
ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్య
హైదరాబాద్: భారత క్రికెట్‌లో విరాట్ కోహ్లిది ఒక ప్రత్యేక అధ్యాయమని, అతని బాటలో మరెంతో మంది యువ క్రికెటర్లు వెలుగులోకి వస్తారని హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ అభిప్రాయపడ్డారు. ఇటీవలే టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లిపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ‘కోహ్లి అద్భుతమైన ఆటగాడు. అతని కవర్‌డ్రైవ్ ఎంతో చూడముచ్చటగా ఉంటుంది.
ఇకపై టెస్టుల్లో అలాంటివి చూడలేము. బౌలర్ల తల మీదుగా అతను ఆడే స్ట్రెయిట్ షాట్ కూడా నాకు చాలా నచ్చుతుంది. అయితే మన దేశంలో ప్రతిభకు కొదవ లేదు.ఎంతో మంది కోహ్లిలు ఉన్నారు. వారంతా మున్ముందు వెలుగులోకి వచ్చి దేశానికి ఆడతారు’ అని ఒవైసీ వ్యాఖ్యానించారు. ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) విద్యార్థిగా ఉన్నప్పుడు మీడియం పేసర్‌గా సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ అండర్–25 టోర్నీలో ఆడిన ఒవైసీ... జాతీయ స్థాయి యూనివర్సిటీ వన్డే టోర్నీ విజ్జీ ట్రోఫీలో కూడా ఓయూకు ప్రాతినిధ్యం వహించారు.
ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిపోవడంతో క్రికెట్ కెరీర్ ముగిసింది. భారత క్రికెట్‌లో ఇప్పుడు గొప్ప దశ నడుస్తోందని, ప్రతిభ ఉంటే చాలు ఏ స్థాయికైనా చేరవచ్చని హైదరాబాదీ పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ చూపించాడని ఒవైసీ అన్నారు. ‘పేదరిక నేపథ్యం నుంచి వచ్చిన సిరాజ్ తన కఠోర శ్రమతో ఈ స్థాయికి చేరాడు. టెస్టుల్లో 100 వికెట్ల మైలురాయిని అందుకోగలిగిన అతనిది గొప్ప ప్రస్థానం. ఎందరికో స్ఫూర్తిదాయకం. సిరాజ్ భారత్‌కు మరిన్ని విజయాలు అందించాలి’ అని ఒవైసీ ఆకాంక్షించారు.