'టీమిండియా రైట్‌ ట్రాక్‌లోనే వెళ్తుందా?'.. మీకేమైనా అనుమానమా! | Sakshi
Sakshi News home page

Mohammed Shami: 'టీమిండియా రైట్‌ ట్రాక్‌లోనే వెళ్తుందా?'.. మీకేమైనా అనుమానమా!

Published Sun, Jan 22 2023 11:40 AM

Mohammed Shami Blunt Response Asked India Were Right Track ODI-World CUp - Sakshi

రాయ్‌పూర్‌ వేదికగా శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ మూడు కీలక వికెట్లతో రాణించిన సంగతి తెలిసిందే. అతని పేస్‌ దెబ్బకు కివీస్‌ టాపార్డర్‌ కకావికలమైంది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచిన షమీ మ్యాచ్‌ విజయం అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నాడు. ఇంటర్య్వూ సమయంలో తనకు ఎదురైన ప్రశ్నకు షమీ తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చాడు.

వన్డే వరల్డ్‌కప్‌ సన్నాహకాల్లో భాగంగా టీమిండియా రైట్‌ ట్రాక్‌లోనే వెళ్తుందా అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి షమీ అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చాడు. ''టీమిండియా జట్టు ప్రదర్శనపై అభిమానులకు ఎలాంటి అనుమానాలు లేవు. గత నాలుగైదేళ్లుగా మా నుంచి మెరుగైన ప్రదర్శన వస్తుంది. ఒకవేళ ఏమైనా అనుమానాలున్నా వరల్డ్‌కప్‌కు సమయం ఉంది కాబట్టి వాటిని కచ్చితంగా తొలగిస్తాం. వరల్డ్‌కప్‌కు ముందు మాకు చాలా మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. అవన్నీ మంచి ప్రాక్టీస్‌గా ఉపయోగపడనున్నాయి. ఏ ఆటగాడు ఫిట్‌గా ఉన్నాడో తెలుసుకోవడానికి కొంత సమయం ఉంది. అందుకే ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా మ్యాచ్‌ టూ మ్యాచ్‌ రిజల్ట్‌గానే చూస్తే బాగుంటుంది'' అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే రెండో వన్డేలో భారత్‌ 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ 34.3 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. భారత్‌పై ఆ జట్టుకు ఇది మూడో అత్యల్ప స్కోరు. గ్లెన్‌ ఫిలిప్స్‌ (52 బంతుల్లో 36; 5 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌. షమీ (3/18) కివీస్‌ను దెబ్బ తీశాడు.

అనంతరం భారత్‌ 20.1 ఓవర్లలో 2 వికెట్లకు 111 పరుగులు చేసి గెలిచింది. రోహిత్‌ శర్మ (50 బంతుల్లో 51; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), శుబ్‌మన్‌ గిల్‌ (53 బంతుల్లో 40 నాటౌట్‌; 6 ఫోర్లు) తొలి వికెట్‌కు 72 పరుగులు జోడించి విజయానికి పునాది వేశారు. భారత్‌కు సొంతగడ్డపై ఇది వరుసగా ఏడో వన్డే సిరీస్‌ విజయం. చివరిదైన మూడో వన్డే మంగళవారం ఇండోర్‌లో జరుగుతుంది.  

చదవండి: 'భారీ స్కోర్లు రావడం లేవని తెలుసు.. కచ్చితంగా సెంచరీ కొడతా'

స్టన్నింగ్‌ క్యాచ్‌.. బిక్కమొహం వేసిన కాన్వే

Advertisement
Advertisement