ఓటమి ఎరుగని టీమిండియా.. విండీస్‌పై ఘన విజయం

Womens T20I Tri Series 2023: India Beat West Indies By 8 Wickets - Sakshi

Womens T20I Tri Series South Africa 2023: సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న ముక్కోణపు మహిళల టీ20 టోర్నీలో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. సౌతాఫ్రికా, వెస్టిండీస్‌ జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో (వర్షం కారణంగా ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు) తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్న భారత్‌.. ఇవాళ (జనవరి 30) విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన భారత్‌.. దీప్తి శర్మ (4-2-11-3), పూజా వస్త్రాకర్‌ (4-1-19-2) గైక్వాడ్‌ (4-1-9-1) బౌలింగ్‌లో సత్తా చాటడంతో విండీస్‌ను 94 పరుగులకే (6 వికెట్ల నష్టానికి) నియంత్రించింది. కెప్టెన్‌ హేలీ మాథ్యూస్‌ (34) విండీస్‌ ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోర్‌గా నిలిచింది. 95 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందు​కు బరిలోకి దిగిన భారత్‌.. జెమీమా రోడ్రిగ్స్‌ (42 నాటౌట్‌), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (32 నాటౌట్‌) అజేయ ఇన్నింగ్స్‌లతో రాణించడంతో 13.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది.

స్మృతి మంధన (5), హర్లీన్‌ డియోల్‌ (13) తక్కువ స్కోర్‌లకే ఔట్‌ కాగా.. విండీస్‌ బౌలర్లలో షమీలియా కాన్నెల్‌, హేలీ మాథ్యూస్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. ఈ గెలుపుతో సంబంధం లేకుండా ఇదివరకే ఫైనల్‌కు చేరిన భారత్‌.. ఫిబ్రవరి 2న టైటిల్‌ పోరులో సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top