ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్న పడిక్కల్‌.. మరో సెంచరీ | Vijay Hazare Trophy 2023: Devdutt Padikkal Scores Yet Another Century, 2 Hundreds And 3 Fifties In 5 Innings - Sakshi
Sakshi News home page

ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్న పడిక్కల్‌.. మరో సెంచరీ

Published Fri, Dec 1 2023 1:11 PM

Vijay Hazare Trophy 2023: Devdutt Padikkal Scores Yet Another Century, 2 Hundreds And 3 Fifties In 5 Innings - Sakshi

విజయ్‌ హాజరే ట్రోఫీ 2023లో కర్ణాటక ఆటగాడు దేవ్‌దత్‌ పడిక్కల్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే సెంచరీ (117), మూడు మెరుపు హాఫ్‌ సెంచరీలు (71 నాటౌట్‌, 70 నాటౌట్‌, 93 నాటౌట్‌) సాధించిన అతను.. తాజాగా మరో శతకంతో విరుచుకుపడ్డాడు. చండీఘడ్‌తో ఇవాళ (డిసెంబర్‌ 1) జరుగుతున్న మ్యాచ్‌లో 103 బంతులు ఎదుర్కొన్న పడిక్కల్‌.. 9 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 114 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఐదు ఇన్నింగ్స్‌లు ఆడిన ఈ కర్ణాటక బ్యాటర్‌..  2 సెంచరీలు, 3 హాఫ్‌ సెంచరీల సాయంతో 434 పరుగులు చేసి లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. 

ఐపీఎల్‌ 2024కు సంబంధించి ఇటీవలే రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి లక్నో సూపర్‌ జెయింట్స్‌కు ట్రేడింగ్‌ అయిన పడిక్కల్‌.. తన లిస్ట్‌-ఏ కెరీర్‌లో 29 ఇన్నింగ్స్‌లు ఆడి 5 శతకాలు, 11 హాఫ్‌ సెంచరీలు సాధించి విజయవంతమైన దేశవాలీ బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 

మ్యాచ్‌ విషయానికొస్తే.. చండీఘడ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన కర్ణాటక నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. కర్ణాటక ఇన్నింగ్స్‌లో పడిక్కల్‌తో పాటు నికిన్‌ జోస్‌ (96), మనీశ్‌ పాండే (53 నాటౌట్‌) రాణించారు. మయాంక్‌ అగర్వాల్‌ (19) మరో మ్యాచ్‌లో విఫలమయ్యాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన కర్ణాటక అన్నింటిలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది.   
 

Advertisement
 
Advertisement
 
Advertisement