సెమీస్‌లో తరుణ్‌ | Tarun enters semi finals of Macau Open badminton tournament | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో తరుణ్‌

Aug 2 2025 1:21 AM | Updated on Aug 2 2025 1:21 AM

Tarun enters semi finals of Macau Open badminton tournament

మకావ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ

మకావ్‌: సంచలన ప్రదర్శనతో దూసుకెళ్తున్న భారత షట్లర్, హైదరాబాద్‌ ప్లేయర్‌ తరుణ్‌ మన్నేపల్లి... మకావ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ సెమీ ఫైనల్‌కు చేరాడు. వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 టోర్నమెంట్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 15వ ర్యాంకర్, టాప్‌ సీడ్‌ లీ చెక్‌ యు (హాంకాంగ్‌)పై ప్రిక్వార్టర్స్‌లో సంచలన విజయం సాధించిన తరుణ్‌... క్వార్టర్‌ ఫైనల్లోనూ అదే జోరు కనబర్చాడు. శుక్రవారం పురుషుల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో ప్రపంచ 47వ ర్యాంకర్‌ తరుణ్‌ 21–12, 13–21, 21–18తో ప్రపంచ 87వ ర్యాంకర్‌ హు జె (చైనా)పై గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టాడు. 

బీడబ్ల్యూఎఫ్‌ సూపర్‌–300 టోర్నీల్లో తరుణ్‌ సెమీస్‌కు చేరడం ఇదే తొలిసారి. ఈ ఏడాది ఫిబ్రవరిలో అతడు అత్యుత్తమంగా జర్మన్‌ ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్‌ ఆడాడు. 75 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి గేమ్‌ను సులువుగా గెలుచుకున్న 23 ఏళ్ల తరుణ్‌... రెండో గేమ్‌లో వెనుకబడ్డాడు. ఆ తర్వాత నిర్ణయాత్మక మూడో గేమ్‌ ఆరంభం నుంచి నువ్వానేనా అన్నట్లు సాగగా... కీలక దశలో పాయింట్లు సాధించిన తరుణ్‌ ముందంజ వేశాడు. 

మరో క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌కే చెందిన కామన్వెల్త్‌ స్వర్ణ పతక విజేత లక్ష్యసేన్‌ 21–14, 18–21, 21–14తో జియాన్‌ చెన్‌ జూ (చైనా)పై విజయం సాధించాడు. 63 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో లక్ష్యసేన్‌ ఆధిక్యం కనబర్చాడు. నేడు జరగనున్న సెమీఫైనల్స్‌లో ఐదో సీడ్‌ అల్వీ ఫర్హాన్‌ (ఇండోనేసియా)తో లక్ష్యసేన్, జస్టిన్‌ హో (మలేసియా)తో తరుణ్‌ తలపడనున్నారు. పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో భారత స్టార్‌ జోడీ సాతి్వక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి 14–21, 21–13, 20–22తో చూంగ్‌ హాన్‌ జియాన్‌–హైకల్‌ ముహమ్మద్‌ (మలేసియా) ద్వయం చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement