WPL 2023 GG Vs RCB: మహిళా దినోత్సవ కానుక.. బీసీసీఐ బంపరాఫర్‌.. అందరికీ ఉచిత ప్రవేశం!

WPL 2023 Celebrates Womens Day Free Entry For All GG Vs RCB - Sakshi

WPL 2023- International Women's Day 2023: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా క్రికెట్‌ ప్రేమికులకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి బంపరాఫర్‌ ఇచ్చింది. వుమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2023లో భాగంగా మార్చి 8 నాటి మ్యాచ్‌ను ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించింది. ముంబైలోని బ్రబౌర్న్‌ స్టేడియంలో గుజరాత్‌ జెయింట్స్‌- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు వుమెన్‌ టీమ్‌ మధ్య బుధవారం మ్యాచ్‌ జరుగనుంది.

అందరికీ ఉచిత ప్రవేశం
మహిళా దినోత్సవ కానుకగా ఈ ఆసక్తికర పోరును నేరుగా చూసేందుకు వీలు కల్పించారు నిర్వాహకులు. ఈ మేరకు.. ‘‘మహిళా దినోత్సవాన్ని మేము ఇలా సెలబ్రేట్‌ చేస్తున్నాం. మార్చి 8, 2023న టాటా డబ్ల్యూపీఎల్‌లో గుజరాత్‌ జెయింట్స్‌, ఆర్సీబీ మధ్య జరిగే మ్యాచ్‌ వీక్షించేందుకు అందరికీ ఉచిత ప్రవేశం కల్పిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.

ముంబై- ఆర్సీబీ మధ్య సోమవారం నాటి మ్యాచ్‌ సందర్భంగా స్క్రీన్‌ మీద ఈ మేరకు ప్రకటన చేసిన నిర్వాహకులు.. సోషల్‌ మీడియా వేదికగా మరోసారి ఈ శుభవార్తను పంచుకున్నారు. దీంతో బీసీసీఐపై ప్రశంసల వర్షం కురుస్తోంది. టిక్కెట్లు ఉచితంగా ఇవ్వడం కంటే కూడా మహిళా క్రికెటర్లకు సమున్నత గౌరవం కల్పిస్తున్న తీరుకు ఫిదా అయ్యామంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా స్టేడియం పరిమితికి తగ్గట్లు కొన్ని షరతులతో ఫ్రీగా టికెట్లు ఇవ్వనున్నట్లు సమాచారం.

ముంబై టాప్‌
భారత మహిళా క్రికెట్‌ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతూ బీసీసీఐ మహిళా ప్రీమియర్‌ లీగ్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మార్చి 4న ముంబై ఇండియన్స్‌- గుజరాత్‌ జెయింట్స్‌ మ్యాచ్‌తో లీగ్‌ ఆరంభమైంది.

ఈ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ సేన గుజరాత్‌పై 143 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఇక రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌, ఆర్సీబీ తలపడగా.. లానింగ్‌ బృందం 60 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.

స్పెషల్‌ డే.. స్పెషల్‌ మ్యాచ్‌
మూడో మ్యాచ్‌లో గుజరాత్‌- యూపీ వారియర్స్‌ పోటీ పడగా.. యూపీ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక నాలుగో మ్యాచ్‌ ముంబై- ఆర్సీబీ మధ్య జరుగగా.. స్మృతి మంధాన సేనకు ముంబై చేతిలో 9 వికెట్ల తేడాతో పరాభవం ఎదురైంది.

ఇక ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు జరుగగా.. ముంబై రెండింటిలో ఘన విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇంతవరకు రెండేసి మ్యాచ్‌లు ఆడి రెండింట్లోనూ ఓడిన గుజరాత్‌- ఆర్సీబీ మార్చి 8న గెలుపు కోసం పోటీపడనున్నాయి. మహిళలకు ప్రత్యేకమైన రోజున మరి విజయం ఎవరిని వరిస్తుందో!!

చదవండి: WPL 2023: ఆర్సీబీ రాత ఇంతేనా.. మహిళల ఐపీఎల్‌లోనూ నిరాశ తప్పదా..?
PSL 2023: మార్టిన్‌ గప్తిల్‌ వీరవిహారం.. 56 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top