
వారిద్దరూ వరల్డ్ క్రికెట్‌లో పవర్ ఫుల్ జోడీ. ఒకరేమో తన యార్కర్లతో బ్యాటర్లకు చుక్కలు చూపించే ఫాస్ట్ బౌలర్.. మరొకరు తన బ్యాటింగ్‌తో బౌలర్లకు చెమటలు పట్టించే డేంజరస్ ప్లేయర్. ముఖ్యంగా ఈ జంటకు ప్రత్యర్ధి భారత్ అయితే చాలు పూనకాలు వచ్చేస్తాయి. అతడు రెండేళ్ల కిందట తన బౌలింగ్‌తో వరల్డ్‌కప్ ఫైనల్లో టీమిండియాకు గుండె కోత మిగల్చగా.. ఇప్పుడు అతడి భార్య మెరుపు బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించింది.
ఈపాటికే ఆ స్టార్ జంట ఎవరన్నది మీకు ఆర్ధమై ఉంటుంది. వారిద్దరూ ఎవరో కాదు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లు మిచెల్ స్టార్క్, అతడి భార్య అలీసా హీలీ. ఆసీస్ మెన్స్ టీమ్‌లో స్టార్క్ కీలక సభ్యునిగా కొనసాగుతుంటే.. మహిళల జట్టు కెప్టెన్‌గా హీలీ వ్యవహరిస్తోంది.
హీలీ సూపర్ సెంచరీ..
మహిళల ప్రపంచకప్-2025లో భాగంగా వైజాగ్ వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో హీలీ అద్బుతమైన సెంచరీతో చెలరేగింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు దారుణ ప్రదర్శన కనబరిచిన అలిస్సా .. భారత్‌పై మాత్రం విశ్వరూపాన్ని చూపించింది. 331 పరుగుల లక్ష్య చేధనలో ఆకాశమే హద్దుగా చెలరేగింది.
వైజాగ్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించింది. కేవలం 107 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్స్‌లతో 142 పరుగులు చేసి మ్యాచ్‌ను భారత్ నుంచి లాగేసుకుంది. ఆమె ఇన్నింగ్స్‌కు భారత అభిమానులు సైతం ఫిదా అయిపోయారు. ఆమె విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా ఆసీస్ లక్ష్యాన్ని 49 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేధించింది. ఈ వరల్డ్‌కప్‌లో ఆసీస్‌కు ఇది వరుసగా మూడో విజయం. అంతేకాకుండా మహిళల వన్డేలో అత్యధిక పరుగులు చేధించిన జట్టుగా కంగారులు నిలిచారు.
కెప్టెన్‌గా అదుర్స్..
ఆస్ట్రేలియా మహిళల జట్టు ఆల్ ఫార్మాట్ కెప్టెన్‌గా 2023లో హీలీ నియమించబడింది. అయితే అంతకుముందు చాలా మ్యాచ్‌లలో తాత్కాలిక కెప్టెన్‌గా ఆమె వ్యవహరించింది. మాగ్ లానింగ్ రిటైర్మెంట్ తర్వాత ఫుల్ టైమ్ కెప్టెన్‌గా హీలీ బాధ్యతలు స్వీకరించింది. ఆమె కెప్టెన్సీలో 55 మ్యాచ్‌లు ఆడిన ఆసీస్..42 మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఇప్పుడు వన్డే ప్రపంచకప్‌లో టైటిల్ ఫేవరేట్‌గా ఆసీస్ బరిలోకి దిగింది. ఆస్ట్రేలియా పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది.

ప్రేమించి పెళ్లాడి..
మిచెల్ స్టార్క్, హీలీది ప్రేమ వివాహం. దాదాపు 10 ఏళ్ల పాటు ప్రేమించుకున్న తర్వాత వీరు 2016లో పెళ్లి చేసుకున్నారు. సిడ్నీకి చెందిన వీరిద్దరికి 9 ఏళ్ల వయస్సు నుంచే పరిచయం ఉంది. వారిద్దరూ అండర్-10 క్రికెట్ టోర్నీల్లో ఒకే జట్టు ప్రాతినిథ్యం వహించేవారు. 15 ఏళ్ల వరకు ఒకే టీంకు ఆడిన వీరు అనంతరం విడిపోయారు. పురుషుల జట్టుకు ఆడేందుకు స్టార్క్ వెళ్లగా... మహిళల జట్టుకు ఆడేందుకు హేలీ సిద్ధమైంది. 2013లో స్టార్క్ హేలీపై తన ప్రేమను బయటపెట్టాడు. అందుకు హీలీ కూడా ఓకే చెప్పడంతో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.