FIFA Rankings: భళా అర్జెంటీనా.. ఆరేళ్ల తర్వాత అగ్రస్థానం

World Cup Winner Argentina Moves Top Of FIFA Rankings After SixYears - Sakshi

ఫిఫా ఫుట్‌బాల్‌ ర్యాంకింగ్స్‌లో అర్జెంటీనా ఆరేళ్ల తర్వాత మళ్లీ అగ్రస్థానాన్ని అధిరోహించింది. ఇటీవలే పనామా, కురాకోతో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లలో విజయాలు అందుకున్న అర్జెంటీనా 1840. 93 పాయింట్లతో నెంబర్‌వన్‌ స్థానాన్ని ఆక్రమించింది. ఫిఫా ర్యాంకింగ్స్‌లో మె​స్సీ సేన ఆరేళ్ల తర్వాత అగ్రస్థానంలో నిలవడం విశేషం.

ఇక  గతేడాది డిసెంబర్‌లో ఖతార్‌ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్‌లో ఫ్రాన్స్‌ను పెనాల్టీ షటౌట్‌లో 4-2తో ఓడించి మూడోసారి విజేతగా నిలిచింది. అన్నీ తానై జట్టును నడిపించిన మెస్సీ తన కోరికను నెరవేర్చుకోవడంతో పాటు అర్జెంటీనా 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు.

ఇక ఫిఫా వరల్డ్‌కప్‌ రన్నరప్‌గా నిలిచిన ఫ్రాన్స్‌ 1838.45 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. యుఇఎఫ్‌ఎ యూరో క్వాలిఫైయింగ్‌లో భాగంగా ఫ్రాన్స్‌.. నెదర్లాండ్స్‌, రిపబ్లిక్‌ ఆఫ్‌ ఐర్లాండ్‌లను ఓడించి ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి దూసుకొచ్చింది. ఇక ఏడాది కాలంగా నెంబర్‌ వన్‌ స్థానంలో ఉన్న బ్రెజిల్‌.. ఫిఫా వరల్డ్‌కప్‌లో మొరాకో చేతిలో 2-1తో ఓడింది.

ఆ తర్వాత బ్రెజిల్‌ ఆశించినంతగా ఆడలేక 1834.21 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయింది. ఇక బెల్జియం 1792. 53 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్‌ 1792.43 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. నెదర్లాండ్స్‌ 1731. 23 పాయింట్లతో ఆరో స్థానంలో ఉండగా.. యూరోప్‌ దేశాలైన క్రొయేషియా, ఇటలీ, పోర్చుగల్‌, స్పెయిన్‌ ఆరు నుంచి పది స్థానాల్లో నిలిచాయి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top