మంచి జట్టే! కానీ టీమిండియా ఏదీ గెలవలేదు: ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ | 'They don't win anything...they've been nowhere': Vaughan shreds Rohit Sharma & Co. after SA Test loss - Sakshi
Sakshi News home page

టీమిండియా ఏదీ గెలవదు.. ఎక్కడా గెలవలేదు: ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ విమర్శలు

Published Sat, Dec 30 2023 7:46 PM

They Dont Win Anything Nowhere Vaughan Shreds Rohit And Co After SA Test Loss - Sakshi

టీమిండియాను ఉద్దేశించి ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ ఘాటు విమర్శలు చేశాడు. గత పదేళ్లలో భారత జట్టు అసలేం సాధించిందని ప్రశ్నించాడు. పటిష్ట జట్టు అని చెప్పుకోవడమే తప్ప.. జట్టులోని వనరులను పూర్తిగా సద్వినియోగం చేసుకున్న దాఖలాలే లేవని విమర్శించాడు.

టీ20 వరల్డ్‌కప్‌-2022 సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌ చేతిలో టీమిండియా పది వికెట్ల తేడాతో ఓడినప్పటి నుంచి మైకేల్‌ వాన్‌.. రోహిత్‌ సేనపై కఠిన విమర్శలు ఎక్కుపెడుతూనే ఉన్నాడు. అంచనాలు అందుకోలేని ఓ అండర్‌అచీవ్‌ టీమ్‌ అంటూ ఎద్దేవా చేస్తున్నాడు.

తాజాగా సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా చిత్తుగా ఓడిపోవడంతో మరోసారి తన వ్యాఖ్యలకు పదును పెట్టాడు వాన్‌. ఫాక్స్‌ స్పోర్ట్స్‌ షోలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ మార్క్‌ వాతో కలిసి పాల్గొన్న మైకేల్‌ వాన్‌.. అతడిని ఉద్దేశించి.. ‘‘క్రికెట్‌  ప్రపంచంలో ఎంతో గొప్ప జట్టు అనుకునే టీమిండియా అండర్‌అచీవ్‌ టీమ్‌ అని భావిస్తున్నారా?’’ అని అడిగాడు.

ఇందుకు స్పందించిన మార్క్‌ వా తిరిగి అదే ప్రశ్న వేయడంతో మైకేల్‌ వాన్‌ బదులిచ్చాడు. ఈ మేరకు.. ‘‘ఇటీవలి కాలంలో టీమిండియా చెప్పుకోగదగ్గ విజయాలేమీ సాధించలేదు. వాళ్లపై అంచనాలు పెట్టుకున్న ప్రతిసారి వమ్ము చేస్తూనే ఉంటారు.

వాళ్లు చివరిసారిగా అతి గొప్ప విజయం ఎప్పుడు సాధించారో గుర్తుందా? నిజానికి వాళ్ల దగ్గర ప్రతిభ, నైపుణ్యాలు గల ఆటగాళ్లకు కొదువలేదు. కానీ వారి సేవలను సద్వినియోగం చేసుకుంటున్నారా? 

అప్పుడెప్పుడో ఆస్ట్రేలియాలో రెండుసార్లు టెస్టులు గెలిచారు. కానీ వరల్డ్‌కప్‌ టోర్నీల సంగతేంటి? గత కొన్నేళ్లుగా వాళ్లు ఒక్కదాంట్లోనూ విజయం సాధించలేదు. నిజానికి ఇండియా మంచి టీమ్‌. ఎంతో మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు. అయినా ఏం లాభం? వాళ్లు ఇక ముందు కూడా గెలుస్తారనే నమ్మకం లేదు’’ అని మైకేల్‌ వాన్‌ టీమిండియా ఆట తీరును తక్కువ చేసే విధంగా మాట్లాడాడు.

కాగా మహేంద్ర సింగ్‌ సారథ్యంలో 2011లో వన్డే ప్రపంచకప్‌ గెలిచిన టీమిండియా.. 2013లో చాంపియన్స్‌ ట్రోఫీ కైవసం చేసుకుంది. ఆ తర్వాత మళ్లీ ఇంతవరకు ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలవలేదు. 

టీ20 వరల్డ్‌కప్‌-2021, టీ20 వరల్డ్‌కప్‌-2022లో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయిన టీమిండియా.. ఇటీవల సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్‌-2023లోనూ విజయలాంఛనం పూర్తి చేయలేకపోయింది.

ఫైనల్‌ వరకు చేరినా.. ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. ఆస్ట్రేలియా చేతిలో ఓడి ట్రోఫీని చేజార్చుకుంది. అదే విధంగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో రెండు పర్యాయాలు ఫైనల్లో అడుగుపెట్టినా ఆఖరి గండాన్ని దాటలేకపోయింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా రెండో టెస్టు గెలిచి సిరీస్‌ను డ్రా చేసుకోవాలని పట్టుదలగా ఉంది.

చదవండి: Ind vs SA: రోహిత్‌ ప్రాక్టీస్‌.. టీమిండియా పేసర్‌కు గాయం.. రెండో టెస్టుకు డౌటే!

Advertisement
Advertisement