WPL 2023: ముంబై సూపర్‌ షో

WPL 2023: Mumbai Indians beat Royal Challengers Bangalore by nine wickets - Sakshi

9 వికెట్లతో బెంగళూరుపై ఘన విజయం 

హేలీ మాథ్యూస్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన 

నట్‌ సీవర్‌ అర్ధ సెంచరీ 

మహిళల ప్రీమియర్‌ లీగ్‌

ముంబై: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో ముంబై ఇండియన్స్‌ ధనాధన్‌ ఆల్‌రౌండ్‌ షోతో వరుసగా రెండో విజయం సాధించింది. సోమవారం జరిగిన పోరులో 9 వికెట్ల తేడాతో బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ను చిత్తు చేసింది. బౌలింగ్‌లో 3 వికెట్లు పడగొట్టిన హేలీ మాథ్యూస్‌ బ్యాటింగ్‌లో (38 బంతుల్లో 77 నాటౌట్‌; 13 ఫోర్లు, 1 సిక్స్‌) ఆకాశమే హద్దుగా చెలరేగింది.

టాపార్డర్‌ బ్యాటర్‌ నట్‌ సీవర్‌ బ్రంట్‌ (29 బంతుల్లో 55 నాటౌట్‌; 9 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా మెరుపు అర్ధ సెంచరీ సాధించడంతో ఛేదన సులువైంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 18.4 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. రిచా ఘోష్‌ (26 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌ కాగా, సయిక ఇషాక్, అమెలియా కెర్‌ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్‌ హేలీ, బ్రంట్‌ల అజేయ అర్ధ సెంచరీలతో 14.2 ఓవర్లలో ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి 159 పరుగులు చేసింది.  

అందరూ అంతంతే!
బెంగళూరు స్కోరైతే 150 దాటింది కానీ... ఏ ఒక్క బ్యాటర్‌ది చెప్పుకోదగ్గ స్కోరుగానీ, ఇన్నింగ్స్‌ను కుదుటపర్చిన భాగస్వామ్యంగానీ లేవు. అదే బెంగళూరు పాలిట శాపమైంది. కెప్టెన్, ఓపెనర్‌ స్మృతి మంధాన (17 బంతుల్లో 23; 5 ఫోర్లు) మొదలు మేగన్‌ షట్‌ (14 బంతుల్లో 20; 3 ఫోర్లు) దాకా ఐదుగురు బ్యాటర్లు రిచా, కనిక ఆహుజా (13 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్‌), శ్రేయాంక పాటిల్‌ (15 బంతుల్లో 23; 4 ఫోర్లు)  20 పైచిలుకు పరుగులు చేశారు. అందరు ఇలా వచ్చి అలా షాట్లు బాదేసి పెవిలియన్‌కు వెళ్లినవారే! ఇందులో ఏ ఒక్కరు నిలబడినా, మెరుపుల భాగస్వామ్యం నమోదైనా పరిస్థితి మరోలా ఉండేది. అయితే ముంబై బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టడంలో సమష్టిగా సఫలమయ్యారు.  

హేలీ, బ్రంట్‌ ఫిఫ్టీ–ఫిఫ్టీ
ముంబై ముందున్న లక్ష్యం 156 పరుగులు. అంత సులభమైందేమీ కాదు. కానీ యస్తిక భాటియా (19 బంతుల్లో 23; 4 ఫోర్లు)తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించిన హేలీ మాథ్యూస్‌ తొలి ఓవర్‌ నుంచే ఎదురుదాడికి దిగింది. స్కోరు జోరందుకున్న సమయంలో యస్తికను ప్రీతి బోస్‌ వికెట్‌ ముందు దొరకబుచ్చుకుంది. 45 పరుగుల వద్ద తొలి వికెట్‌ కూలగా,  బెంగళూరుకు అదే ఆఖరి ఆనందం అయ్యింది. తర్వాత నట్‌ సీవర్‌ వచ్చాక హేలీ వేగం మరో దశకు చేరింది.

బెంగళూరు కెప్టెన్‌ బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినా ఫలితం లేకపోయింది. అటు బ్రంట్, ఇటు హేలీ బౌండరీలను అవలీలగా బాదేస్తుంటే ఆద్యంతం ‘పవర్‌ ప్లే’నే కనిపించింది. పదో ఓవర్లోనే హేలీ 26 బంతుల్లో (8 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. 10.2 ఓవర్లోనే జట్టు స్కోరు 100 దాటింది. మేగన్‌ షట్‌ వేసిన 12,  శ్రేయాంక పాటిల్‌ వేసిన 13వ ఓవర్లలో బ్రంట్, హేలీలు ఫోర్లతో చెలరేగిపోయారు. దీంతో ఈ రెండు ఓవర్లలోనే ముంబై 40 పరుగులు చేయడంతో లక్ష్యాన్ని 5.4 ఓవర్ల ముందే ఛేదించింది.

స్కోరు వివరాలు
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: స్మృతి మంధాన (సి) వాంగ్‌ (బి) హేలీ 23; సోఫీ (సి) అమన్‌జోత్‌ (బి) సయిక 16; దిశ (బి) సయిక 0; ఎలైస్‌ పెర్రీ రనౌట్‌ 13; హీథెర్‌నైట్‌ (బి) హేలీ 0; రిచాఘోష్‌ (సి) నట్‌ సీవర్‌ (బి) హేలీ 28; కనిక (సి) యస్తిక (బి) పూజ 22; శ్రేయాంక (ఎల్బీ) (బి) నట్‌ సీవర్‌ 23; మేగన్‌ (స్టంప్డ్‌) యస్తిక (బి) అమెలియా 20; రేణుక (బి) అమెలియా 2; ప్రీతి నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (18.4 ఓవర్లలో ఆలౌట్‌) 155.
వికెట్ల పతనం: 1–39, 2–39, 3–43, 4–43, 5–71, 6–105, 7–112, 8–146, 9–154, 10–155.
బౌలింగ్‌: హేలీ 4–0–28–3, నట్‌ సీవర్‌ 3–0–34–1, సయిక ఇషాక్‌ 4–0–26–2, ఇసి వాంగ్‌ 2–0–18–0, అమెలియా కెర్‌ 3.4–0–30–2, కలిత 1–0–10–0, పూజ 1–0–8–1.

ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: హేలీ మాథ్యూస్‌ నాటౌట్‌ 77; యస్తిక (ఎల్బీ) (బి) ప్రీతి 23; నట్‌ సీవర్‌ నాటౌట్‌ 55; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (14.2 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 159.
వికెట్ల పతనం: 1–45. 
బౌలింగ్‌: రేణుక 3–0–28–0, ప్రీతి బోస్‌ 4–0–34–1, మేగన్‌ షట్‌ 3–0–32–0, ఎలైస్‌ పెర్రీ 1.2–0–18–0, శ్రేయాంక 2–0–32–0, సోఫీ డివైన్‌ 1–0–11–0.  

డబ్ల్యూపీఎల్‌లో నేడు
ఢిల్లీ క్యాపిటల్స్‌ X లక్నో విజార్డ్స్‌
రాత్రి గం. 7:30 నుంచి స్పోర్ట్స్‌ 18 చానెల్‌లో, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top