
తొలి రౌండ్‌లో ప్రపంచ 45వ ర్యాంకర్‌పై విజయం
లక్ష్య సేన్, ప్రియాన్షు పరాజయం
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ ప్లేయర్ తరుణ్ మన్నేపల్లి శుభారంభం చేశాడు. క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లో అడుగు పెట్టిన తరుణ్ తొలి రౌండ్‌లో ప్రపంచ 45వ ర్యాంకర్ జస్టిన్ హో (మలేసియా)పై గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 53వ ర్యాంకర్ తరుణ్ 21–16, 21–19తో జస్టిన్ హో ఆట కట్టించాడు.
క్వాలిఫయింగ్ ఫైనల్ రౌండ్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్, భారత్‌కే చెందిన కిడాంబి శ్రీకాంత్‌ను బోల్తా కొట్టించిన తరుణ్ అదే జోరును మెయిన్ ‘డ్రా’లోనూ కొనసాగించాడు. తొలి గేమ్‌లో ఒకదశలో 8–11తో వెనుకబడిన తరుణ్ ఆ తర్వాత ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఏడు పాయింట్లు గెలిచి 15–11తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అదే దూకుడుతో ఆడి తొలి గేమ్‌ను దక్కించుకున్నాడు.
వరుసగా మూడు పాయింట్లు నెగ్గి రెండో గేమ్‌ను ఆరంభించిన తరుణ్ ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్నాడు. ఒకదశలో జస్టిన్ హో 15–16తో ఆధిక్యాన్ని ఒక పాయింట్‌కు తగ్గించాడు. అయితే తరుణ్ రెండు పాయింట్లు గెలిచి 18–15తో ముందంజ వేశాడు. ఆ తర్వాత జస్టిన్ స్కోరును సమం చేసేందుకు యతి్నంచినా చివరకు తరుణ్ రెండు పాయింట్ల ఆధిక్యంతో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.
మరోవైపు పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో నేరుగా పోటీపడ్డ ఇద్దరు భారత ఆటగాళ్లు లక్ష్య సేన్, ప్రియాన్షు రజావత్ తొలి రౌండ్‌ను దాటలేకపోయారు. లక్ష్య సేన్ 18–21, 21–9, 17–21తో ఎన్‌హట్ నుగుయెన్ (ఐర్లాండ్) చేతిలో, ప్రియాన్షు 13–21, 21–17, 16–21తో అల్వీ ఫర్హాన్ (ఇండోనేసియా) చేతిలో పోరాడి ఓడిపోయారు.
ప్రిక్వార్టర్స్‌లో గాయత్రి–ట్రెసా జోడీ
మహిళల డబుల్స్‌లో భారత్‌కు చెందిన పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా... రష్మీ గణేశ్–సానియా సికందర్ (భారత్); సెల్వం కవిప్రియ–సిమ్రన్ సింఘి (భారత్) జంటలు తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాయి. గాయత్రి–ట్రెసా ద్వయం 21–15, 21–13తో జిన్ యె–కార్మెన్ టింగ్ (మలేసియా) జంటను ఓడించింది.
రష్మీ–సానియా 11–21, 5–21తో టాన్ పియర్లీ–థినా (మలేసియా) చేతిలో, కవిప్రియ–సిమ్రన్ 17–21, 17–21తో బెన్‌యాపా–నుంతాకర్న్ (థాయ్‌లాండ్) చేతిలో పరాజయం పాలయ్యారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో పృథ్వీ కృష్ణమూర్తి రాయ్–సాయిప్రతీక్ (భారత్) జంట 20–22, 21–17, 18–21తో ఆరిఫ్ జునైది–రాయ్ కింగ్ (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది.
ఉన్నతి, ఆకర్షి గెలుపు
మహిళల సింగిల్స్ విభాగంగలో భారత క్రీడాకారిణులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఉన్నతి హుడా, ఆకర్షి కశ్యప్, మాళవిక బన్సోద్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టగా... రక్షిత శ్రీ, అనుపమ తొలి రౌండ్‌లో ఓడిపోయారు. ఉన్నతి 21–14, 18–21, 23–21తో థమోన్‌వన్ (థాయ్‌లాండ్)పై, ఆకర్షి 21–16, 20–22, 22–20తో కవోరు సుగియామ (జపాన్)పై, మాళవిక 21–12, 13–21, 21–17తో నెస్లిహాన్ అరిన్ (తుర్కియే)పై విజయం సాధించారు. రక్షిత శ్రీ 18–21, 7–21తో యో జియా మిన్ (ఇండోనేసియా) చేతిలో, అనుపమ 11–21, 9–21తో ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్) చేతిలో ఓటమి చవిచూశారు.