
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (Women's Cricket World Cup 2025) భారత్, పాకిస్తాన్ (India VS Pakistan) మ్యాచ్ టాస్ గందరగోళం మధ్య ప్రారంభమైంది. కొలొంబోలోని ప్రేమదాస వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా టాస్ గెలిచినట్లు రిఫరీ షాండ్రే ఫ్రిట్జ్, అనౌన్సర్ మెల్ జోన్స్ ప్రకటించారు. వాస్తవానికి పాక్ కెప్టెన్ టాస్ గెలవలేదు.
భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టాస్ వేయగానే ఫాతిమా "టెయిల్స్" అని చెప్పింది. కానీ రిఫరీ ఫ్రిట్జ్, అనౌన్సర్ మెల్ జోన్స్ "హెడ్స్"గా వినిపించుకున్నారు. తీరా నాణెం "హెడ్స్"గా పడడంతో టాస్ పాకిస్తాన్ గెలిచిందని ప్రకటించారు. టాస్ గెలిచిన ఫాతిమా ఫీల్డింగ్ ఎంచుకోగా, దీనిపై భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల పురుషుల ఆసియా కప్‌లో జరిగిన విధంగానే టాస్ అనంతరం భారత కెప్టెన్ పాక్ కెప్టెన్‌కు హ్యాండ్ షేక్ ఇవ్వలేదు. టాస్ ఫలితం వెలువడగానే ఇరువురు కెప్టెన్లు చెరో దిక్కు అయ్యారు. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగాయి.
భారత్ తరఫున అమన్‌జోత్ అనారోగ్యంతో బాధపడుతుండటంతో రేణుకా సింగ్‌కి అవకాశం ఇచ్చారు. పాకిస్తాన్ తరఫున ఒమైమా సోహాలీ స్థానంలో సదాఫ్ షమాస్ జట్టులోకి వచ్చింది.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ సగం ఓవర్లు పూర్తయ్యే సమయానికి 3 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధన (23), ప్రతీక రావల్ (31), హర్మన్‌ప్రీత్ (19) ఔట్ కాగా.. హర్లీన్ డియోల్ (31), జెమీమా రోడ్రిగెజ్ (1) క్రీజ్‌లో ఉన్నారు.
కాగా, పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఇటీవల ముగిసిన పురుషుల ఆసియా కప్‌లో భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు హ్యాండ్ షేక్‌కు నిరాకరించారు. ఈ టోర్నీలో భారత్ విజేతగా నిలిచిన తర్వాత ఏసీసీ అధ్యక్షుడిగా ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహిసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకునేందుకు నిరాకరించింది.
చదవండి: భారత్ నా మాతృభూమి, దేవాలయం లాంటిది: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు