నాపై ఒత్తిడి లేకుండా చేస్తున్నారు.. రింకూ వల్ల: సూర్య | Suryakumar Comments After Win Over AUS In 2nd T20I, He Says Boys Are Taking Responsibility And Not Much Pressure On Me - Sakshi
Sakshi News home page

SKY On India Win In 2nd T20: మ్యాచ్‌కు ముందే చెప్పా.. నాపై ఒత్తిడి లేకుండా చేస్తున్నారు.. రింకూను చూస్తే: సూర్య

Published Mon, Nov 27 2023 12:18 PM | Last Updated on Mon, Nov 27 2023 12:46 PM

Suryakumar: Boys Not Putting Too Much Pressure On Me When I Saw Rinku - Sakshi

India vs Australia, 2nd T20I- Suryakumar Yadav Comments: యువ ఆటగాళ్లపై టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ప్రశంసలు కురిపించాడు. ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరిస్తూ నాయకుడిగా తన పనిని మరింత సులువు చేస్తున్నారంటూ కొనియాడాడు. కాగా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో భారత యువ జట్టు అదరగొడుతున్న విషయం తెలిసిందే.

వన్డే వరల్డ్‌కప్‌-2023 తర్వాత సీనియర్ల గైర్హాజరీతో దక్కిన అవకాశాలను యువ క్రికెటర్లు సద్వినియోగం చేసుకుంటున్నారు. వరల్డ్ నంబర్‌ 1 టీ20 స్టార్‌ సూర్యకుమార్‌ సారథ్యంలో అద్భుత ప్రదర్శన కనబరుస్తూ ముందుకు సాగుతున్నారు.

వరుసగా రెండో విజయం
ఇందులో భాగంగా ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన తొలి టీ20లో రింకూ సింగ్‌ టీమిండియా విజయాన్ని ఖరారు చేయగా.. రెండో మ్యాచ్‌లో ప్రతి ఒక్కరు తమ వంతు పాత్ర పోషించి జట్టుకు గెలుపు అందించారు. ఈ క్రమంలో టీమిండియా ప్రస్తుతం ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది.

ఈ రెండు మ్యాచ్‌లలోనూ రింకూ సింగ్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో మెరవడం విశేషం. ముఖ్యంగా ఆదివారం నాటి రెండో టీ20లో కేవలం 9 బంతుల్లోనే 31 పరుగులతో అజేయంగా నిలిచి.. జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

మూడు అర్ధ శతకాలు.. రింకూ ధనాధన్‌ బాదుడు
మిగతా వాళ్లలో ఓపెనర్లు యశస్వి జైశ్వాల్‌(25 బంతుల్లో 53), రుతురాజ్‌ గైక్వాడ్‌ (43 బంతుల్లో 58), ఇషాన్‌ కిషన్‌(32 బంతుల్లో 52) అర్ధ శతకాలు సాధించారు. కెప్టెన్‌ సూర్య 19 పరుగులకే పరిమితం కాగా.. తిలక్‌ 7 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 

ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసిన టీమిండియా... ఆసీస్‌ను 191 పరుగులకే పరిమితం చేసింది. తద్వారా 44 పరుగుల తేడాతో తిరువనంతపురంలో గెలుపొంది సిరీస్‌లో మరో ముందడుగు వేసింది.

మ్యాచ్‌కు ముందే చెప్పాను.. మా బాయ్స్‌ అద్భుతం
ఈ నేపథ్యంలో విజయానంతరం సూర్యకుమార్‌ మాట్లాడుతూ.. ‘‘నాపై ఒత్తిడి పడకుండా మా యువ ఆటగాళ్లంతా బాధ్యత తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు తమ పనిని చక్కగా నెరవేరుస్తున్నారు. మ్యాచ్‌ ఆరంభానికి ముందే.. మా వాళ్లకు తొలుత బ్యాటింగ్‌ చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పాను.

రింకూను చూస్తే ధోని గుర్తుకొస్తాడు
పిచ్‌ తేమగా ఉంది. కాబట్టి వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టి స్కోరును డిఫెంగ్‌ చేసుకోవాలని మా వాళ్లకు చెప్పాను’’ అని పేర్కొన్నాడు. ఇక రింకూ సింగ్‌ గురించి ప్రస్తావనకు రాగా.. ‘‘గత మ్యాచ్‌లో రింకూ క్రీజులోకి వచ్చినపుడు తన ఆత్మవిశ్వాసాన్ని చూస్తే నాకు ముచ్చటేసింది. అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు.

అతడిని చూస్తే నాకొక వ్యక్తి గుర్తుకొస్తారు(నవ్వులు). ఆయన ఎవరో మీ అందరికీ తెలుసు కదా’’ అంటూ సూర్యకుమార్‌ నవ్వులు చిందించాడు. మిస్టర్‌ కూల్‌ కెప్టెన్‌, ఫినిషర్‌ మహేంద్ర సింగ్‌ ధోనిని ఉద్దేశించి సూర్య ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. పరోక్షంగా రింకూను నయా ఫినిషర్‌గా పేర్కొన్నాడు.

చదవండి: IPL 2024: ఆర్సీబీలో భారీ ప్రక్షాళన.. స్టార్‌ ఆటగాళ్లకు షాక్‌.. లక్కీ డీకే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement