దుమ్మురేపిన వరుణ్‌ చక్రవర్తి.. రెండో స్థానానికి ఎగబాకిన తిలక్‌ వర్మ | Tilak Varma Climbs To 2nd Place In ICC T20I Rankings, Varun Chakaravarthy Jumps 25 Places | Sakshi
Sakshi News home page

దుమ్మురేపిన వరుణ్‌ చక్రవర్తి.. రెండో స్థానానికి ఎగబాకిన తిలక్‌ వర్మ

Jan 29 2025 2:59 PM | Updated on Jan 29 2025 3:14 PM

Tilak Varma Climbs To 2nd Place In ICC T20I Rankings, Varun Chakaravarthy Jumps 25 Places

ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా (Team India) ఆటగాళ్లు సత్తా చాటారు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి (Varun Chakravarthy) ఏకంగా 25 స్థానాలు మెరుగుపర్చుకుని తొలిసారి టాప్‌-5లోకి చేరాడు. ఇంగ్లండ్‌ సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీసిన వరుణ్‌ 679 రేటింగ్‌ పాయింట్లు తన ఖాతాలో వేసుకుని ఐదో స్థానంలో నిలిచాడు.

అగ్రస్థానంలో ఆదిల్‌ రషీద్‌
భారత్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌ల్లో మూడు వికెట్లు పడగొట్టిన ఇంగ్లండ్‌ వెటరన్‌ స్పిన్నర్‌ ఆదిల్‌ రషీద్‌ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి ఎగబాకాడు. రషీద్‌ విండీస్‌ స్పిన్నర్‌ అకీల్‌ హొసేన్‌ను రెండో స్థానానికి దించి అగ్రపీఠాన్ని అధిరోహించాడు. ఆదిల్‌ రషీద్‌ ఖాతాలో 718 రేటింగ్‌ పాయింట్లు ఉండగా.. అకీల్‌ హొసేన్‌ ఖాతాలో 707 పాయింట్లు ఉన్నాయి. ఐదో స్థానంలో ఉన్న వరుణ్‌ చక్రవర్తికి టాప్‌ ప్లేస్‌లో ఉన్న ఆదిల్‌ రషీద్‌కు మధ్య కేవలం 39 రేటింగ్‌ పాయింట్ల వ్యత్యాసం ఉంది.

టాప్‌-10లోకి ఆర్చర్‌
భారత్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లో 5 వికెట్లు పడగొట్టిన ఇంగ్లండ్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ కూడా గణనీయంగా తన ర్యాంక్‌ను మెరుగుపర్చుకున్నాడు. ఆర్చర్‌ 13 స్థానాలు ఎగబాకి 6వ స్థానానికి చేరాడు. మరోవైపు భారత బౌలర్‌ అక్షర్‌ పటేల్‌ కూడా 5 స్థానాలు మెరుగుపర్చుకుని 11వ స్థానానికి చేరాడు. 

భారత్‌ నుంచి టాప్‌-10లో వరుణ్‌ చక్రవర్తి (5), అర్షదీప్‌ సింగ్‌ (9), రవి భిష్ణోయ్‌ (10) ఉన్నారు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఆశించినంతగా రాణించలేకపోయిన భిష్ణోయ్‌ 5 స్ణానాలు కోల్పోయి ఐదో స్థానం నుంచి 10వ  స్థానానికి పడిపోయాడు.

రెండో స్థానానికి ఎగబాకిన తిలక్‌
ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో మ్యాచ్‌ విన్నింగ్‌ నాక్‌ ఆడి భారత్‌ను గెలిపించిన తిలక్‌ వర్మ (Tilak Varma).. తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎగబాకాడు. తిలక్‌.. ఇంగ్లండ్‌ ఓపెనర్‌ ఫిలిప్‌ సాల్ట్‌ను కిందకు దించి రెండో స్థానానికి చేరాడు. ఆసీస్‌ విధ్వంసకర ఆటగాడు ట్రవిస్‌ హెడ్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. భారత్‌ నుంచి తిలక్‌తో పాటు సూర్యకుమార్‌ యాదవ్‌ (4), యశస్వి జైస్వాల్‌ (9) టాప్‌-10లో ఉన్నారు. 

ఇంగ్లండ్‌తో సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో చెలరేగిన అభిషేక్‌ శర్మ.. ఆతర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమైనప్పటికీ 59 స్థానాలు మెరుగుపర్చుకుని 40వ స్థానానికి చేరాడు. మరో భారత ఓపెనర్‌ సంజూ శాంసన్‌ వరుసగా మూడు వైఫల్యాల కారణంగా 12 స్థానాలు కోల్పోయి 29వ స్థానానికి పడిపోయాడు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. భారత ఆటగాడు హార్దిక్‌ పాండ్యా టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. 

Advertisement
 
Advertisement
Advertisement