15 ఏళ్ల 99 రోజులు.. | Vaibhav Suryavanshi Makes His Senior Cricket Debut International Cricket Team After Stunning Youth Career | Sakshi
Sakshi News home page

15 ఏళ్ల 99 రోజులు..

Jul 5 2026 10:50 AM | Updated on Jul 5 2026 12:01 PM

Vaibhav Suryavanshi Makes His Senior Cricket Debut International Cricket Team

సీనియర్‌ క్రికెట్‌లో వైభవ్‌ సూర్యవంశీ అరంగేట్రం

అతి పిన్న వయస్కుడైన భారత ఆటగాడిగా గుర్తింపు

12 ఏళ్ల 284 రోజుల వయసులో తొలి రంజీ ట్రోఫీ మ్యాచ్‌... ఈ మైలురాయితోనే అందరి దృష్టినీ ఆకర్షించిన వైభవ్‌ సూర్యవంశీ సరిగ్గా రెండున్నరేళ్ల తర్వాత భారత సీనియర్‌ జట్టు ఆటగాడిగా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. ఈ మధ్య కాలంలో అతను చూపించిన ఎన్నో అద్భుత ప్రదర్శనలు, సంచలన ఇన్నింగ్స్‌లు చర్చనీయాంశంగా నిలిచాయి.

తక్కువ వయసుకు సంబంధించి వరుసగా ఎన్నో ఫీట్‌లు నమోదు చేయడం ఒక ఘనత కాగా... వయసుతో సంబంధం లేకుండా అతని విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రతీసారి అందరినీ అలరించడం వైభవ్‌ ప్రత్యేకతగా నిలిచింది. అలవోకగా సిక్సర్లు బాదే అతని నైపుణ్యం అందరితో ఔరా అనిపించేలా చేసింది. ఆ్రస్టేలియా అండర్‌–19 జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 58 బంతుల్లోనే సెంచరీ సాధించిన (13 ఏళ్ల 187 రోజుల్లో) కొద్ది రోజులకే ఐపీఎల్‌ వేలంలో రాజస్తాన్‌ రాయల్స్‌ రూ.1.10 కోట్లకు అతడిని ఎంచుకుంది.

2025 ఐపీఎల్‌లో 14 ఏళ్ల 23 రోజుల వయసులో ఐపీఎల్‌ ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచిన వైభవ్‌... తాను ఐపీఎల్‌లో ఆడిన తొలి బంతినే సిక్స్‌గా మలచి రాబోయే రోజులపై సంకేతం ఇచ్చాడు. ఆ తర్వాత తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ 35 బంతుల్లోనే సెంచరీ బాది సత్తా చూపించాడు.

అండర్‌–19 జట్టు సభ్యుడిగా ఇంగ్లండ్‌పై 52 బంతుల్లో సెంచరీ, ఆ తర్వాత ఆసియా కప్‌లో యూఏఈపై 95 బంతుల్లో 171 పరుగులు, విజయ్‌హజారే ట్రోఫీలో 36 బంతుల్లో సెంచరీ, ఇంగ్లండ్‌పై అండర్‌–19 ప్రపంచ కప్‌ ఫైనల్లో 80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్స్‌లతో 175, ఇండియా ‘ఎ’ తరఫున శ్రీలంకపై 29 బంతుల్లో 94 పరుగులు... ఇలా వరుసగా వచ్చిన అద్భుత ప్రదర్శనలు అతని స్థాయిని పెంచుతూ వచ్చాయి. ఇక ఐపీఎల్‌–2026లో అతని విశ్వరూపం కనిపించింది. ఏకంగా 237.30 స్ట్రైక్‌రేట్‌తో చేసిన 776 పరుగులు వైభవ్‌ను శిఖరానికి చేర్చాయి. ఇందులో 63 ఫోర్లు, రికార్డు స్థాయిలో 72 సిక్సర్లు ఉండటం విశేషం.

ఇక అప్పటినుంచి అతను భారత జట్టుకు ఆడటమే మిగిలింది అని అందరికీ అర్థమైంది. అంచనాలకు అనుగుణంగా అతనికి అవకాశం దక్కాలని అంతా కోరుకున్నారు. ఐర్లాండ్‌తో తొలి రెండు మ్యాచ్‌లకు, ఆ తర్వాత ఇంగ్లండ్‌తో తొలి టి20కి తుది జట్టులో చోటు లభించకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఎట్టకేలకు అందరూ ఎంతగానో ఎదురు చూసిన క్షణం శనివారం వచి్చంది. ఈ మ్యాచ్‌లోనూ తనదైన శైలిలో ఆర్చర్‌ బౌలింగ్‌లో ఫైన్‌లెగ్‌ దిశగా, టంగ్‌ బౌలింగ్‌ మిడ్‌వికెట్‌ మీదుగా వైభవ్‌ కొట్టిన రెండు సిక్సర్లు హైలైట్‌గా నిలిచాయి. తొలి మ్యాచ్‌లో భారీ స్కోరు చేయకపోయినా... భారత క్రికెట్‌లో అతని వైభవానికి పునాది పడినట్లే.

'ఆర్చర్‌ బౌలింగ్‌లో తాను ఆడిన తొలి బంతినే వైభవ్‌ సిక్స్‌ కొట్టాడు. అతని ‘తొలి బంతి’ బాధితుల జాబితాలో ట్రెంట్‌ బౌల్ట్, ప్యాట్‌ కమిన్స్, లుంగీ ఎన్‌గిడి, జస్‌ప్రీత్‌ బుమ్రాలాంటి స్టార్లు ఉండటం విశేషం.'

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement