సీఏఎస్‌ తీర్పు: భారత స్వర్ణ పతక విజేతపై నిషేధం | Tokyo Gold Medalist Pramod Bhagat Suspended From Paris Paralympics | Sakshi
Sakshi News home page

Paris Paralympics: సీఏఎస్‌ తీర్పు.. భారత్‌కు భారీ ఎదురుదెబ్బ

Aug 13 2024 11:15 AM | Updated on Aug 13 2024 1:12 PM

Tokyo Gold Medalist Pramod Bhagat Suspended From Paris Paralympics

ప్యారిస్‌ పారాలింపిక్స్‌-2024కు ముందు భారత్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. టోక్యో పారాలింపిక్‌ స్వర్ణ పతక విజేత, పారా బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ ప్రమోద్‌ భగత్‌పై వేటు పడింది. పద్దెనిమిది నెలల పాటు అతడు ఏ టోర్నీలో పాల్గొనకుండా బ్యాడ్మింటన్‌ ప్రపంచ సమాఖ్య(BWF) నిషేధం విధించింది.

అందుకే వేటు వేశాం
డోపింగ్‌ నిరోధక నిబంధనల నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించి మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘‘పన్నెండు నెలల వ్యవధిలో మూడుసార్లు పరీక్షకు రమ్మని ఆదేశించగా.. ప్రమోద్‌ భగత్‌ రాలేదు. అంతేకాదు.. ఆ సమయంలో తాను ఎక్కడ ఉన్నాను, ఎందుకు రాలేకపోయాను అన్న వివరాలు చెప్పడంలోనూ విఫలమయ్యాడు.

ఈ నేపథ్యంలో మార్చి 1, 2024.. కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఆఫ్‌ స్పోర్ట్‌(CAS) డోపింగ్‌ నిరోధక డివిజన్‌.. నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ అతడిని సస్పెండ్‌ చేసింది. ఈ క్రమంలో SL3 అథ్లెట్‌ అయిన భగత్‌.. CASను సంప్రదించి నిషేధం ఎత్తివేయాలని కోరాడు. అయితే, జూలై 29, 2024లో అతడి పిటిషన్‌ను CAS కొట్టివేసింది. మార్చి 1 నాటి డివిజన్‌ ఇచ్చిన తీర్పును సమర్థించింది’’ అని బ్యాడ్మింటన్‌ ప్రపంచ సమాఖ్య తన ప్రకటనలో ఈ మేరకు వివరాలు వెల్లడించింది.

భారత్‌కు ఎదురుదెబ్బే
కాగా శరీరంలోని ఒక పక్క మొత్తం పాక్షికంగా పనిచేయని లేదా కాలి కింది భాగం పనిచేయని.. అంటే వేగంగా నడవలేని, పరుగెత్తలేని స్థితిలో ఉన్న బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ SL3 విభాగంలో పోటీపడతారు. ఇక టోక్యో పారాలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్ ఫైనల్లో గ్రేట్‌ బ్రిటన్‌కు చెందిన డానియెల్‌ బెథెల్‌ను ఓడించిన 35 ఏళ్ల ప్రమోద్‌ భగత్‌ పసిడి పతకం గెలుచుకున్నాడు. 

అంతేకాదు.. 2015, 2019, 2022లో వరల్డ్‌ చాంపియన్‌గానూ నిలిచిన ఘనత ఈ బిహారీ పారా అథ్లెట్‌ సొంతం. ప్యారిస్‌ పారాలింపిక్స్‌లోనూ కచ్చితంగా స్వర్ణం గెలుస్తాడనే అంచనాలు ఉండగా.. ఇలా 18 నెలల పాటు అతడిపై వేటు పడటాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే.. భారత్‌ నుంచి 117 మంది క్రీడాకారులు ప్యారిస్‌ ఒలింపిక్స్‌-2024లో  పాల్గొనగా కేవలం ఆరు పతకాలే వచ్చిన విషయం తెలిసిందే. 

చదవండి: Neeraj Chopra: రూ. 52 లక్షల వాచ్‌!.. కోట్ల ఆస్తి: కష్టపడి పైకొచ్చిన నీరజ్‌ చోప్రా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement