వైభవ్‌ ‘అరంగేట్రం’పై విమర్శలు.. స్పందించిన బీసీసీఐ | Who deserve it: BCCI Slams Vaibhav Sooryavanshi Critics After Debut | Sakshi
Sakshi News home page

వైభవ్‌ ‘అరంగేట్రం’పై విమర్శలు.. స్పందించిన బీసీసీఐ

Jul 6 2026 12:11 PM | Updated on Jul 6 2026 12:46 PM

Who deserve it: BCCI Slams Vaibhav Sooryavanshi Critics After Debut

వైభవ్‌ సూర్యవంశీ (PC: BCCI X)

భారత యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ ఎట్టకేలకు అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఇంగ్లండ్‌తో రెండో టీ20 సందర్భంగా ఈ బిహారీ పిల్లాడు టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. తద్వారా భారత క్రికెట్‌ చరిత్రలో అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.

సంజూ స్థానంలో...
కేవలం పదిహేనేళ్ల 99 రోజుల వయసులో వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఈ ఘనత సాధించాడు. గత మూడు మ్యాచ్‌లలో విఫలమైన ఓపెనింగ్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ స్థానంలో వైభవ్‌ తుదిజట్టులోకి వచ్చాడు. అభిషేక్‌ శర్మతో కలిసి భారత ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఈ లెఫ్టాండ్‌ బ్యాటర్‌ పది బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్ల సాయంతో 14 పరుగులు చేసి నిష్క్రమించాడు.

అయితే, వైభవ్‌ను ఐర్లాండ్‌ పర్యటనలోనే అరంగేట్రం చేయాల్సిందంటూ విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. యాజమాన్యం కావాలనే అతడిని వేచి చూసేలా చేస్తోందంటూ పలువురు మాజీ క్రికెటర్లు సైతం విమర్శించారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా స్పందించాడు.

విమర్శలపై బీసీసీఐ స్పందన
వైభవ్‌ సూర్యవంశీ అరంగేట్రం నేపథ్యంలో ANIతో మాట్లాడుతూ.. ‘‘అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన వైభవ్‌ సూర్యవంశీకి శుభాభినందనలు. గొప్ప అవకాశం అందుకున్నావు. బీసీసీఐ ఎవరి విషయంలోనూ అన్యాయంగా ప్రవర్తించదు. వివక్ష చూపించదు.

అర్హత ఉన్న వాళ్లకు కచ్చితంగా అవకాశం ఇస్తుంది. అయితే, వైభవ్‌ అరంగేట్రానికి ముందు సోషల్‌ మీడియాలో ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. అతడికి అవకాశాలు ఇవ్వడం లేదంటూ కొంతమంది గగ్గోలు పెట్టారు. కోచ్‌, కెప్టెన్‌ను నిందించారు. కానీ అందులో అర్థం లేదు.

సరైన సమయం వచ్చినపుడు వైభవ్‌ తప్పకుండా అరంగేట్రం చేస్తాడని నేను ముందు నుంచే చెప్తున్నాను. అందుకు తగ్గట్లుగా శనివారం అతడు తన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడాడు. గొప్పగా ఆడుతూ భవిష్యత్తును బంగారం చేసుకుంటాడని నమ్ముతున్నాను. వైభవ్‌ విషయంలో యాజమాన్యం అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. అందుకు వారిని తప్పక ప్రశంసించాల్సిందే’’ అని రాజీవ్‌ శుక్లా పేర్కొన్నాడు.

ఇదిలా ఉంటే.. మాంచెస్టర్‌ వేదికగా ఇంగ్లండ్‌తో రెండో టీ20లో భారత్‌ నాలుగు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. ఇక ఇరుజట్ల మధ్య తొలి టీ20 వర్షం వల్ల రద్దైన సంగతి తెలిసిందే.

చదవండి: వైభవ్‌ తప్పు చేశాడు: గావస్కర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement