UAE vs BAN: బంగ్లాదేశ్‌కు ఘోర పరాభవం.. చరిత్ర సృష్టించిన యూఏఈ | UAE Beat Bangladesh In 3rd T20I Script History Won Series | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌కు ఘోర పరాభవం.. సిరీస్‌ గెలిచిన యూఏఈ.. సరికొత్త చరిత్ర

May 22 2025 11:34 AM | Updated on May 22 2025 11:49 AM

UAE Beat Bangladesh In 3rd T20I Script History Won Series

PC: ICC

బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. యునెటైడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE) చేతిలో చిత్తుగా ఓడి టీ20 సిరీస్‌ను చేజార్చుకుంది. కాగా మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ (T20 Series) ఆడేందుకు బంగ్లాదేశ్‌ యూఏఈ పర్యటనకు వెళ్లింది.

ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య గత శనివారం (మే 17) తొలి టీ20 జరుగగా.. బంగ్లాదేశ్‌ 27 పరుగుల తేడాతో గెలిచింది. అయితే, మరుసటి మ్యాచ్‌లో యూఏఈ బంగ్లాదేశ్‌కు షాకిచ్చింది. లిటన్‌ దాస్‌ బృందాన్ని రెండు వికెట్ల తేడాతో ఓడించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది.

తాంజిద్‌ హసన్‌ ధనాధన్‌
అనంతరం బుధవారం రాత్రి జరిగిన మూడో టీ20లోనూ యూఏఈ జయభేరి మోగించింది. షార్జా క్రికెట్‌ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆతిథ్య జట్టు.. బంగ్లాదేశ్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఓపెనర్‌ పర్వేజ్‌ హొసేన్‌ ఎమాన్‌ (0) డకౌట్‌ కాగా.. మరో ఓపెనర్‌ తాంజిద్‌ హసన్‌ (18 బంతుల్లో 40) ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో అలరించాడు.

మిగతా వాళ్లలో కెప్టెన్‌ లిటన్‌ దాస్‌ (14) సహా తౌహీద్‌ హృదోయ్‌(0), మెహదీ హసన్‌ మిరాజ్‌ (2) పూర్తిగా విఫలమయ్యారు. షమీమ్‌ హొసేన్‌ (9), రిషాద్‌ హొసేన్‌ (0), తాంజిమ్‌ హసన్‌ సకీబ్‌ (6) కూడా చేతులెత్తేశారు. అయితే, ఆఖర్లో హసన్‌ మహమూద్‌ (15 బంతుల్లో 26 నాటౌట్‌), షోరిఫుల్‌ ఇస్లాం (7 బంతుల్లో 16 నాటౌట్‌) మాత్రం దంచికొట్టారు.

ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో బంగ్లాదేశ్‌ తొమ్మిది వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. యూఏఈ బౌలర్లలో హైదర్‌ అలీ మూడు వికెట్లతో చెలరేగగా.. సఘీర్‌ ఖాన్‌, మతియుల్లా ఖాన్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు. మిగతా వాళ్లలో ఆకిఫ్‌ రాజా, ధ్రువ్‌ పరాషర్‌ ఒక్కో వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు.

అర్ధ శతకంతో మెరిసిన అలిషాన్‌ షరాఫూ
ఇక లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే యూఏఈ ఓపెనర్‌, కెప్టెన్‌ ముహమద్‌ వసీం (9) అవుటయ్యాడు. అయితే, మరో ఓపెనర్‌ ముహమద్‌ జోహైబ్‌ (29)తో కలిసి వన్‌డౌన్‌ బ్యాటర్‌ అలిషాన్‌ షరాఫూ ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు. వికెట్‌ కీపర్‌ రాహుల్‌ చోప్రా (13) విఫలం కాగా.. ఆసిఫ్‌ ఖాన్‌తో కలిసి అలిషాన్‌ యూఏఈని గెలుపు తీరాలకు చేర్చాడు.

అలిషాన్‌ షరాఫూ కేవలం 47 బంతుల్లోనే 68 పరుగులతో, ఆసిఫ్‌ ఖాన్‌ 26 బంతుల్లో 41 రన్స్‌తో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే కేవలం మూడు వికెట్లు నష్టపోయి యూఏఈ లక్ష్యాన్ని ఛేదించింది.

తద్వారా బంగ్లాదేశ్‌పై ఏడు వికెట్ల తేడాతో గెలిచి టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. కాగా పొట్టి ఫార్మాట్లో యూఏఈకి బంగ్లాదేశ్‌పై ఇదే తొలి ద్వైపాక్షిక సిరీస్‌ విజయం కావడం విశేషం. ఇక ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డును అలిషాన్‌ షారిఫూ దక్కించుకోగా.. ముహమద్‌ వసీం ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’గా నిలిచాడు.

చదవండి: MI Vs DC: ముందు చేతులు శుభ్రం చేసుకో బుమ్రా!.. నీతా అంబానీ చర్య వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement