గ్లోబల్‌ టీ20 టోర్నీ విజేత టొరంటో నేషనల్స్‌ | Toronto Nationals Won Global T20 Canada 2024 Title | Sakshi
Sakshi News home page

బెహ్రెన్‌డార్ఫ్‌ అద్భుత ప్రదర్శన.. గ్లోబల్‌ టీ20 టోర్నీ విజేత టొరంటో నేషనల్స్‌

Aug 12 2024 2:52 PM | Updated on Aug 12 2024 2:53 PM

Toronto Nationals Won Global T20 Canada 2024 Title

గ్లోబల్‌ టీ20 కెనడా టోర్నీ విజేతగా టొరంటో నేషనల్స్‌ అవతరించింది. నిన్న (ఆగస్ట్‌ 11) జరిగిన ఫైనల్స్‌లో టొరంటో టీమ్‌.. మాంట్రియాల్‌ టైగర్స్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన మాంట్రియాల్‌ టైగర్స్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 96 పరుగులు మాత్రమే చేసింది. 

టైగర్స్‌ ఇన్నింగ్స్‌లో కోర్బిన్‌ బోష్‌ (35), జస్‌కరన్‌ సింగ్‌ (16), అనూప్‌ రవి (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. స్టార్‌ ఆటగాళ్లు క్రిస్‌ లిన్‌ (3), టిమ్‌ సీఫర్ట్‌ (0), షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ (1) నిరాశపరిచారు. టైగర్స్‌ ఇన్నింగ్స్‌ను జేసన్‌ బెహ్రెన్‌డార్ఫ్‌ (4-0-8-3) దారుణంగా దెబ్బకొట్టాడు. రొమారియో షెపర్డ్‌ 2, జునైద్‌ సిద్దిఖీ, మొహమ్మద్‌ నవాజ్‌, నిఖిల్‌ దత్తా, జతిందర్‌పాల్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

97 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నేషనల్స్‌.. ఆండ్రియస్‌ గౌస్‌ (58 నాటౌట్‌), డస్సెన్‌ (30 నాటౌట్‌) రాణించడంతో 15 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఓపెనర్లు కొలిన్‌ మున్రో (0), ఉన్ముక్త్‌ చంద్‌ (4) ఆదిలోనే ఔటైనప్పటికీ.. గౌస్‌, డస్సెన్‌ జోడీ నేషనల్స్‌ను విజయతీరాలకు చేర్చింది. టైగర్స్‌ బౌలర్లలో ఒమర్‌జాయ్‌, కోర్బిన్‌ బోష్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

గ్లోబల్‌ టీ20 కెనడా టోర్నీ నేపథ్యం..
కెనడా వేదికగా జరిగే ఈ టోర్నీ 2018లో పురుడుపోసుకుంది. ఆరంభ ఎడిషన్‌లో వాంకోవర్‌ నైట్స్‌ విజేతగా నిలిచింది. అనంతరం 2019 ఎడిషన్‌లో వాన్నిపెగ్‌ హాక్స్‌ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఆతర్వాత మూడేళ్లు టోర్నీకి బ్రేక్‌ పడింది. తిరిగి గతేడాది ఈ టోర్నీ ప్రారంభమైంది. గత ఎడిషన్‌లో మాంట్రియాల్‌ టైగర్స్‌ విజేతగా నిలిచింది. తాజాగా టొరంటో నేషనల్స్‌ ఛాంపియన్‌గా అవతరించింది.​
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement