రోహిత్‌ కంటే విరాట్‌ ఎంతో బెటర్‌.. ఎందుకు మరోసారి కెప్టెన్సీ చేయకూడదు..? | Why Is Virat Kohli Not Leading Indias Test Side: Subramaniam Badrinath On Centurion Loss - Sakshi
Sakshi News home page

Subramaniam Badirnath: రోహిత్‌ కంటే విరాట్‌ ఎంతో బెటర్‌.. ఎందుకు మరోసారి కెప్టెన్సీ చేయకూడదు..?

Published Sat, Dec 30 2023 1:40 PM

Why is Virat Kohli not leading Indias Test side: Subramaniam Badrinath - Sakshi

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్‌ 32 పరుగుల తేడాతో టీమిండియా ఘోర ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండు విభాగాల్లోనూ భారత జట్టు దారుణంగా విఫలమైంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్‌ శర్మ కెప్టెన్సీపై ప్రశ్నల వర్షం కురిపించాడు. విరాట్‌ కోహ్లి మరోసారి టెస్టుల్లో భారత జట్టును నడిపించాలని బద్రీనాథ్ అభిప్రాయపడ్డాడు.

"విరాట్‌ కోహ్లికి టెస్టు కెప్టెన్‌గా అద్బుతమైన రికార్డు ఉంది. సారథిగా అతడు జట్టు ఎన్నో చారిత్రత్మక​ విజయాలను అందించాడు. వ్యక్తిగత ప్రదర్శన పరంగా కూడా 52 పైగా సగటుతో 5000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. అతడు 68 టెస్టుల్లో భారత జట్టుకు నాయకత్వం వహిస్తే.. 40 మ్యాచ్‌ల్లో టీమిండియా గెలుపొందింది. కేవలం 17 మ్యాచ్‌ల్లో మాత్రమే ఓటమి పాలైంది.

గ్రేమ్ స్మిత్, రికీ పాంటింగ్, స్టీవ్ వా తర్వాత టెస్ట్ కెప్టెన్‌గా అత్యధిక విజయాలు సాధించాడు. అద్భుతమైన రికార్డు ఉన్న విరాట్‌ మరోసారి టెస్టుల్లో జట్టు పగ్గాలను ఎందుకు చేపట్టకూడదు? ఈ ప్రశ్నకు ఇదే సరైన సమయం అని భావిస్తున్నాను. టెస్టుల్లో విరాట్‌ను రోహిత్‌తో పోల్చడం సరికాదు.

టెస్టు క్రికెట్‌లో రోహిత్‌ కంటే కోహ్లి అద్బుతమైన ఆటగాడు. అతడు విదేశాల్లో కూడా భారీగా పరుగులు సాధించాడు. రోహిత్‌కు విదేశాల్లో మంచి రికార్డు లేదు. విదేశాల్లో ఓపెనర్‌గా రోహిత్‌ ఇప్పటి వరకు తనకు తాను నిరూపించుకోలేకపోయాడు. అటువంటిది ఏకంగా జట్టు సారథ్య బాధ్యతలను అప్పగించారు. నా వరకు అయితే ఇది సరైన నిర్ణయం కాదని" తన యూట్యూబ్‌ ఛానల్‌లో బద్రీనాథ్ పేర్కొన్నాడు.

కాగా 2022లో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ ఓటమి అనంతరం టీమిండియా టెస్టు కెప్టెన్సీ నుంచి విరాట్‌ కోహ్లి తప్పుకున్నాడు. అనంతరం రోహిత్‌ శర్మ భారత టెస్టు కెప్టెన్‌గా బీసీసీఐ ఎంపిక చేసింది. రోహిత్‌ సారథ్యంలో భారత్‌ ఇప్పటివరకు 10 టెస్టులు ఆడగా.. ఐదింట విజయం సాధించింది. 2 మ్యాచ్‌లు డ్రా కాగా.. మూడు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది.
చదవండి: IND vs SA 2nd Test: టీమిండియాతో రెండో టెస్టు.. సౌతాఫ్రికాకు మరో ఊహించని షాక్‌

Advertisement
Advertisement