సూర్యకుమారా మజాకా.. ఒకే దెబ్బకు మూడు రికార్డులు బద్దలు

Suryakumar Yadav Broken 3 Records In T20 Cricket Vs ZIM Match - Sakshi

టీమిండియా సంచలనం సూర్యకుమార్‌ యాదవ్‌ టి20 క్రికెట్‌లో ఎదురులేకుండా సాగిపోతున్నాడు. దూకుడే మంత్రంగా సాగుతున్న సూర్యను ఆపడం ప్రత్యర్థి బౌలర్లకు కష్టతరంగా మారింది. సూపర్‌-12 గ్రూప్‌-2లో ఆదివారం జింబాబ్వేతో మ్యాచ్‌లో సూర్యకుమార్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కోహ్లి, రోహిత్‌లు విఫలమైన వేళ కేఎల్‌ రాహుల్‌తో కలిసి సూర్యకుమార్‌ జింబాబ్వే బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. 23 బంతుల్లోనే అర్థశతకం సాధించిన సూర్యకుమార్‌ ఓవరాల్‌గా 25 బంతుల్లో 61 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే సూర్యకుమార్‌ ఒకే దెబ్బకు మూడు రికార్డులు బద్దలు కొట్టాడు. అవి ఒకసారి పరిశీలిద్దాం.

► టి20 వరల్డ్‌కప్‌లో టీమిండియా తరపున అత్యంత తక్కువ బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించిన జాబితాలో సూర్యకుమార్‌ యాదవ్‌ నాలుగో స్థానంలో నిలిచాడు. సూర్యకుమార్‌ 23 బంతుల్లో ఫిప్టీ మార్క్‌ను అందుకున్నాడు. సూర్య కంటే ముందు ఈ జాబితాలో యువరాజ్‌ సింగ్‌ రెండుసార్లు(2007లో ఇంగ్లండ్‌పై 12 బంతుల్లో, 2007లో ఆస్ట్రేలియాపై 20 బంతుల్లో) హాఫ్‌ సెంచరీ సాధించగా.. కేఎల్‌ రాహుల్‌ 2021లో స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో 18 బంతుల్లోనే అర్థసెంచరీ సాధించాడు.

► ఒక టి20 వరల్డ్‌కప్‌లో 100 కంటే ఎక్కువ బంతులాడి అత్యధిక స్ట్రైక్‌రేట్‌ కలిగిన జాబితాలో సూర్యకుమార్‌ అగ్రస్థానంలో నిలిచాడు. 2022 టి20 ప్రపంచకప్‌లో సూర్యకుమార్‌ 193.96 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్‌ చేస్తున్నాడు. ఇక 2010 టి20 ప్రపంచకప్‌లో మైక్‌ హస్సీ 175.70 స్ట్రైక్‌రేట్‌తో, 2012లో లూక్‌ రైట్‌ 169.29 స్ట్రైక్‌రేట్‌తో, 2022లో గ్లెన్‌ ఫిలిప్స్‌ 163.86 స్ట్రైక్‌రేట్‌తో, 2007 టి20 ప్రపంచకప్‌లో కెవిన్‌ పీటర్సన్‌ 161.81 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్‌ చేశాడు.

► ఇక టి20 క్రికెట్‌లో టీమిండియా తరపున చివరి ఐదు ఓవర్లలో ఎక్కువ పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో సూర్యకుమార్‌ మూడో స్థానంలో ఉన్నాడు. జింబాబ్వేతో మ్యాచ్‌లో సూర్యకుమార్‌ చివరి ఐదు ఓవర్లలో 56 పరుగులు రాబట్టుకున్నాడు. ఇంతకుముందు ఆసియాకప్‌ 2022లో ఆఫ్గన్‌పై కోహ్లి 63 పరుగులు రాబట్టగా.. 2007 టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై యువరాజ్‌ సింగ్‌ 58 పరుగులు పిండుకున్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top