T20 World Cup 2021: కివీస్‌ సెమీస్‌కు.. ప్రాక్టీసు రద్దు చేసుకుని హోటల్‌లోనే ఉండిపోయిన భారత ఆటగాళ్లు!

T20 World Cup 2021: India Reportedly Cancels Practice Session After NZ In Semis - Sakshi

ఆఖరి ఆశ ఆవిరి...

అఫ్గానిస్తాన్‌పై విజయంతో సెమీఫైనల్లోకి న్యూజిలాండ్‌

టి20 ప్రపంచకప్‌లో లీగ్‌ దశలోనే ముగిసిన భారత ప్రస్థానం

రాణించిన బౌల్ట్, విలియమ్సన్‌

నేడు నమీబియాతో భారత్‌ నామమాత్రపు పోరు 

India Reportedly Cancels Practice Session After NZ Enters Semis: ఏ మూలో మిగిలున్న ఆశ. ఒత్తిడిలో తడబడి న్యూజిలాండ్‌ ఓడకపోదా? అఫ్గానిస్తాన్‌ అద్భుతం చేసి గెలవకపోదా? నమీబియాపై భారీ విజయంతో టీమిండియా అడుగు సెమీస్‌లో పడకపోదా? అయితే మిగిలిపోయిన ఈ ఒక్క ఆశ ఆదివారం అడియాస అయ్యింది. దాంతో టి20 ప్రపంచకప్‌లో భారత జట్టు ప్రస్థానం లీగ్‌ దశలోనే ముగిసిపోయింది. కోట్లాది మంది అభిమానుల ఆకాంక్షలు ఆవిరయ్యాయి.

అఫ్గానిస్తాన్‌ జట్టుపై న్యూజిలాండ్‌ సాధించిన గెలుపు భారత్‌ను ఇంటి మలుపు తిప్పింది. కివీస్‌ జట్టుకు దర్జాగా సెమీఫైనల్‌ బెర్త్‌ను అందించింది. ఇక నమీబియాతో మిగిలిపోయిన లీగ్‌ మ్యాచ్‌ను నేడు ఆడి రావడం తప్ప యూఏఈలో మనకేమీ మిగల్లేదు. అఫ్గానిస్తాన్‌పై న్యూజిలాండ్‌ విజయం సాధించడం... తమ సెమీస్‌ అవకాశాలకు తెరపడటంతో... ఆదివారం సాయంత్రం తమ ఆప్షనల్‌ ప్రాక్టీస్‌ సెషన్‌ను కూడా టీమిండియా ఆటగాళ్లు రద్దు చేసుకొని హోటల్లోనే ఉండిపోయారు.   

అబుదాబి: కాస్తంత ఉదాసీనత ప్రదర్శించినా తమ సెమీఫైనల్‌ అవకాశాలకే ఎసరు వస్తుందని భావించిన న్యూజిలాండ్‌ జట్టు ఏదశలోనూ నిర్లక్ష్యాన్ని దరిచేరనీయలేదు. అఫ్గానిస్తాన్‌తో ఆదివారం జరిగిన టి20 ప్రపంచకప్‌ గ్రూప్‌–2 లీగ్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఆద్యంతం పక్కా ప్రొఫెషనల్‌గా ఆడింది. పకడ్బందీ బౌలింగ్‌... కళ్లు చెదిరే ఫీల్డింగ్‌... బాధ్యతాయుత బ్యాటింగ్‌... వెరసి ఎనిమిది వికెట్ల తేడాతో భారీ విజయం. దాంతో న్యూజిలాండ్‌  సెమీఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.

ఈ విజయంతో భారత్‌తోపాటు అఫ్గానిస్తాన్‌ సెమీఫైనల్‌ ఆశలకు విలియమ్సన్‌ బృందం తెరదించింది. టాస్‌ నెగ్గి  మొదట బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. నజీబుల్లా జద్రాన్‌ (48 బంతుల్లో 73; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేశాడు. కివీస్‌ బౌలర్లలో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ బౌల్ట్‌కు 3, సౌతీకి 2 వికెట్లు దక్కాయి. తర్వాత 125 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని న్యూజిలాండ్‌ 18.1 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెపె్టన్‌ కేన్‌ విలియమ్సన్‌ (42 బంతుల్లో 40 నాటౌట్‌; 3 ఫోర్లు) రాణించాడు.  

