T20 World Cup 2021: అఫ్గన్‌ సంచలనం.. 130 పరుగుల తేడాతో విజయం

T20 World Cup 2021: Afghanistan Beat Scotland By 130 Runs Big Win - Sakshi

అఫ్గాన్‌ అదరహో

స్కాట్లాండ్‌పై 130 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్‌ ఘనవిజయం

ముజీబ్, రషీద్‌ మాయాజాలం

రాణించిన నజీబుల్లా, హజ్రతుల్లా

అధికారంలోకి వచ్చిన తాలిబన్ల దుశ్చర్యలతో దేశంలో అనిశ్చితి... టి20 ప్రపంచకప్‌లో ఆడకుండా ఐసీసీ నిషేధం విధించొచ్చంటూ వార్తలు... సూటిగా చెప్పాలంటే నెల క్రితం వరకు అఫ్గానిస్తాన్‌ క్రికెట్‌ జట్టు పరిస్థితి ఇది. ఎన్నో సమస్యల నడుమ టి20 మహా సంగ్రామంలో అడుగు పెట్టిన అఫ్గాన్‌ అదిరే ప్రదర్శనతో శుభారంభం చేసింది. స్కాట్లాండ్‌తో జరిగిన సూపర్‌–12 లీగ్‌ మ్యాచ్‌లో మొదట మెరుపులు మెరిపించిన ఆ జట్టు... ఆ తర్వాత ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్, రషీద్‌ ఖాన్‌ స్పిన్‌ మాయాజాలంతో 130 పరుగుల తేడాతో గెలిచి టి20 ప్రపంచ కప్‌ ప్రయాణాన్ని ఘనంగా ఆరంభించింది.

Afghanistan Beat Scotland By 130 Runs: టి20 ప్రపంచకప్‌లో భాగంగా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌ ఆల్‌రౌండ్‌ షోతో ఆకట్టుకొని 130 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. షార్జాలో జరిగిన మ్యాచ్‌లో తొలుత అఫ్గానిస్తాన్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 190 పరుగులు చేసింది. నజీబుల్లా (34 బంతుల్లో 59; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించాడు.

రహ్మనుల్లా గుర్బాజ్‌ (37 బంతుల్లో 46; 1 ఫోర్, 4 సిక్స్‌లు), హజ్రతుల్లా  (30 బంతు ల్లో 44; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా రాణించడంతో అఫ్గాన్‌ భారీ స్కోరును సాధించింది. ఛేదనలో స్కాట్లాండ్‌ 10.2 ఓవర్లలో 60 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ముజీబ్‌ ఉర్‌ రెహమాన్‌ (5/20)... రషీద్‌ ఖాన్‌ (4/9) స్కాట్లాండ్‌ పని పట్టారు.   

స్పిన్‌ ఉచ్చులో విలవిల 
తొలి ఓవర్‌లో ఫోర్, సిక్సర్‌ కొట్టిన మున్సీ (25; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)... స్కాట్లాండ్‌ ఛేదనను గొప్ప గానే ఆరంభించాడు. మూడు ఓవర్లు ముగిసేసరికి స్కాట్లాండ్‌ వికెట్‌ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. అయితే నాలుగో ఓవర్‌ను వేయడానికి వచ్చిన ముజీబ్‌... ఆ ఒక్క ఓవర్‌తో మ్యాచ్‌ గతినే మార్చేశాడు.

కొయెట్జర్‌ (10), మాక్‌లియోడ్‌ (0), బెరింగ్టన్‌ (0) వికెట్లను తీసి స్కాట్లాండ్‌ను దెబ్బ తీశాడు. మరుసటి ఓవర్లో క్రాస్‌ (0)ను నవీన్‌ ఉల్‌ హక్‌ పెవిలియన్‌కు చేర్చాడు. తన తర్వాతి ఓవర్లలో మున్సీ, వాట్‌ (1) వికెట్లను ముజీబ్‌ దక్కించుకున్నాడు. ఇక నా వంతు అంటూ రషీద్‌ ఖాన్‌ మిగిలిన నాలుగు వికెట్లను తీసి లాంఛనం పూర్తి చేశాడు.

చదవండి: T20 WC 2021 IND Vs PAK: షమీపై నెటిజన్ల దాడి.. ఖండించిన టీమిండియా మాజీలు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top