ICC: 'కివీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేస్తే టీమిండియాకు సువర్ణావకాశం'

Team India Might Become Number-One-ODI Rankings-Beat NZ 3rd ODI - Sakshi

ఈ ఏడాది వన్డే వరల్డ్‌కప్‌కు టీమిండియా ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. అక్టోబర్‌- నవంబర్‌ వేదికగా ఈ మెగా టోర్నీ జరగనుంది. దీనికి ముందు టీమిండియా వరుసగా వన్డే సిరీస్‌లు ఆడుతూ విజయాలు దక్కించుకుంటూ వస్తుంది. ఇ‍ప్పటికే లంకతో వన్డే సిరీస్‌ నెగ్గిన టీమిండియా.. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను ఒక మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది. ఇక మూడో వన్డేలోనూ కివీస్‌ను టీమిండియా ఓడించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేస్తే వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలచే సువర్ణావకాశం లభించనుంది.

ఈ విషయం ఇప్పటికే ఐసీసీ తన ట్విటర్లో పేర్కొంది. ''మూడో వన్డేలో న్యూజిలాండ్‌ను టీమిండియా ఓడిస్తే వన్డేల్లో నెంబర్‌వన్‌ ర్యాంకు సొంతం చేసుకోనుంది'' అని ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, టీమిండియాలు 113 రేటింగ్‌ పాయింట్లతో ఉన్నప్పటికి మ్యాచ్‌లు, పాయింట్ల ఆధారంగా వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.

ఒకవేళ టీమిండియా న్యూజిలాండ్‌ను మూడో వన్డేల్లో ఓడిస్తే రెండు రేటింగ్‌ పాయింట్లతో మొత్తంగా 115 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచే అవకాశం ఉంది. రానున్న వన్డే వరల్డ్‌కప్‌కు ముందు టీమిండియాకు ఇది మంచి బూస్టప్‌ అని చెప్పొచ్చు. ఒకవేళ టీమిండియా కివీస్‌తో మూడో వన్డేలో ఓడినా రెండో స్థానంలో నిలిచే అవకాశం కూడా ఉంది. మరి మంగళవారం ఇండోర్‌ వేదికగా జరగనున్న మూడో వన్డేలో టీమిండియా గెలిచి వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి దూసుకెళ్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే.

చదవండి: విధ్వంసం సృష్టిస్తున్నాడు.. టెస్టు క్రికెటర్‌ ముద్ర చెరిపేయాల్సిందే

'టీమిండియా రైట్‌ ట్రాక్‌లోనే వెళ్తుందా?'.. మీకేమైనా అనుమానమా!

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top