
రిటైర్మెంట్‌కు సమయం వచ్చినట్లే
విరాట్ కోహ్లి వ్యాఖ్య
లండన్: ఇంగ్లండ్ పర్యటన ఆరంభానికి కొద్దిరోజుల ముందు విరాట్ కోహ్లి టెస్టు క్రికెట్‌కు అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇంకా ఎంతో ఆడగలిగే సత్తా ఉండి కూడా తప్పుకోవడం పట్ల అన్ని వైపుల నుంచి ఆశ్చర్యం వ్యక్తమైంది. ఇప్పుడు దీనికి సంబంధించి స్వయంగా కోహ్లి హాస్యోక్తంగా జవాబిచ్చాడు. మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఫౌండేషన్ నిధుల సేకరణ కార్యక్రమంలో అతను పాల్గొన్నాడు. మైదానంలో కోహ్లి లేని లోటు కనిపిస్తోందంటూ వ్యాఖ్యాత చెప్పడంతో దానికి స్పందిస్తూ అతను తన రిటైర్మెంట్‌పై సరదా వ్యాఖ్య చేశాడు.

‘నా గడ్డానికి రెండు రోజుల క్రితమే రంగు వేసుకున్నాను. ప్రతీ నాలుగు రోజులకు ఒకసారి ఇలా గడ్డానికి రంగు వేసుకోవాల్సి వస్తోందంటేనే మీరు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకునే సమయం వచ్చిందని అర్థం చేసుకోవాలి’ అని విరాట్ అన్నాడు. ప్రస్తుతం కోహ్లి లండన్‌లో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రవిశాస్త్రిని ఉద్దేశించి మాట్లాడిన కోహ్లి అతనితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. ‘భారత జట్టు టెస్టుల్లో సాధించిన కొన్ని ఘనతలు రవిశాస్త్రి సహకారం లేకపోతే సాధ్యం కాకపోయేవి.
మేమిద్దరం ఎంతో స్పష్టతతో కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకున్నాం. మీడియా సమావేశాల్లో కఠిన ప్రశ్నలు తనే ఎదుర్కొంటూ నాకు కూడా కీలక సమయాల్లో ఆయన ఎంతో అండగా నిలిచారు. అందుకే ఆయనంటే నాకు ఎంతో గౌరవం. నా కెరీర్ ప్రయాణంలో రవిశాస్త్రికి కూడా ప్రధాన పాత్ర ఉంది’ అని కోహ్లి చెప్పాడు. గత 15 ఏళ్ల కాలంలో భారత జట్టుపై అత్యంత ప్రభావం చూపించిన ఆటగాడిగా కోహ్లి నిలిచాడని రవిశాస్త్రి కితాబిచ్చాడు.
స్టార్లు హాజరు...
యువరాజ్ సింగ్‌కు చెందిన ‘యు వి కెన్’ ఫౌండేషన్ నిధుల సేకరణ కార్యక్రమం లండన్‌లో పెద్ద స్థాయిలో జరిగింది. భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన కుటుంబంతో సహా దీనికి హాజరయ్యాడు. కోహ్లితో పాటు పలువురు దిగ్గజాలు బ్రియాన్ లారా, క్రిస్ గేల్, కెవిన్ పీటర్సన్ తదితరులు కూడా ఇందులో పాల్గొన్నారు. శుబ్‌మన్ గిల్ సారథ్యంలో భారత క్రికెట్ టీమ్ సభ్యులంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. టీమిండియా ఆటగాళ్లు అక్కడి నుంచి నిష్క్రమించిన తర్వాతే కోహ్లి వచ్చాడు.
ఈ కార్యక్రమంలో ప్రస్తుత, మాజీ ఆటగాళ్లంతా ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కీపర్ రిషభ్ పంత్ పాల్గొన్న వేలం ఇక్కడ హైలైట్‌గా నిలిచింది. కళాకృతులతో ప్రత్యేకంగా రూపొందించింన ఒక బ్యాట్‌ను భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు అందించే అవకాశం కోసం వేలం జరిగింది. అక్కడికి వచ్చిన అతిథులతో వేలంలో పోటీ పడిన పంత్ 17 వేల పౌండ్లకు (సుమారు రూ.20 లక్షలు) ఆ చాన్స్‌ను దక్కించుకోవడం విశేషం. ఈ కార్యక్రమం ద్వారా యువరాజ్ ఫౌండేషన్‌కు సుమారు రూ.12 కోట్ల నిధులు వచ్చాయి.