
భారత మాజీ క్రికెటర్ జోస్యం
భారత క్రికెట్‌లో గత కొన్నాళ్లుగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీమిండియా జూన్‌లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే ముందే కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) టెస్టులకు వీడ్కోలు పలకగా.. దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli)కూడా సంప్రదాయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
రో- కో బైబై
అంతకంటే ముందే.. అంటే 2024లో టీమిండియా టీ20 ప్రపంచకప్ టైటిల్ సాధించిన తర్వాత రోహిత్- కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరు వన్డేల్లో మాత్రమే కొనసాగుతండగా.. ఆస్ట్రేలియా టూర్‌కు ముందు బీసీసీఐ రోహిత్‌పై వేటు వేసింది. వన్డే కెప్టెన్సీ నుంచి అతడిని తప్పించింది.
ఇప్పటికే టెస్టు జట్టు సారథిగా వ్యవహరిస్తున్న యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ (Shubman Gill)ను.. వన్డేలకూ కెప్టెన్‌గా నియమించింది. ఈ విషయం గురించి టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. మూడు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లు ఉండటం సరికాదని పేర్కొన్నాడు.
గిల్‌కే మేనేజ్‌మెంట్ మద్దతు
వన్డే వరల్డ్‌కప్-2027 టోర్నీకి పూర్తిస్థాయిలో జట్టును సిద్ధం చేసే క్రమంలో గిల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించినట్లు అగార్కర్ తెలిపాడు. అంతేకాదు.. రోహిత్- కోహ్లి వన్డే ప్రపంచకప్ టోర్నీ ఆడతామనే హామీ ఇవ్వలేదంటూ అభిమానుల హృదయాలు ముక్కలు చేశాడు.
ఇదిలా ఉంటే.. టెస్టు, వన్డే జట్లకు కెప్టెన్ అయిన గిల్.. త్వరలోనే టీ20 కెప్టెన్‌గానూ స్వీకరించబోతున్నట్లు అగార్కర్ మాటలను బట్టి అర్థమవుతోంది. ప్రస్తుతం టీమిండియా టీ20 కెప్టెన్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్-2026 తర్వాత తప్పుకొంటే.. గిల్ అతడి స్థానాన్ని భర్తీ చేస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
టెస్టులలో ఒకే.. కానీ వన్డేలలో..
ఇలాంటి తరుణంలో టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప మాత్రం భిన్నంగా స్పందించాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘టెస్టు ఫార్మాట్‌కు గిల్ కెప్టెన్ కావడం మంచి పరిణామం. అందుకు తాను అర్హుడినని ఇప్పటికే తను నిరూపించుకుంటున్నాడు.
అయితే, వన్డేల్లో మాత్రం.. గిల్ కంటే గొప్ప సామర్థ్యమున్న ఆటగాడు టీమిండియాకు దొరికేవాడు. బ్యాటర్‌గా అతడి గణాంకాలు ఫర్వాలేదు. కానీ ఇప్పటికిప్పుడు కెప్టెన్ అంటేనే కాస్త చిత్రంగా ఉంది.
శ్రేయస్ అయ్యర్ వైపు చూపు
టీ20 ఫార్మాట్లో మాత్రం ఇప్పటికీ శుబ్‌మన్ గిల్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే ప్రయత్నాల్లోనే ఉన్నాడు. నాకు తెలిసి టీ20 భవిష్య కెప్టెన్‌గా యాజమాన్యం శ్రేయస్ అయ్యర్ వైపు దృష్టి సారించే అవకాశం ఉందనిపిస్తోంది’’ అని భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప అభిప్రాయపడ్డాడు.
కాగా ఫిట్‌నెస్ సమస్యల కారణంగా ఇటీవల టెస్టు ఫార్మాట్ నుంచి విరామం తీసుకున్న శ్రేయస్ అయ్యర్.. వన్డేల్లో మాత్రం సత్తా చాటుతున్నాడు. ఇటీవల ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా తరఫున టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.
జట్టులోనే స్థానం లేదు
మరోవైపు.. ఐపీఎల్‌లో గతేడాది కెప్టెన్‌గా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చాంపియన్‌గా నిలిపిన శ్రేయస్ అయ్యర్.. ఈ ఏడాది పంజాబ్ కింగ్స్ సారథిగా జట్టును ఫైనల్‌కు చేర్చాడు. బ్యాటర్‌గానూ పొట్టి ఫార్మాట్లో పరుగుల వరద పారించాడు.
అయినప్పటికీ ఆసియా టీ20 కప్-2025 జట్టుకు సెలక్టర్లు అతడిని ఎంపిక చేయలేదు. ఆటగాడిగానే శ్రేయస్‌కు స్థానమివ్వని యాజమాన్యం.. సూర్యకుమార్ యాదవ్ తర్వాత అతడిని ఏకంగా కెప్టెన్‌ను చేస్తుందంటూ ఊతప్ప అంచనా వేయడం విశేషం. కాగా ఆసీస్‌తో వన్డేలకు గిల్‌కు డిప్యూటీగా.. వైస్ కెప్టెన్‌గా అయ్యర్ ఎంపిక కావడం గమనార్హం.
చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్