U19 Ind vs Aus Day 1 Final Update: ఆస్ట్రేలియా అండర్–19 జట్టుపై వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత అండర్–19 జట్టు అనధికారిక టెస్టు సిరీస్‌ను కూడా మెరుగ్గా ఆరంభించింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చెన్నై వేదికగా సోమవారం తొలి అనధికారిక టెస్టు ప్రారంభమైంది.
293 పరుగులకు ఆసీస్ ఆలౌట్
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 71.4 ఓవర్లలో 293 పరుగులకు ఆలౌటైంది. రిలే కింగ్‌సెల్ (77 బంతుల్లో 53; 9 ఫోర్లు, ఒక సిక్సర్), ఎయిడెన్ ఓ కానర్ (70 బంతుల్లో 61; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ శతకాలు సాధించారు.
భారత జట్టు బౌలర్లలో సమర్థ్ నాగరాజ్, మొహమ్మద్ ఇనాన్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 14 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 103 పరుగులు చేసింది.
ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ (47 బంతుల్లో 81 బ్యాటింగ్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు), విహాన్ మల్హోత్రా (21 బ్యాటింగ్, 3 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. చేతిలో 10 వికెట్లు ఉన్న యువ భారత్... ప్రత్యర్థి స్కోరుకు 190 పరుగులు వెనుకబడి ఉంది.
వైభవ్ రికార్డు అర్ధ శతకం
అంతర్జాతీయ క్రికెట్‌లో హాఫ్ సెంచరీ సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా యువ భారత్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ రికార్డుల్లోకెక్కాడు. వైభవ్ 13 సంవత్సరాల 187 రోజుల్లో ఈ ఘనత సాధించాడు. ఏ స్థాయి క్రికెట్‌లోనైనా ఇదే అతి పిన్న వయసులో అంతర్జాతీయ అర్ధసెంచరీ. అంతకుముందు ఈ రికార్డు బంగ్లాదేశ్ ప్లేయర్ నజ్ముల్ హసన్ షాంటో (14 సంవత్సరాల 231 రోజులు) పేరిట ఉంది. శ్రీలంకపై నజ్ముల్ ఈ రికార్డు నమోదు చేశాడు.
సమిత్ ద్రవిడ్‌కు గాయం
భారత అండర్–19 జట్టులో సభ్యుడైన క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ మోకాలి గాయం కారణంగా ఆ్రస్టేలియాతో అనధికారిక టెస్టు మ్యాచ్‌కు దూరమయ్యాడు. రెండో మ్యాచ్ వరకూ అతడు కోలుకోవడం అనుమానమే. ప్రస్తుతం సమిత్ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో పునరావాసం పొందుతున్నాడు.
ఇటీవల యూత్ వన్డే సిరీస్‌కు కూడా గాయం కారణంగానే దూరమైన సమిత్... కోలుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు భారత అండర్–19 జట్టు కోచ్ హృషికేశ్ కనిత్కర్ తెలిపాడు. అండర్–19 స్థాయిలో ఆడేందుకు సమిత్ ద్రవిడ్‌కు ఇదే చివరి అవకాశం కాగా... ఈ నెల 11న అతడు 19వ పడిలోకి అడుగు పెట్టనున్నాడు. దీంతో 2026లో జరగనున్న అండర్–19 ప్రపంచకప్‌లో ఆడే అర్హత కోల్పోయాడు.
Comments
Please login to add a commentAdd a comment