ఐపీఎల్-2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు దేవ్‌దత్త్ పడిక్కల్, రజిత్ పాటిదార్ అద్బుతమైన ప్రదర్శనలు కనబరుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరిని భారత టీ20 జట్టులోకి తీసుకోవాలని పలువురు మాజీ క్రికెటర్లు బీసీసీఐ సెలక్షన్ కమిటీని సూచిస్తున్నారు. ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్ దినేష్ కార్తీక్ స్వయంగా పడిక్కల్‌ను భారత జట్టు ఎంపిక చేయాలని సిఫారస్సు చేశాడు.
ఈ నేపథ్యంలో భారత దిగ్గజ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రతీ సీజన్‌లోనూ చాలా మంది మెరుగైన ప్రదర్శన చేస్తారని, అందరిని జాతీయ జట్టులోకి తీసుకోవాలంటే కుదరదని సెహ్వాగ్ అన్నాడు. కాగా పడిక్కల్ ఎప్పుడో ఐదేళ్ల కింద భారత తరపున రెండు టీ20లు ఆడగా.. పాటిదార్ ఇప్పటివరకు ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు.
"పడిక్కల్‌ను కచ్చితంగా మళ్లీ భారత జట్టులోకి తీసుకోవాలని దినేష్ కార్తీక్ అంటున్నాడు. అయితే ప్రతీ సీజన్‌లోనూ చాలా మంది అత్యుత్తమ ప్రదర్శన చేసి టీమిండియాలో చోటు ఆశిస్తుంటారు. ఐపీఎల్‌లో బాగా ఆడిన ప్రతీ ఒక్కరికి తీసుకోవాలంటే ఎక్కడ అవుతోంది? భారత జట్టులో ప్రస్తుతం అస్సలు ఖాళీ ఉందా? భారత టీ20 సెటాప్ ప్రస్తుతం అద్భుతంగా ఉంది.
ఇటీవలే వారు వరల్డ్ ఛాంపియన్స్‌గా నిలిచారు. కాబట్టి రజత్ పటిదార్, శ్రేయస్ అయ్యర్, దేవదత్ పడిక్కల్ వంటి ఆటగాళ్లకు ప్రస్తుతం జట్టులో స్థానం లేదు. వీరికే కాదు యువ ఆటగాళ్లు వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైశ్వాల్‌కు కూడా చోటు లేదు. ఈ ఐదుగురికి అవకాశమివ్వాలంటే ఎవరిని జట్టు నుంచి తీసేయాలి చెప్పండి?" అంటూ క్రిక్‌బజ్ చర్చా కార్యక్రమంలో సెహ్వాగ్ పేర్కొన్నాడు.
చదవండి: Rishabh Pant: ఐపీఎల్‌కే దిక్కు లేదు.. ఇంకా టీమిండియా కెప్టెన్ కావాలా?


