అలా అయితే మేమూ ఆడం.. బంగ్లాదేశ్‌కు వంత పాడుతున్న పాక్‌ | T20 World Cup fresh twist, Pakistan to review participation amid Bangladesh issue | Sakshi
Sakshi News home page

అలా అయితే మేమూ ఆడం.. బంగ్లాదేశ్‌కు వంత పాడుతున్న పాక్‌

Jan 19 2026 7:07 PM | Updated on Jan 19 2026 7:32 PM

T20 World Cup fresh twist, Pakistan to review participation amid Bangladesh issue

2026 టీ20 ప్రపంచకప్‌కు ముందు ఆసియా క్రికెట్‌లో మరోసారి రాజకీయ-క్రీడా ఉద్రిక్తతలు పెరిగాయి. భద్రత కార‌ణాల‌ను సాకుగా చూపుతూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) భారత్‌లో జరగబోయే తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖపై ఐసీసీ పలు సమీక్షలు జరిపిన అనంతరం భారత్‌లో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని బీసీబీకి హామీ ఇచ్చింది. 

అయినా వెనక్కు తగ్గని బంగ్లా క్రికెట్‌ బోర్డు, భారత్‌లో పర్యటించేదే లేదంటూ భీష్మించుకు కూర్చుంది. దీంతో ఐసీసీ వేరే ప్లాన్స్‌ సిద్దం చేసుకున్నట్లు తెలుస్తుంది. బంగ్లాదేశ్‌ భారత్‌లో ఆడేందుకు నిరాకరిస్తే స్కాట్లాండ్‌ను ప్రత్యామ్నాయ జట్టుగా ప్రపంచకప్‌లో ఆడించాలని కార్యాచరణ రూపొందించినట్లు సమాచారం. బంగ్లాదేశ్‌ ఏ విషయం తేల్చుకునేందుకు ఐసీసీ డెడ్‌లైన్‌ విధించినట్లు తెలుస్తుంది. ఈ నెల 21 లోగా ఏ విషయం తేల్చాలని ఐసీసీ దూత బీసీబీకి సందేశం పంపినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో.. ఐసీసీ తమ డిమాండ్‌ను పరిష్కరించకపోగా, భారత్‌లో ఆడేందుకు ఒత్తిడి తెస్తుందని బీసీబీ అంతర్జాతీయ వేదికపై గగ్గోలు పెడుతుంది. ఈ క్రమంలో పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు సాయాన్ని కోరినట్లు సమాచారం. బీసీబీ అభ్యర్థన కోసం ఎదురుచూస్తూ ఉండిన పీసీబీ.. అడగటమే ఆలస్యమన్నట్లు రంగంలోకి దిగింది. 

బంగ్లాదేశ్‌పై లేని ప్రేమను ఒలకబోస్తూ.. ఐసీసీ బీసీబీపై ఒత్తిడి పెంచితే, తాము కూడా ప్రపంచకప్‌ ఆడబోమని ఓవరాక్షన్‌ చేస్తుంది. బంగ్లాదేశ్‌ అభ్యర్థనలో న్యాయం ఉందని, ఐసీసీ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని పెద్దన్నపాత్ర పోషించే ప్రయత్నం చేస్తుంది. ఈ విషయంలో పాకిస్తాన్‌ రాజకీయ నాయకులు కూడా జోక్యం చేసుకున్నట్లు తెలుస్తుంది.

తాజాగా ఈ అంశంపై పాక్‌ క్రికెట్‌ బోర్డు, ఆ దేశ ముఖ్య రాజకీయ నాయకులు ఓ అత్యవసర సమావేశాన్ని నిర్వహించుకున్నట్లు సమాచారం. ఇందులో ఐసీసీ, బీసీసీఐకి వ్యతిరేకంగా.. బీసీబీ అనుకూలంగా చాలా తీర్మానాలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

ఏ జట్టూ ఒత్తిడి లేదా బెదిరింపులకు గురి కాకూదు. వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లు భద్రతా వాతావరణంలో జరగాలి. అవసరమైతే బంగ్లాదేశ్ మ్యాచ్‌లను పాకిస్తాన్‌లో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని పీసీబీ తీర్మానించినట్లు సమాచారం. పాకిస్తాన్‌ ఎంట్రీతో ప్రపంచకప్‌లో బంగ్లా భవితవ్యం ఏ మలుపు తీసుకుంటోదనని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.

కాగా, గత కొంత‌కాలంగా బంగ్లాదేశ్‌-భార‌త్ మ‌ధ్య రాజకీయ ఉద్రిక్త‌లు నెల‌కొన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2026 నుంచి బంగ్లా స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ విడుద‌ల చేయ‌డంతో ఈ ఉద్రిక్త‌లు క్రికెట్‌కు పాకాయి. బంగ్లాలో హిందువుల‌పై దాడులు పెరిగిపోతుండ‌డంతో బీసీసీఐ ఆదేశాల మేర‌కు కేకేఆర్ ఈ నిర్ణ‌యం తీసుకుంది.

దీన్ని ఘోర అవ‌మానంగా భావించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు.. త‌మ జ‌ట్టును వ‌ర‌ల్డ్‌క‌ప్ కోసం భార‌త్ పంప‌బోమ‌ని, వేదిక‌ల‌ను శ్రీలంక‌కు మార్చాల‌ని ఐసీసీని కోరింది. అంతేకాకుండా ఐపీఎల్ ప్ర‌సారాల‌ను త‌మ దేశంలో బ్యాన్ చేసింది.షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ తమ‌ గ్రూప్ మ్యాచ్‌లను కోల్‌కతా, ముంబై వేదిక‌ల‌గా ఆడాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement