తన్మయ్- సాత్విక్ (PC: TG20 X)
పాలమూరు స్ట్రైకర్స్‌పై కరీంనగర్ డైమండ్స్ కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ శతక్కొట్టాడు. మొత్తంగా 58 బంతులు ఎదుర్కొని పదకొండు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 109 పరుగులు సాధించాడు. ఫలితంగా.. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కరీంనగర్ భారీ స్కోరు చేయగలిగింది.
తెలంగాణ టీ20 (టీజీ20)- 2026 లీగ్‌లో భాగంగా మంగళవారం నాటి మధ్యాహ్నం మ్యాచ్‌లో పాలమూరు స్ట్రైకర్స్‌తో కరీంనగర్ డైమండ్స్ తలపడుతోంది. ఉప్పల్ వేదికగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన పాలమూరు తొలుత ఫీల్డింగ్ ఎంచుకుని.. కరీంనగర్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
తన్మయ్ శతకంతో చెలరేగడంతో
ఈ క్రమంలో ఓపెనర్లు కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (109), సాత్విక్ రెడ్డి (22 బంతుల్లో 32) శుభారంభం అందించారు. ముఖ్యంగా తన్మయ్ శతకంతో చెలరేగడంతో మిగతా బ్యాటర్లు విఫలమైనా కరీంనగర్ స్కోరు 200 దాటింది. చందన్ సహాని 16, సింహా 15, రాహుల్ రాదేశ్ 10 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచారు.
Brutal hitting! 💥
Tanmay Agarwal upped the ante with 2️⃣0️⃣ off the over, putting the Diamonds in a position of stength! 💪#KDvPS #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/mNgmtOh5lc— tg20official (@tg20official) July 7, 2026
ఆఖర్లో నారాయణ తేజ మెరుపు ఇన్నింగ్స్ (8 బంతుల్లో 23 నాటౌట్) ఆడాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి కరీంనగర్ డైమండ్స్ 216 పరుగులు చేసింది. పాలమూరు బౌలర్లలో అశ్వద్ రాజీవ్ రెండు వికెట్లు తీయగా.. మహ్మద్ ఆఫ్రిది, రిషభ్ బిస్లాస్, నిశాంత్ రెడ్డి తలా ఒక వికెట్ పడగొట్టారు.
ఇక ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే కరీంనగర్ ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది. మరోవైపు.. పాలమూరు ఇప్పటికి ఆడిన ఆరు మ్యాచ్‌లలో ఒక్కటి మాత్రమే గెలిచి ఇప్పటికే ఎలిమినేట్ అయింది.
తుదిజట్లు
పాలమూరు స్ట్రైకర్స్
ప్రజ్ఞయ్ రెడ్డి (కెప్టెన్, వికెట్ కీపర్), విఘ్నేశ్ రెడ్డి, రోహిత్ రాయుడు, మణికంఠేశ్వర్‌రెడ్డి, రిషభ్ బిస్లాస్, ఎండీ ఆఫ్రిదీ అహ్మద్, సంహిత్ రెడ్డి, ఎండీ షాదాబ్ అహ్మద్, నిపుణ్ రెడ్డి, అశ్వద్ రాజీవ్, నిశాంత్ సేన్ రెడ్డి.
కరీంనగర్ డైమండ్స్
తన్మయ్ అగర్వాల్ (కెప్టెన్), సాత్విక్ రెడ్డి, హెచ్‌కే సింహ, రాహుల్ రాదేశ్ (వికెట్ కీపర్), చందన్ సహాని, టీవీఎస్ నారాయణ తేజ, హరీశ్ ఠాకూర్, శుభం శర్మ, రత్లావత్ దినేశ్, ఆశిష్ శ్రీవాస్తవ్, సతీశ్ కుమార్.


