త్వరలో న్యూజిలాండ్‌తో జరుగబోయే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. న్యూజిలాండ్‌తో తొలి వన్డే సందర్భంగా గాయపడిన కీలక ఆటగాడు వాషింగ్టన్ సుందర్.. టీ20 సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. సుందర్ ప్రపంచకప్‌లో పాల్గొనేది కూడా అనుమానంగా మారింది. న్యూజిలాండ్ టీ20 సిరీస్‌కు వరల్డ్‌కప్‌కు ఒకే జట్టును ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
సుందర్‌కు ఏమైంది..?
జనవరి 11న వడోదరలో జరిగిన తొలి వన్డేలో బౌలింగ్ చేస్తుండగా సుందర్ ఎడమ వైపు పక్కటెముకల ప్రాంతంలో తీవ్రమైన నొప్పి వచ్చింది. దీంతో అతను ఉన్నపళంగా మైదానం వదిలి వెళ్లాడు. అయితే, ఛేదనలో అతని బ్యాటింగ్ సేవలు జట్టుకు అవసరం కావడంతో రిస్క్ చేసి బరిలోకి దిగాడు. ఈ ప్రయత్నమే సుందర్ గాయాన్ని మరింత పెంచిందని వైద్యులు భావిస్తున్నారు.
ఆ మ్యాచ్‌లో సుందర్ తనవంతుగా 7 పరుగులు చేసి జట్టు విజయంలో భాగమయ్యాడు. అనివార్యం కావడంతో బ్యాటింగ్ చేసిన సుందర్, ఆతర్వాత వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అతని స్థానాన్ని ఆయుశ్ బదోనితో భర్తీ చేశాడు. సుందర్ గాయం తీవ్రత అధికంగా ఉండటంతో తాజాగా అతన్ని టీ20 సిరీస్ నుంచి కూడా తప్పించారు.
టీ20లకు సుందర్ ప్రత్యామ్నాయాన్ని ఇంకా ప్రకటించలేదు. పరిస్థితలు చూస్తుంటే సుందర్ టీ20 వరల్డ్‌కప్‌కు కూడా అనుమానమేనని తెలుస్తుంది. పొట్టి ఫార్మాట్‌లో సుందర్ లాంటి కీలకమైన మిడిలార్డర్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ లేకపోవడం టీమిండియా విజయావాకాశాలను తప్పక ప్రభావితం చేస్తుంది.
సుందర్ ఇటీవలికాలంలో పొట్టి ఫార్మాట్‌లో నమ్మదగిన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. ఏ సమయంలో అయినా బౌలింగ్ చేయగల సామర్థ్యం ఉండటంతో పాటు 6,7 స్థానాల్లో సైతం సమర్దవంతంగా బ్యాటింగ్ చేయగలడు.
రియాన్ పరాగ్ వస్తాడా..?
న్యూజిలాండ్ టీ20 సిరీస్‌కు సుందర్‌కు ప్రత్యామ్నాయంగా రియాన్ పరాగ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. పరాగ్ ఐపీఎల్ 2025లో ఓ మోస్తరుకు మించి రాణించాడు. 32.75 సగటున 393 పరుగులు చేశాడు. ఒకవేళ పరాగ్‌కు న్యూజిలాండ్ సిరీస్‌లో అవకాశం వచ్చి రాణిస్తే.. ప్రపంచకప్‌కు కూడా ఎంపికయ్యే అవకాశాలు లేకపోలేదు.
ఎందుకంటే ఉపఖండంలో పిచ్‌లపై స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు చాలా కీలకం. మరోవైపు వన్డేల్లో సుందర్ స్థానంలో జట్టులోకి వచ్చిన ఆయుశ్ బదోనీనే టీ20 సిరీస్‌కు కూడా కొనసాగించే అవకాశాలు కూడా లేకపోలేదు.


