
Photo Courtesy: BCCI
మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు ఐపీఎల్-2025 (IPL 2025)లో గెలుపు బాట పట్టింది. లక్నో సూపర్ జెయింట్స్ (LSG vs CSK)పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి.. తమ పరాజయ పరంపరకు బ్రేక్ వేసింది. సమిష్టి ప్రదర్శనతో ఈ సీజన్‌లో రెండో గెలుపు నమోదు చేసింది.
రిషభ్ పంత్ తొలిసారి
లక్నోలోని ఏకనా స్టేడియంలో సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై తొలుత బౌలింగ్ చేసింది. బౌలర్లు రాణించడంతో లక్నోను 166 పరుగులకు కట్టడి చేయగలిగింది. లక్నో ఆటగాళ్లలో ఓపెనర్ మిచెల్ మార్ష్ (30), ఆయుశ్ బదోని (22), అబ్దుల్ సమద్ (20) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ రిషభ్ పంత్ ఈ సీజన్‌లో తొలిసారి బ్యాట్ ఝులిపించాడు. 49 బంతుల్లో 63 పరుగులతో రాణించాడు.
ఇక సీఎస్‌కే బౌలర్లలో మతీశ పతిరణ, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
పొదుపుగా బౌలింగ్ చేసిన నూర్
మిగతా వాళ్లలో నూర్ అహ్మద్ అత్యంత పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఈ స్పిన్ బౌలర్ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 13 పరుగులే ఇచ్చాడు. ఇక లక్నో విధించిన లక్ష్యాన్ని ధోని సేన 19.3 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్లు షేక్ రషీద్ (19 బంతుల్లో 27), రచిన్ రవీంద్ర (22 బంతుల్లో 37) ఫర్వాలేదనిపించగా.. శివం దూబే (37 బంతుల్లో 43 నాటౌట్) నిలకడగా ఆడాడు. ఆఖర్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ధోని 11 బంతుల్లో 26 పరుగులతో అజేయంగా నిలిచి దూబేతో కలిసి జట్టు గెలుపును ఖరారు చేశాడు.
ఈ నేపథ్యంలో విజయానంతరం చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మాట్లాడుతూ.. ‘‘మ్యాచ్ గెలవడం ఎంతో సంతోషంగా ఉంది. దురదృష్టవశాత్తూ వివిధ కారణాల వల్ల మేము ఆరంభ మ్యాచ్‌లలో విఫలమయ్యాం. సొంత మైదానం చెపాక్‌లో ఓటములు చవిచూశాం.
ఘనమైన భవిష్యత్తు
ఇలాంటి సమయంలో ఇతర వేదికపై గెలవడం కాస్త ఊరట కలిగించే అంశం. జట్టులో మళ్లీ ఆత్మవిశ్వాసం నింపిన విజయం ఇది. పవర్ ప్లేలో మేము ఈసారి కూడా ఇబ్బందిపడ్డాం. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయాం.
అయినప్పటికీ తిరిగి పుంజుకున్నాం. ఈరోజు మా బౌలర్లు, బ్యాటర్లు మెరుగ్గా రాణించారు. షేక్ రషీద్ మాతో చాన్నాళ్లుగా ప్రయాణం చేస్తున్నాడు. నెట్స్‌లో స్పిన్నర్లు, పేసర్లను ఎదుర్కొంటున్నాడు. ఈరోజు అతడు మ్యాచ్ ఆడాడు. ఇది ఆరంభం మాత్రమే. భవిష్యత్తులో గొప్పగా రాణించగల సత్తా అతడికి ఉంది.
ఈ అవార్డు నాకెందుకు?.. అతడికి ఇవ్వాల్సింది
ఇక ఈరోజైతే నాకు.. ‘నాకు ఎందుకు ఈ అవార్డు ఇస్తున్నారు?’ అని అనిపించింది. నిజానికి నూర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు కదా!’’ అని పేర్కొన్నాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ను నూర్ అహ్మద్‌కు ఇచ్చి ఉంటే బాగుండేదని ధోని అభిప్రాయపడ్డాడు.
కాగా ఐపీఎల్-2025లో తొలి మ్యాచ్‌లో ముంబైని ఓడించిన చెన్నై.. ఆ తర్వాత వరుసగా ఐదు మ్యాచ్‌లలో ఓడింది. తాజాగా లక్నోపై గెలిచినప్పటికీ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం చివర్లోనే కొనసాగుతోంది.
ఐపీఎల్ 2025: లక్నో వర్సెస్ చెన్నై
👉లక్నో స్కోరు: 166/7 (20)
👉చెన్నై స్కోరు: 168/5 (19.3)
👉ఫలితం: ఐదు వికెట్ల తేడాతో లక్నోపై చెన్నై గెలుపు
👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మహేంద్ర సింగ్ ధోని.
చదవండి: IPL 2025: ఎస్ఆర్‌హెచ్ జట్టులోకి విధ్వంసకర వీరుడు..
The IMPACT player does it with MAX IMPACT 🤩
Shivam Dube 🤝 MS Dhoni with a match-winning partnership 💛@ChennaiIPL are 🔙 to winning ways 😎
Scorecard ▶ https://t.co/jHrifBlqQC #TATAIPL | #LSGvCSK pic.twitter.com/AI2hJkT9Dt— IndianPremierLeague (@IPL) April 14, 2025