WPL 2023: ఆర్సీబీ రాత ఇంతేనా.. మహిళల ఐపీఎల్‌లోనూ నిరాశ తప్పదా..?

WPL 2023: Royal Challengers Bangalore Registers Second Defeat - Sakshi

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ప్రారంభ సీజన్‌ (2008) నుంచి ఏ యేటికి ఆ యేడు ఎన్నో అంచనాల నడుమ బరిలోకి దిగే రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు, ప్రతి సీజన్‌లోనూ ఉసూరుమనిపిస్తూ ఫ్రాంచైజీ అభిమానులను తీవ్ర నిరుత్సాహానికి గురి చేస్తున్న విషయం విధితమే. పేరులో రాయల్‌, జట్టు నిండా స్టార్లు ఉన్నారనే మాట తప్పించి, ఆర్సీబీ 15 ఎడిషన్లలో సాధించింది ఏమీ లేదు. 2009, 2011, 2016 ఎడిషన్లలో రన్నరప్‌గా నిలిచిన ఆ జట్టు.. ప్రతి యేడు 'ఈ సాలా కప్‌ నమ్మదే' అనడం తప్ప ఒక్కసారి కూడా టైటిల్‌ సాధించింది లేదు. 

2009 ఎడిషన్‌లో రాస్‌ టేలర్‌, 2011లో క్రిస్‌ గేల్‌, 2016లో విరాట్‌ కోహ్లి ఒంటిరిగా విజృంభించడంతో ఈ మూడు ఎడిషన్లలో ఫైనల్‌కు చేరింది తప్పిస్తే.. ఈ జట్టు మూకుమ్మడిగా ఆడి, గెలిచింది ఎప్పుడూ లేదు. కనీసం మహిళల ఐపీఎల్‌ (WPL)లో అయినా ఫేట్‌ మారుతుందని ఆశించిన ఆర్సీబీ అభిమానులకు ఇక్కడ కూడా నిరాశ తప్పడం లేదు. మెన్స్‌ టీమ్‌కు తాము ఏమాత్రం తక్కువ కాదన్నట్లు, మహిళల టీమ్‌ పోటీపడి మరీ వరుస పరాజయాలు మూటగట్టుకుంటుంది. డబ్ల్యూపీఎల్‌-2023లో ఆర్సీబీ వుమెన్స్‌ టీమ్‌ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై, మెన్స్‌ ఆర్సీబీని గుర్తు చేస్తుంది. 

మెన్స్‌ ఆర్సీబీ లాగే వుమెన్స్‌ ఆర్సీబీ కూడా స్టార్లతో కళకళలాడుతున్నప్పటికీ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక చతికిలపడుతుంది.కోట్లు కుమ్మరించి ఏరికోరి ఎంచుకున్న కెప్టెన్‌ మంధన వ్యూహాలు రచించడంలో దారుణం‍గా విఫలమవుతుండగా.. ఢిల్లీ, ముంబైలతో జరిగిన మ్యాచ్‌ల్లో అంతర్జాతీయ స్టార్లు సోఫీ డివైన్‌, రిచా ఘోష్‌, రేణుకా సింగ్‌ పూర్తిగా చేతులెత్తేశారు. ఢిల్లీతో మ్యాచ్‌లో ఎల్లీస్‌ పెర్రీ, హీథర్‌ నైట్‌, మెగాన్‌ షట్‌ పర్వాలేదనిపించగా.. కెప్టెన్‌ మంధన రెండు మ్యాచ్‌ల్లో బ్యాట్‌తో ఓకే అనిపించింది. లీగ్‌లో తదుపరి మ్యాచ్‌ల్లో కూడా ఆర్సీబీ ప్రదర్శన ఇలాగే కొనసాగితే, మెన్స్‌ ఆర్సీబీలాగే ఈ జట్టు పరిస్థితి కూడా పేపర్‌పై పులిలా తయారవుతుంది.  

కాగా, డబ్ల్యూపీఎల్‌ అరంగ్రేటం సీజన్‌లో భారీ అంచనాల నడుమ బరిలో నిలిచిన ఆర్సీబీ.. తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ చేతిలో, రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించినా, ఆతర్వాత వచ్చే ప్లేయర్లు దారుణం‍గా విఫలమయ్యారు. బ్యాటింగ్‌ విషయంలో వరుస ఇదైతే, బౌలింగ్‌లో ఆర్సీబీ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 

ఢిల్లీతో మ్యాచ్‌లో షఫాలీ, లాన్నింగ్‌లకు కనీసం డాట్‌ బాల్‌ వేయలేక ఆర్సీబీ బౌలర్లు అష్టకష్టాలు పడ్డారు. ఆ మ్యాచ్‌లో తొలి ఓవర్‌ మినహాయించి, 19 ఓవర్లలో ఆర్సీబీ బౌలర్లు బౌండరీలు, సిక్సర్లు సమర్పించుకున్నారు. ముంబైతో మ్యాచ్‌లో కూడా దాదాపు ఇదే పరిస్థితి కొనసాగింది. దాదాపుగా అందరూ బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. రెండు మ్యాచ్‌ల్లో కలిపి ఆర్సీబీ బౌలర్లు కేవలం 3 వికెట్లు మాత్రమే పడగొట్టారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధమవుతుంది.     

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top