
PC: ICC
అదిరిపోయే సమాధానమిచ్చిన విలియకమ్సన్.. ‘‘మరి చాంపియన్‌షిప్ ఫైనల్ సంగతేమిటి’’
Kane Williamson Interrupts Reporter During Press Conference Video Goes Viral: మొట్టమొదటి వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ గెలిచి చరిత్ర లిఖించిన న్యూజిలాండ్‌కు టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో మాత్రం నిరాశే మిగిలింది. ఆఖరి మెట్టు చేరే వరకు అద్భుత పోరాటపటిమ ప్రదర్శన కనబరిచిన కివీస్‌కు ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం తప్పలేదు. ముఖ్యంగా మంచు ప్రభావం చూపే దుబాయ్ పిచ్‌పై మ్యాచ్‌లో ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ టాస్ గెలవగానే న్యూజిలాండ్ అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి. అయితే, ఆసీస్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఓపెనర్లు మార్టిన్ గఫ్టిల్(28), డారిల్ మిచెల్(11) త్వరగానే పెవిలియన్ చేరినా.. కేన్ విలియమ్సన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.
48 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 85 పరుగులు చేసి అద్బుత ప్రదర్శన కనబరిచాడు. కివీస్ మెరుగైన స్కోరు (172) నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ... ఆసీస్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్(53), మిచెల్ మార్ష్(77) తమ సూపర్ ఇన్నింగ్స్‌తో కివీస్ ఆశలను అడియాసలు చేశారు. దీంతో మొదటిసారి పొట్టి ఫార్మాట్ విజేతగా నిలవాలన్న కేన్ విలియమ్సన్ బృందానికి భంగపాటు తప్పలేదు.
కాగా ప్రపంచకప్ టోర్నీ ఫైనల్లో ఓడిపోవడం కివీస్ జట్టుకిది మూడోసారి. 2015 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో ... 2019 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో పరాజయం పాలైంది న్యూజిలాండ్. ఈ నేపథ్యంలో.. ఆసీస్ తొలిసారి టీ20 వరల్డ్‌కప్ ముద్దాడటం.. అందుకు సంబంధించిన సెలబ్రేషన్స్‌లో మునిగిపోయిన తరుణంలో విలియమ్సన్ మీడియాతో మాట్లాడటం చూసిన అభిమానుల గుండెలు తరుక్కుపోయాయి.
మరోవైపు.. ‘‘చిరకాల కోరిక నెరవేరింది.. విముక్తి లభించింది’’ అంటూ ఆసీస్ ఆటగాళ్లు పాటలు పాడుతున్న వేళ.. కివీస్ దురదృష్టాన్ని వెక్కిరించేలా ఓ ప్రశ్న ఎదురైంది. ‘‘మూడు వరల్డ్‌కప్ టోర్నీల్లో ఫైనల్‌లో ఓడిపోవడం ఎలా అనిపిస్తోంది’’ అని రిపోర్టర్ అడుగగా.. విలియమ్సన్ ఏమాత్రం తడబడకుండా.. ‘మరి చాంపియన్‌షిప్ ఫైనల్ సంగతేమిటి’’ అని కౌంటర్ ఇచ్చాడు. ‘‘ఆడేందుకే ఇక్కడికి వచ్చాం. గెలుపు- ఓటములు సహజం. ఈ టోర్నీ ఆసాంతం మా ప్రదర్శన పట్ల నేనెంతో గర్వపడుతున్నా. విజేతగా నిలవాలని ఎవరికైనా ఉంటుంది.
అయితే, ఫైనల్‌లో ఆస్ట్రేలియా ఎంతో బాగా ఆడింది. వినండి పక్కనే వాళ్లు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో! వాళ్ల ఆట అత్యద్భుతం. అద్భుతమైన ఆటగాళ్లు జట్టును చాంపియన్‌గా నిలిపారు’’ అంటూ హుందాగా వ్యవహరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో... ‘‘మరేం పర్లేదు విలియమ్సన్. మీరు మీ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. ఇప్పుడు కాకుంటే.. ఇంకోసారి.. క్రీడాస్ఫూర్తిని చాటుకున్నావు. హుందాగా వ్యవహరించావు. దురదృష్టం గురించి మాట్లాడేవాళ్లకు చాలా బాగా బదులిచ్చావు. ఓడినా మనసులు గెలిచారు మీరు. నువ్వు హీరోవే’’ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.