ICC ODI Rankings: నంబర్‌ వన్‌ బౌలర్‌గా సిరాజ్‌

ICC ODI Rankings: Mohammed Siraj Becomes No 1 Bowler In ODIs - Sakshi

భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ముగిసిన అనంతరం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ను విడుదల చేసిం‍ది. స్వదేశంలో జరిగిన ఈ సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్‌ (114 రేటింగ్‌ పాయింట్లు) టీమ్‌ ర్యాంకింగ్స్‌లో.. ఇంగ్లండ్‌ను వెనక్కునెట్టి అగ్రస్థానానికి ఎగబాకగా, బౌలింగ్‌ విభాగంలో భారత స్టార్‌ పేసర్‌, హైదరాబాద్‌ కా షాన్‌ మహ్మద్‌ సిరాజ్‌ మియా తొలిసారి వన్డేల్లో వరల్డ్‌ నంబర్‌ వన్‌ బౌలర్‌గా అవతరించాడు.

న్యూజిలాండ్‌ సిరీస్‌తో పాటు అంతకుముందు శ్రీలంకతో జరిగిన సిరీస్‌లోనూ అద్భుత ప్రదర్శన కనబర్చిన సిరాజ్‌.. టీమిండియా తరఫున బుమ్రా తర్వాత వన్డేల్లో టాప్‌ ర్యాంక్‌ సాధించిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. శ్రీలంక సిరీస్‌లో 3 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు, కివీస్‌తో సిరీస్‌లో 2 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు పడగొట్టిన సిరాజ్‌.. మొత్తం 729 రేటింగ్‌ పాయింట్లు తన ఖాతాలో వేసుకుని అగ్రపీఠాన్ని అధిరోహించాడు.

సిరాజ్‌ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన జోష్‌ హేజిల్‌వుడ్‌ (727) ఉన్నాడు. హేజిల్‌వుడ్‌కు సిరాజ్‌కు కేవలం 2 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. వీరిద్దరి తర్వాత ట్రెంట్‌ బౌల్ట్‌ (708), మిచెల్‌ స్టార్క్‌ (665), రషీద్‌ ఖాన్‌ (659) వరుసగా 3, 4, 5 స్థానాల్లో నిలిచారు. కివీస్‌తో రెండో వన్డేలో అద్భుతంగా రాణించి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్న మరో టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ సైతం తన ర్యాంక్‌ను మెరుగుపర్చుకున్నాడు. షమీ.. 11 స్థానాలు ఎగబాకి 32వ స్థానంలో నిలిచాడు.

దాదాపు మూడేళ్ల తర్వాత గతేడాది (2022) ఫిబ్రవరిలో వన్డే ఫార్మాట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన సిరాజ్‌.. ఏడాది మొత్తం ఫార్మాట్లకతీతంగా రాణించాడు. రీఎంట్రీ తర్వాత సిరాజ్‌ 21 వన్డేల్లో ఏకంగా 37 వికెట్లు నేలకూల్చాడు. ఈ ప్రదర్శన ఆధారంగా సిరాజ్‌కు 2022 ఐసీసీ అత్యుత్తమ వన్డే జట్టులో కూడా చోటు లభించింది. కొత్త బంతిలో ఇరు వైపుల స్వింగ్‌ చేయగల సామర్థ్యం కలిగిన సిరాజ్‌.. గతకొంత కాలంగా అన్ని విభాగాల్లో రాటుదేలాడు.

కెరీర్‌ ఆరంభంలో పరుగులు ధారాళంగా సమర్పించుకుంటాడు, టాపార్డర్‌ బ్యాటర్ల వికెట్లు పడగొట్టలేడు అనే అపవాదు సిరాజ్‌పై ఉండేది. అయితే గత ఏడాది కాలంలో సిరాజ్‌ తన లోపాలను సరిచేసుకుని పేసు గుర్రం బుమ్రాను సైతం మరిపించేలా రాటుదేలాడు. ప్రస్తుతం సిరాజ్‌ కొత్త బంతిని అద్భుతంగా ఇరువైపులా స్వింగ్‌ చేయడంతో పాటు, ఆరంభ ఓవర్లు, మిడిల్‌ ఓవర్లలో అన్న తేడా లేకుండా పొదుపుగా బౌలింగ్‌ చేస్తూ వికెట్లు పడగొడుతున్నాడు. గత 10 వన్డేల్లో సిరాజ్‌ ప్రతి మ్యాచ్‌లో కనీసం ఒక్క వికెట్‌ తీశాడు. అలాగే పవర్‌ ప్లేల్లో మెయిడిన్‌ ఓవర్లు సంధించడంలోనూ సిరాజ్‌ రికార్డులు నెలాకొల్పాడు.

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top