
యూఏఈలో పరిస్థితుల గురించి మాకు మంచి అవగాహన ఉందన్న పాక్ కెప్టెన్
T20 World Cup 2021 India Vs Pakistan Babar Azam Comments: ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. అక్టోబరు 24న దాయాది జట్లు ఇండియా- పాకిస్తాన్ మధ్య జరిగే హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం క్రీడా ప్రపంచం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం మ్యాచ్ సన్నాహకాల గురించి మాట్లాడాడు. ‘‘నిజాయితీగా చెప్పాలంటే గత ఫలితాల గురించి మేం ఆలోచించడం లేదు. మా బలాలతో ఈ మ్యాచ్‌పైనే దృష్టి పెట్టాం. బాగా ఆడి గెలవడమే లక్ష్యం.
భారత్‌తో మ్యాచ్ కోసం వంద శాతం సన్నద్ధమయ్యాం కాబట్టి ఎలాంటి ఒత్తిడి పెంచుకోవడం లేదు. మా బ్యాటింగ్ కూడా చాలా పటిష్టంగా ఉంది. యూఏఈలో పరిస్థితుల గురించి మాకు మంచి అవగాహన ఉంది కాబట్టి పిచ్ గురించి సమస్య లేదు. టోర్నీకి బయల్దేరడానికి ముందు ప్రధాని, దిగ్గజ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ మాతో మాట్లాడి స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు. దాంతో మా ఆత్మవిశ్వాసం పెరిగింది’’ అని బాబర్ చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పటి వరకు ఈ టోర్నీలో పాకిస్తాన్‌పై టీమిండియాదే పైచేయి అన్న విషయం తెలిసిందే.
భారత్ 5 పాకిస్తాన్ 0
టి20 ప్రపంచకప్‌లో భారత్, పాక్ ఐదుసార్లు తలపడ్డాయి. 2007లో రెండుసార్లు మ్యాచ్ జరగ్గా... తొలి మ్యాచ్ ‘టై’గా ముగిసింది. అయితే ‘బౌల్ అవుట్’లో భారత్ గెలుపొందింది. ఆ తర్వాత ఫైనల్లో 5 పరుగులతో నెగ్గిన ధోని సేన చాంపియన్‌గా నిలిచింది. గత మూడు ప్రపంచకప్‌లలో భారత్ ఏకపక్ష విజయాలు (8 వికెట్లతో, 7 వికెట్లతో, 6 వికెట్లతో) సాధించింది. ఈ మూడు మ్యాచ్‌లలో విరాట్ కోహ్లి ఒక్కసారి కూడా అవుట్ కాకపోవడం (78 నాటౌట్, 36 నాటౌట్, 55 నాటౌట్) విశేషం.
రోహిత్ ఏడోసారి...
2007 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడైన రోహిత్ శర్మ వరుసగా ఏడో వరల్డ్ కప్‌లో బరిలోకి దిగుతున్నాడు. షోయబ్ మాలిక్ కూడా 2007లో టీమ్‌లో ఉన్నా... అతను 2010 ప్రపంచ కప్ ఆడలేదు.
చదవండి: Adil Rashid: టి20 ప్రపంచకప్‌లో ఆదిల్ రషీద్ అరుదైన రికార్డు