస్ అవుతుందని తెలిపాడు. పైగా ఇషాన్ ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో మంచి టచ్‌లో ఉన్నాడని, ఐదు, ఆరు స్థానాల్లో అతను బరిలోకి దిగితే రెండో కొత్త బంతితో ఆడుకుంటాడని పేర్కొన్నాడు. వికెట్‌కీపింగ్ విషయానికొస్తే తన ఓటు భరత్‌కే అయినప్పటికీ.. అందుకోసం ఓ బ్యాటర్‌ను కోల్పోలేమని చెప్పుకొచ్చాడు. ఫైనల్‌గా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు తన ఛాయిస్ ఇషానే అని చెప్పకనే చెప్పాడు. ఇదిలా ఉంటే, డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ఓవల్ మైదానం వేదికగా జూన్ 7 నుంచి 11 వరకు జరుగనున్న విషయం తెలిసిందే.
చదవండి: WTC Final IND VS AUS: ఐసీసీ ఫైనల్స్‌లో ఎవరెన్ని గెలిచారు..?


