
ఓడితే ‘ప్లే ఆఫ్స్’ ఆశలు ఖతం
నేడు సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోరు
రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ 18వ సీజన్‌లో గత ఏడాది రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రస్థానం ఆఖరి దశకు చేరింది. సీజన్‌లో మరో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా... చావో రేవో తేల్చుకోవాల్సిన స్థితిలో జట్టు నిలిచింది. నేడు ఉప్పల్ స్టేడియంలో జరిగే పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌తో హైదరాబాద్ తలపడుతుంది. ప్రస్తుతం సన్‌రైజర్స్ ఖాతాలో 3 విజయాలతో 6 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. మిగిలిన నాలుగూ గెలిస్తే గరిష్టంగా 14 పాయింట్లకు జట్టు చేరుకుంటుంది. దీని వల్ల ‘ప్లే ఆఫ్స్’ స్థానం ఖాయమయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువ.
అయితే సాంకేతికంగా, ఇతర జట్ల సమీకరణాలను బట్టి ఆశలు పెట్టుకోవచ్చు. కానీ నేటి మ్యాచ్‌లో ఓడితే మాత్రం అధికారికంగా ‘ప్లే ఆఫ్స్’ రేసు నుంచి మాజీ చాంపియన్ ని్రష్కమిస్తుంది. మరోవైపు ఢిల్లీ ప్రయాణం కూడా తడబడుతూ సాగుతోంది. తొలి 4 మ్యాచ్‌లు వరుసగా గెలిచి ఘనంగా ప్రారంభించిన టీమ్ ఆ తర్వాతి 6 మ్యాచ్‌లలో 4 ఓడిపోయింది. అయితే పరిస్థితి ఇంకా చేయిదాటిపోలేదు కాబట్టి ఈ మ్యాచ్‌లో నెగ్గితే ఢిల్లీ మరింత మెరుగైన స్థితికి చేరుకుంటుంది.
బ్యాటర్లు చెలరేగితేనే...
గుజరాత్ చేతిలో ఓడిన గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటింగ్ బలహీనత మరోసారి కనిపించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ మినహా అంతా విఫలమయ్యారు. మిగతా ప్రధాన బ్యాటర్లు విఫలం కావడం మాత్రమే కాదు వారి షాట్లలో ఆత్మవిశ్వాసం కనిపించడం లేదు. ఎంతో నమ్మకం పెట్టుకున్న హెడ్, క్లాసెన్ పేలవంగా ఆడి నిష్క్రమించగా... ఇషాన్ కిషన్ ప్రతీ పరుగు కోసం తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. టాప్–4 ఇలా ఆడితే ఏ జట్టయినా విజయాన్ని కోరుకోవడం అత్యాశే అవుతుంది. ఆరంభ మ్యాచ్‌లలో కనిపించిన పట్టుదలను అనికేత్ కొనసాగించలేకపోయాడు.
నితీశ్ కుమార్ రెడ్డి గత మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించినా అప్పటికే మ్యాచ్ చేయిదాటిపోయాక అతని ఇన్నింగ్స్‌కు విలువ లేకుండా పోయింది. హోం గ్రౌండ్‌లోనైనా వీరంతా తమ బ్యాటింగ్‌కు పదును పెడితే భారీ స్కోరుకు అవకాశం ఉంటుంది. అయితే బ్యాటింగ్‌కంటే చెత్త బౌలింగ్ రైజర్స్‌ను వెనకబడేలా చేసింది. ప్రధాన బౌలర్లు మొహమ్మద్ షమీ 11.23, కెపె్టన్ ప్యాట్ కమిన్స్ 9.64, హర్షల్ పటేల్ 9.50, అన్సారీ 9.74 ఎకానమీతో బౌలింగ్ చేస్తుంటే ఏ జట్టయినా ఏమీ చేయలేదు. వీరిలో ఒక్కరి ప్రదర్శన మెరుగుకావడం లేదు. తప్పనిసరి గెలవాల్సిన మ్యాచ్‌లోనైనా బౌలర్ల ఆటతీరు మారితే రైజర్స్ విజయంపై నమ్మకం ఉంచవచ్చు.
సమష్టి ఆటపై ఆశలు...
సీజన్‌లో జోరుగా దూసుకొచి్చన ఢిల్లీ క్యాపిటల్స్ గత రెండు మ్యాచ్‌లలో వరుసగా ఓడి ‘ప్లే ఆఫ్స్’ రేసులో కాస్త వెనుకబడింది. ముఖ్యంగా కోల్‌కతాతో జరిగిన గత పోరులో మంచి విజయావకాశాలు ఉన్న స్థితి నుంచి మ్యాచ్‌ను చేజార్చుకుంది. అంతకు ముందు బెంగళూరుతో మ్యాచ్‌లో కూడా బ్యాటింగ్ విఫలమైంది. బ్యాటింగ్ ఆర్డర్ చూస్తే కనీసం ఎనిమిదో స్థానం వరకు కూడా ధాటిగా ఆడగల రెగ్యులర్ బ్యాటర్లు కనిపిస్తున్నారు. కానీ గత రెండు మ్యాచ్‌లలో ఈ లైనప్ అంచనాలను నిలబెట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో తమ లోపాలను అధిగమించి మరోసారి బ్యాటర్లు చెలరేగాలని ఢిల్లీ కోరుకుంటోంది.

పొరేల్ ధాటిగా ఆడుతున్న ఎక్కువసేపు నిలబడటం ముఖ్యం. డుప్లెసిస్ దూకుడు సానుకూలాంశం కాగా... కేఎల్ రాహుల్ ఈ సీజన్ ఆరంభంలో చూపించిన ఫామ్ ఇప్పుడు కనిపించడం లేదు. వరుసగా విఫలమవుతున్న కరుణ్ నాయర్ స్థానంలో మరొకరికి అవకాశం ఇస్తారా చూడాలి. గత మ్యాచ్‌లో గాయపడిన కెపె్టన్ అక్షర్ పటేల్ పూర్తిగా కోలుకొని ఫిట్‌గా మారడం ముఖ్యం. లేదంటే అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లోనూ జట్టుకు దెబ్బ పడుతుంది. స్టబ్స్, విప్‌రాజ్, అశుతోష్ చివరి ఓవర్లలో చెలరేగితే క్యాపిటల్స్ పైచేయి సాధించవచ్చు. కేవలం 6.74 ఎకానమీతో 12 వికెట్లు తీసిన కుల్దీప్ బౌలింగ్‌లో జట్టు ప్రధాన అస్త్రం. స్టార్క్ వికెట్లు తీస్తున్నా పరుగులను నిలువరించడం ముఖ్యం. ముకేశ్, చమీరా, మోహిత్ ప్రభావం చూపలేకపోవడం ఢిల్లీ బౌలింగ్‌ను కాస్త బలహీనంగా మార్చింది.
13 ఐపీఎల్ టోర్నీలో ఇప్పటి వరకు హైదరాబాద్, ఢిల్లీ జట్లు ముఖాముఖిగా 25 సార్లు తలపడ్డాయి. 13 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ గెలుపొందగా... 12 మ్యాచ్‌ల్లో ఢిల్లీ జట్టుకు విజయం దక్కింది. ఢిల్లీపై హైదరాబాద్ అత్యధిక స్కోరు 266 పరుగులుకాగా... అత్యల్ప స్కోరు 116. హైదరాబాద్‌పై ఢిల్లీ అత్యధిక స్కోరు 207 పరుగులుకాగా... అత్యల్ప స్కోరు 80.