అందరూ తడబడితే... 
బ్యాటింగ్‌ మొదలుపెట్టిన అఫ్గాన్‌కు కష్టాలూ మొదలయ్యాయి. ఓపెనర్లు హజ్రతుల్లా (2), షహజాద్‌ (4), రహ్మనుల్లా (6) కివీస్‌ పేస్‌కు తలవంచారు. దీంతో 19 పరుగులకే 3 వికెట్లు కూలాయి. తర్వాత గుల్బదిన్‌ (15), నజీబుల్లా కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. పదో ఓవర్లో జట్టు స్కోరు 50 పరుగులు దాటింది. అదే ఓవర్లో గుల్బదిన్‌ అవుటయ్యాడు. తర్వాత కెప్టెన్‌ నబీ (14), కరీమ్‌ జనత్‌ (2), రషీద్‌ ఖాన్‌ (3) చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయినా... నజీబుల్లా ఒంటరి పోరాటం చేశాడు. జట్టు స్కోరును 100 దాటించాడు.  

ఆడుతూ పాడుతూ...
లక్ష్యం సులువైందే కావడంతో న్యూజిలాండ్‌ చక్కగా ఆడి పూర్తి చేసింది. ఓపెనర్లు గప్టిల్‌ (23 బంతుల్లో 28; 4 ఫోర్లు), మిచెల్‌ (17) ఎక్కువ సేపు నిలువకపోయినా... తర్వాత వచ్చిన కెప్టెన్‌ విలియమ్సన్, కాన్వే (32 బంతుల్లో 36 నాటౌట్‌; 4 ఫోర్లు) నిలబడ్డారు.  నింపాదిగా ఆడుతూ పని కానిచ్చారు. అబేధ్యమైన మూడో వికెట్‌కు 68 పరుగులు జోడించారు. గప్టిల్‌ను ఔట్‌ చేయడం ద్వారా రషీద్‌ ఖాన్‌ తన టి20 కెరీర్‌ మ్తొతంలో 400 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. బ్రావో (వెస్టిండీస్‌ –553 వికెట్లు), నరైన్‌ (వెస్టిండీస్‌–425 వికెట్లు), ఇమ్రాన్‌ తాహిర్‌ (దక్షిణాఫ్రికా–420 వికెట్లు) తర్వాత 400 వికెట్ల మైలురాయి అందుకున్న నాలుగో బౌలర్‌గా రషీద్‌ గుర్తింపు పొందాడు.

స్కోరు వివరాలు
అఫ్గానిస్తాన్‌ ఇన్నింగ్స్‌: హజ్రతుల్లా (సి) సాన్‌ట్నర్‌ (బి) బౌల్ట్‌ 2; షహజాద్‌ (సి) కాన్వే (బి) మిల్నే 4; రహ్మనుల్లా (ఎల్బీడబ్ల్యూ) (బి) సౌతీ 6; గుల్బదిన్‌ (బి) సోధి 15; నజీబుల్లా (సి) నీషమ్‌ (బి) బౌల్ట్‌ 73; నబీ (సి అండ్‌ బి) సౌతీ 14; కరీమ్‌ (సి) సోధి (బి) బౌల్ట్‌ 2; రషీద్‌ ఖాన్‌ (సి) విలియమ్సన్‌ (బి) నీషమ్‌ 3; ముజీబ్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 124. వికెట్ల పతనం: 1–8, 2–12, 3–19, 4–56, 5–115, 6–119, 7–121, 8–124. బౌలింగ్‌: సౌతీ 4–0–24–2, బౌల్ట్‌ 4–0–17–3, ఆడమ్‌ మిల్నే 4–0–17–1, నీషమ్‌ 4–0–24–1, సాన్‌ట్నర్‌ 2–0–27–0, సోధి 2–0–13–1. 

న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: గప్టిల్‌ (బి) రషీద్‌ ఖాన్‌ 28; డారిల్‌ మిచెల్‌ (సి) షహజాద్‌ (బి) ముజీబ్‌ 17; విలియమ్సన్‌ (నాటౌట్‌) 40; కాన్వే (నాటౌట్‌) 36; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (18.1 ఓవర్లలో 2 వికెట్లకు) 125. వికెట్ల పతనం: 1–26, 2–57. బౌలింగ్‌: నబీ 4–0–26–0, ముజీబ్‌ 4–0–31–1, నవీనుల్‌ హఖ్‌ 2–0–16–0, హమీద్‌ 3–0–14–0, రషీద్‌ ఖాన్‌ 4–0–27–1, గుల్బదిన్‌ 1.1–0–9–0.

చదవండి: Virat Kohli: టి20 కెప్టెన్‌గా కోహ్లి కథ ముగిసింది

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top