టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్‌కు ఉద్వాసన తప్పలేదు. భారత్‌లో తమ మ్యాచ్‌లు ఆడలేమంటూ పంతం పట్టిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB)కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) గట్టిషాకిచ్చింది. ఈ మెగా టోర్నీ నుంచి బంగ్లాదేశ్‌ను తప్పించి ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చింది.
ప్రస్తుత టీ20 టీమ్ ర్యాంకింగ్స్ ఆధారంగా స్కాట్లాండ్‌కు ఐసీసీ ఈ అవకాశం ఇచ్చింది.కాగా గత కొంతకాలంగా భారత్- బంగ్లాదేశ్ (IND vs BAN) మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
అక్కడి నుంచి మొదలు
ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రహమాన్‌ను (Mustafizur Rahman) ఐపీఎల్ నుంచి తొలగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనను కూడా నిరవధికంగా వాయిదా వేసింది.
ఈ పరిణామాల క్రమంలో టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్‌లో తమ మ్యాచ్‌లు ఆడలేమని బీసీబీ.. ఐసీసీకి తెలియజేసింది. భద్రతాపరమైన ముప్పులు ఉన్నందున తమ వేదికను శ్రీలంకకు మార్చాలని విజ్ఞప్తి చేసింది. అయితే, పరిశీలనా బృందం నుంచి వివరాలు తీసుకున్న ఐసీసీ. భారత్‌లో బంగ్లా జట్టుకు వచ్చిన ముప్పేమీలేదని తేల్చింది.
మొండి వైఖరి
అయితే, బీసీబీ మాత్రం మొండి వైఖరి అవలంబించింది. తాము భారత్‌లో మ్యాచ్‌లు ఆడే ప్రసక్తే లేదని పంతం పట్టింది. ఐసీసీ గడువు ఇచ్చినప్పటికీ తమ నిర్ణయం ఇదేనంటూ సవాలు విసిరినట్లుగా మాట్లాడింది. అంతేకాదు ఆఖరి ప్రయత్నంగా వివాద పరిష్కారాల కమిటీ (DRC)ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆశ్రయించింది.
ముందుగా హెచ్చరించినట్లుగానే
తాము భారత్‌లో ఆడాల్సిందేనంటూ ఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేయాలంటూ డీఆర్‌సీని బీసీబీ కోరింది. అయితే ఐసీసీ ఆధ్వర్యంలోనే పని చేసే డీఆర్‌సీ వారి విజ్ఞప్తికి స్పందించే అవకాశం లేకపోయింది.
ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఐసీసీ.. ముందుగా హెచ్చరించినట్లుగానే బంగ్లాదేశ్ స్థానాన్ని స్కాట్లాండ్‌తో భర్తీ చేసినట్లు క్రిక్‌బజ్ తన కథనంలో వెల్లడించింది. ఈ విషయం గురించి బీసీబీకి ఐసీసీ లేఖ కూడా రాసినట్లు పేర్కొంది.
కాగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు టీ20 వరల్డ్‌కప్ టోర్నీ జరుగనుంది. ఇందుకు భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఇక ఈసారి ఈ టోర్నీలో 20 జట్లు పాల్గొంటుండగా. గ్రూప్-సిలో ఇంగ్లండ్, వెస్టిండీస్, నేపాల్, ఇటలీలతో కలిసి ఉంది బంగ్లాదేశ్. ఇప్పుడు ఆ స్థానంలో స్కాట్లాండ్ వచ్చి చేరినట్లు తెలుస్తోంది.
చదవండి: భారత్‌కు మాత్రమే అవకాశం ఇస్తారా?: బంగ్లాదేశ్ ఆరోపణలు


