Virat Kohli: 'చరిత్రను తిరగరాశాం.. ప్రపంచ ముగ్గురు అత్యుత్తమ పేసర్లలో షమీ ఒకడు'

Virat Kohli Winning Words After Won 1st Test Vs SA Praise Mohammed Shami - Sakshi

''షమీ ప్రస్తుతం ప్రపంచంలోనే ముగ్గురు అత్యుత్తమ పేసర్లలో ఒకడంటూ'' టీమిండియా టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పేర్కొన్నాడు. మ్యాచ్‌ విజయం అనంతరం కోహ్లి మీడియాతో మాట్లాడాడు. ''ఈ పర్యటనలో మేము శుభారంభం చేశాం. వర్షం కారణంగా ఒక రోజు ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినప్పటికి మ్యాచ్‌ గెలవడం సంతోషంగా ఉంది. సెంచూరియన్‌లో ఇంతవరకు దక్షిణాఫ్రికాను ఓడించిన జట్టు లేదు. దానిని ఈరోజు మేం తిరగరాశాం. దక్షిణాఫ్రికా పర్యటన మాకు ఎప్పుడు కష్టతరంగానే ఉంటుంది . ఇక్కడి పిచ్‌లపై బ్యాటింగ్‌ చేయడం సవాల్‌తో కూడుకున్నది.

తొలి టెస్టులో కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌లు చక్కని ఇన్నింగ్స్‌ ఆడారు. విజయంలో వారి పాత్ర మరువలేనిది. ఇక మహ్మద్‌ షమీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. క్లిష్టమైన పరిస్థితుల్లో మా బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా షమీ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయడం.. మలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లతో చెలరేగడం అతని ఫామ్‌ను చూపిస్తుంది. ఇదొక్కటి చాలు.. షమీ అద్బుతమైన బౌలర్‌ అని చెప్పడానికి. ప్రస్తుతం ప్రపంచంలోని ముగ్గురు అత్యుత్తమ పేసర్లలో షమీ ఒకడు అని గర్వంగా చెబుతున్నా'' అంటూ చెప్పుకొచ్చాడు. 

ఇక సౌతాఫ్రికాపై తొలి టెస్టులో టీమిండియా 113 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది . మూడు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మిగిలిన రెండు టెస్టుల్లో ఒక మ్యాచ్‌ గెలిచినా సిరీస్‌ సొంతమవుతుంది.  ఇక ఈ టెస్టులో టీమిండియా విజయం వెనుక ఇద్దరి పాత్ర కీలకం. ఒకరు బ్యాటింగ్‌లో రాణిస్తే.. మరొకరు బౌలింగ్‌లో మెరుపులు మెరిపించారు. వాళ్లే కేఎల్‌ రాహుల్‌, మహ్మద్‌ షమీ. కేఎల్‌ రాహుల్‌ సెంచరీతో మెరిస్తే.. షమీ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు.. రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు.. మొత్తంగా 8 వికెట్లు తీసి సౌతాఫ్రికా బ్యాట్స్‌మన్‌ను శాసించాడు. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు జనవరి 3-7 వరకు జోహన్నెస్‌బర్గ్‌ వేదికగా జరగనుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top