ఐసీసీ తాజాగా (జనవరి 21) విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో ఆసక్తికర మార్పులు చోటు చేసుకున్నాయి. గత వారం ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌లో ఉండిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఓ స్థానం కోల్పోయి రెండో స్థానానికి పడిపోయాడు. అప్పటిదాకా నంబర్-2గా ఉన్న న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు డారిల్ మిచెల్ సరికొత్త వన్డే నంబర్ వన్ బ్యాటర్‌గా అవతరించాడు.
తాజాగా భారత్‌పై ఓ అర్ద సెంచరీ సహా వరుసగా రెండు సెంచరీలు (84, 131 నాటౌట్, 137) చేయడంతో డారిల్ రేటింగ్ పాయింట్లు అమాంతం పెరిగాయి. అప్పటిదాకా టాప్ ప్లేస్‌లో ఉండిన విరాట్‌పై డారిల్ ఏకంగా 50 పాయింట్ల ఆధిక్యం సాధించాడు.
ప్రస్తుతం డారిల్ ఖాతాలో 845 రేటింగ్ పాయింట్లు ఉండగా.. విరాట్ ఖాతాలో 795 పాయింట్లు ఉన్నాయి. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో డారిల్ టాప్ ర్యాంక్‌ను కైవసం చేసుకోవడం ఇదే మొదటిసారి. భారత్‌తో సిరీస్‌లో డారిల్ చారిత్రక ప్రదర్శన చేసి, తన జట్టుకు చిరస్మరణీయ సిరీస్ విజయాన్ని (2-1) అందించాడు.
మరోవైపు రెండు వారాల కిందట టాప్ ర్యాంక్‌లో ఉండిన మరో టీమిండియా స్టార్ రోహిత్ శర్మ తాజా ర్యాంకింగ్స్‌లో మరో స్థానం దిగజారి నాలుగో స్థానానికి పడిపోయాడు. గత వారం నాలుగో స్థానంలో ఉండిన ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ మూడో స్థానానికి ఎగబాకాడు. న్యూజిలాండ్ సిరీస్‌లో రెండు అర్ద సెంచరీలతో పర్వాలేదనిపించిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఐదో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో సూపర్ సెంచరీతో అదరగొట్టిన మరో టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్ టాప్-10లోకి (10వ స్థానం) ప్రవేశించాడు. న్యూజిలాండ్ సిరీస్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన స్టార్ మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఓ స్థానం కోల్పోయి 11వ స్థానానికి పడిపోయాడు. పాకిస్తాన్ ఆటగాడు బాబర్ ఆజమ్, ఐర్లాండ్ బ్యాటర్ హ్యారీ టెక్టార్, విండీస్ ప్లేయర్ షాయ్ హోప్, శ్రీలంక ఆటగాడు చరిత్ అసలంక వరుసగా 6 నుంచి 9 స్థానాల్లో కొనసాగుతున్నారు.
తాజాగా ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ గణనీయంగా లబ్ది పొందాడు. భారత్‌తో మూడో వన్డేలో సూపర్ సెంచరీతో అలరించిన ఫిలిప్స్ ఏకంగా 16 స్థానాలు ఎగబాకి 20వ స్థానానికి చేరాడు.
బౌలర్ల విభాగంలో ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 710 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. శ్రీలంక స్పిన్నర్ మహీష్ తీక్షణ, దక్షిణాఫ్రికా బౌలర్ కేశవ్ మహారాజ్, నమీబియా బౌలర్ బెర్నార్డ్ స్కోల్ట్జ్ తలో స్థానాన్ని మెరుగుపర్చుకొని టాప్-5లో ఉన్నారు.
న్యూజిలాండ్ సిరీస్‌లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ నాలుగు స్థానాలు కోల్పోయి ఏడో స్థానానికి పడిపోయాడు. భారత్‌తో సిరీస్‌లో బరిలోకి దిగని న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ సైతం 3 స్థానాలు కోల్పోయి పదో స్థానానికి పడిపోయాడు.
న్యూజిలాండ్ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన భారత యువ పేసర్ హర్షిత్ రాణా ఏకంగా 27 స్థానాలు ఎగబాకి 50వ స్థానానికి చేరాడు. మరో భారత పేసర్ అర్షదీప్ సింగ్ 15 స్థానాలు ఎగబాకి 56వ స్థానానికి చేరాడు. భారత్‌తో సిరీస్‌లో న్యూజిలాండ్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన మైఖేల్ బ్రేస్‌వెల్ 6 స్థానాలు మెరుగుపర్చుకొని 33వ స్థానానికి ఎగబాకాడు.
ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు అజ్మతుల్లా ఒమర్‌జాయ్, జింబాబ్వే సికందర్ రజా, ఆఫ్ఘనిస్తాన్ వెటరన్ మహ్మద్ నబీ టాప్-3లో కొనసాగుతున్నారు.


