
టీమిండియా యువ సంచనలం ముషీర్ ఖాన్ ఇంగ్లండ్ పర్యటనలో పట్టపగ్గాల్లేకుండా చెలరేగిపోతున్నాడు. వరుస సెంచరీలు, ఐదు వికెట్ల ప్రదర్శనలతో దుమ్మురేపుతున్నాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ ఎమర్జింగ్ టీమ్ (MCA Colts) తరఫున ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న ముషీర్ ఆల్‌రౌండర్‌గా అదరగొడుతున్నాడు.
ఈ పర్యటనలో Notts 2nd XIతో జరిగిన తొలి మ్యాచ్‌లో 127 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో 123 పరుగులు చేసిన ముషీర్.. ఆ మ్యాచ్‌లో బౌలింగ్‌లోనూ ఇరగదీసి 6 వికెట్లు ప్రదర్శన నమోదు చేశాడు.
అనంతరం జులై 3న ఛాలెంజర్స్‌తో (కంబైన్డ్ నేషనల్ కౌంటీస్) ప్రారంభమైన రెండో మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ (127 బంతుల్లో 125; 11 ఫోర్లు, సిక్స్) చేసిన ముషీర్.. బౌలింగ్‌లోనూ చెలరేగి ఆ మ్యాచ్ మొత్తంలో పది వికెట్లు (తొలి ఇన్నింగ్స్‌లో 6, రెండో ఇన్నింగ్స్‌లో 4) తీశాడు.
తాజాగా ముషీర్ లౌబరో UCCE జట్టుతో జరిగిన మ్యాచ్‌లో మరోసారి సెంచరీతో కదంతొక్కాడు. ఈ మ్యాచ్‌లో ముషీర్ 146 బంతుల్లో 22 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 154 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ముషీర్‌కు ఇంగ్లండ్ పర్యటనలో ఇది వరుసగా మూడో సెంచరీ.
హ్యాట్రిక్ సెంచరీలు, అదిరిపోయే బౌలింగ్ ప్రదర్శనలతో ఇంగ్లండ్ పర్యటనలో దుమ్మురేపుతున్న ముషీర్‌పై ప్రశంసల వర్షం కురుస్తుంది. భారత క్రికెట్‌కు మరో భవిష్యత్ తార దొరికాడని టీమిండియా అభిమానులు సంబురపడిపోతున్నారు. 20 ఏళ్ల ముషీర్ గతేడాది సెప్టెంబర్‌లో కారు ప్రమాదానికి గురైన తర్వాత ఆడుతున్న తొలి రెడ్ బాల్ టోర్నీ ఇది.
ఈ టోర్నీలో ముషీర్ ఆకాశమే హద్దుగా చెలరేగుతూ భారత సీనియర్ టీమ్ సెలెక్టర్లకు సవాలు విసురుతున్నాడు. ఇప్పటికే భారత జట్టులో చోటు కోసం తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. ముషీర్ అన్న సర్ఫరాజ్ ఖాన్ సూపర్ ఫామ్‌లో ఉన్నా టీమిండియా బెర్త్ దక్కడం లేదు.
మరోవైపు కౌంటీల్లో సత్తా చాటుతూ ఇషాన్ కిషన్, తిలక్ వర్మ కూడా భారత టెస్ట్ జట్టు బెర్త్ వైపు చూస్తున్నారు. ఇంత పోటీలో ముషీర్ టీమిండియా వైపు ఎలా వస్తాడో చూడాలి. ఇక్కడ ముషీర్‌కు ఓ అడ్వాంటేజ్ ఉంది. ముషీర్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ ఇరగదీస్తున్నాడు. లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ అయిన ముషీర్.. ఇంగ్లండ్ పర్యటనకు ముందు కూడా సత్తా చాటాడు.
ముషీర్‌కు దేశవాలీ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. 2022-23 రంజీ సీజన్‌లో ముంబై తరఫున అరంగేట్రం చేసిన ముషీర్.. ఆడిన 9 మ్యాచ్‌ల్లో 51.14 సగటున 3 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 716 పరుగులు చేశాడు. ఇందులో ఓ అజేయ డబుల్ సెంచరీ కూడా ఉంది.
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ముషీర్ బౌలర్‌గానూ రాణించాడు. 9 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీశాడు. ముషీర్ 2024 అండర్-19 వరల్డ్‌కప్‌లో భారత జట్టు సభ్యుడిగా ఉన్నాడు. టీమిండియా రన్నరప్‌గా నిలిచిన ఈ టోర్నీలో ముషీర్ రెండు సెంచరీలు చేశాడు. 2024 రంజీ ఫైనల్లో సెంచరీ చేసిన ముషీర్.. ముంబై తరఫున రంజీ ఫైనల్లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు.