
వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్-2025లో (WCL) సౌతాఫ్రికా లెజెండ్స్ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఇవాళ (జులై 27) ఆస్ట్రేలియా లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 95 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. తద్వారా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి సెమీస్‌కు అర్హత సాధించారు.
ఈ మ్యాచ్ ఫలితంతో సౌతాఫ్రికాతో పాటు పాకిస్తాన్, ఆస్ట్రేలియా కూడా సెమీస్‌కు అర్హత సాధించాయి. నాలుగో బెర్త్ కోసం వెస్టిండీస్, ఇంగ్లండ్, భారత్ మధ్య పోటీ జరుగుతుంది. ఈ టోర్నీలో భారత్ ఆడిన 3 మ్యాచ్‌ల్లో రెండు ఓడి ప్రస్తుతం చివరి స్థానంలో ఉంది. పాకిస్తాన్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను భారత్ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఇవాళ రాత్రి భారత్ ఇంగ్లండ్‌తో తలపడుతుంది.
డివిలియర్స్ మహొగ్రరూపం
ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. ఏబీ డివిలియర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో అతి భారీ స్కోర్ చేసింది. ఏబీడి కేవలం 39 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి విధ్వంసం సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 46 బంతులు ఎదుర్కొని 15 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 123 పరుగులు చేశాడు.
ఏబీడీతో పాటు మరో ఓపెనర్ జేజే స్మట్స్ కూడా సునామీ ఇన్నింగ్స్‌తో (53 బంతుల్లో 85; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) విరుచుకుపడటంతో సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా.. ఆరోన్ ఫాంగిసో (3.4-0-13-4), ఇమ్రాన్ తాహిర్ (4-0-27-3) చెలరేగడంతో 16.4 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో బెన్ కటింగ్ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కటింగ్ 29 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 59 పరుగులు చేశాడు.
అంతకుముందు 41 బంతుల్లో..!
WCL 2025లో ఏబీడీ తొలి మ్యాచ్ నుంచే అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. భారత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 30 బంతుల్లో అజేయమైన 63 పరుగులు చేసిన అతను.. మూడు రోజుల కిందట ఇంగ్లండ్‌పై 41 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఆ మ్యాచ్‌లో మొత్తంగా 51 బంతులు ఎదుర్కొన్న ఏబీడీ అజేయమైన 116 పరుగులు చేశాడు.