
చేజేతులా పరాజయాలను ఆహ్వానించిన సన్‌రైజర్స్ హైదరాబాద్
అంచనాలను అందుకోలేకపోయిన స్టార్ ప్లేయర్లు
అడపాదడపా మెరుపులు తప్ప నిలకడలేమితో సతమతం
ఐపీఎల్‌లో గత ఏడాది రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్... ఈ సీజన్‌లో ఆడిన మొదటి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌పై సునామీలా విరుచుకుపడింది. 20 ఓవర్లలో 286 పరుగులతో ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపుతూ... గత సీజన్ జోరును కొనసాగించింది. ఇప్పటికే హిట్టర్లతో బలంగా ఉన్న రైజర్స్‌కు ప్యాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ తోడవడంతో... ఆ దూకుడు మరింత పెరిగింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ అనికేత్ వర్మ ఇలా ఒకటి నుంచి ఏడో స్థానం వరకు అందరూ దంచే వాళ్లే ఉండటంతో... ఈ సీజన్‌లో ఆరెంజ్ ఆర్మీ కప్పు కొట్టడం ఖాయమనే అంచనాలు పెరిగిపోయాయి!
అయితే వాటిని అందుకోవడంలో పూర్తిగా విఫలమైన సన్‌రైజర్స్ అంతకంతకూ నాసిరకమైన ఆటతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం కోసం పోటీ పడటం ప్రారంభించింది. తొలి పోరు అనంతరం ఆడిన 7 మ్యాచ్‌ల్లో కేవలం ఒక్కదాంట్లోనే గెలిచి... ప్లే ఆఫ్స్ రేసుకు దూరమైంది. భారీ ఆశలు పెట్టుకున్న హిట్టర్లు ఘోరంగా విఫలమవగా... కెప్టెన్ కమిన్స్ సహా బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఫలితంగా జట్టు పరిస్థితి మరింత దిగజారింది. ఇప్పటి వరకు ఐపీఎల్ ట్రోఫీ నెగ్గని జట్లు ఈ సీజన్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తుంటే... మాజీ చాంపియన్ రైజర్స్ మాత్రం తిరోగమనం బాటపట్టింది. ఈ సీజన్‌లో రైజర్స్ వైఫల్యానికి కారణాలు పరిశీలిస్తే...
–సాక్షి, క్రీడావిభాగం
‘మా ఆటగాళ్లు మంచి టచ్‌లో ఉన్నారు. వాళ్లకు బౌలింగ్ చేయాలంటే నాకే భయంగా ఉంది. బంతి మీద ఏమాత్రం దయ లేకుండా విరుచుకుపడుతున్నారు. నెట్స్‌లో వాళ్లకు బంతులేయడం కూడా కష్టమే’... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ తొలి మ్యాచ్ ఆడిన అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) కెపె్టన్ కమిన్స్ అన్న మాటలివి. అప్పటికే ‘300 లోడింగ్’ అనే మాట విస్తృత ప్రచారం కాగా... రైజర్స్ జోరు చూస్తే అదేమంత కష్టం కాదనిపించింది. క్రీజులోకి అడుగుపెట్టిన ప్రతి ఆటగాడు ధనాధన్ బాదుడే లక్ష్యంగా దూసుకెళ్తుంటే ఆరెంజ్ ఆర్మీ చరిత్ర సృష్టించడం ఖాయమనిపించింది.
మార్చి 23న హైదరాబాద్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. ముంబై నుంచి రైజర్స్ గూటికి చేరిన ఇషాన్ కిషన్ (47 బంతుల్లో 106; 11 ఫోర్లు, 6 సిక్స్‌లు) తొలి పోరులోనే సెంచరీతో ఆకట్టుకున్నాడు. హెడ్ హాఫ్ సెంచరీ బాదగా... టాప్–5 ఆటగాళ్లంతా 200 పైచిలుకు స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు రాబట్టారు. ఛేదనలో రాయల్స్ పోరాడినా రైజర్స్ సునాయాసంగా గెలుపొందింది. దీంతో ఆరెంజ్ ఆర్మీ హాట్ ఫేవరెట్‌గా మారిపోయింది.
నిలకడ కొనసాగించలేక...
ఉప్పల్ వేదికగానే జరిగిన రెండో మ్యాచ్‌లో హైదరాబాద్‌కు ఓటమి ఎదురైంది. గత సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై రికార్డు విజయం సాధించిన రైజర్స్... ఈ సారి 190 పరుగులు చేసినా దాన్ని కాపాడుకోలేకపోయింది. అయినా ఒక్క ఓటమే కదా అని అభిమానులు పెద్దగా ఆలోచించలేదు. విశాఖపట్నం వేదికగా ఢిల్లీతో జరిగిన మూడో పోరులో మనవాళ్ల డొల్లతనం బయట పడింది. హిట్టర్లంతా విఫలమవడంతో ఒక దశలో 37 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.
కొత్త కుర్రాడు అనికేత్ సిక్సర్లతో రెచ్చిపోవడంతో కాస్త పరువు నిలబెట్టుకున్నా... మ్యాచ్‌లో మాత్రం పరాజయం తప్పలేదు. ఇక కోల్‌కతాతో పోరులో అయితే 201 పరుగుల లక్ష్యఛేదనలో 16.4 ఓవర్లలో 120 పరుగులకే జట్టు ఆలౌటైంది. ఒక్కరంటే ఒక్కరూ కాస్త పోరాడే ప్రయత్నం చేయలేదు. ఈ పరంపర ఇలాగే కొనసాగుతూ గుజరాత్ చేతిలోనూ చెత్తగా ఓడింది. దీంతో పెంచుకున్న ఆశలన్నీ పేకమేడలా కూలిపోగా... వాస్తవ పరిస్థితి అభిమానులకు సైతం అర్థం అయింది.
అభిషేక్ సెంచరీతో ఊపు...
జట్టంతా నిరాశలో కూరుకుపోయిన దశలో అభిషేక్ శర్మ తిరిగి ఆరెంజ్ ఆర్మీలో జవసత్వాలు నింపాడు. ఇక ముందంజ వేయడం కష్టమే అనుకుంటున్న సమయంలో ఉప్పల్ వేదికగా పంజాబ్‌తో జరిగిన పోరులో అభి ‘షేక్’ ఆడించాడు. మొదట పంజాబ్ 245 పరుగులు చేయగా... భారీ లక్ష్యఛేదనలో హైదరాబాద్ అదరక బెదరక ఎదురు నిలిచింది. వరుస వైఫల్యాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌లో 55 బంతుల్లోనే 141 పరుగులతో ఉప్పల్ స్టేడియాన్ని హోరెత్తించాడు.
సెంచరీ అనంతరం అతడు జేబులో నుంచి ఓ కాగితం తీసి చూపడం హైలైట్‌గా నిలిచింది. ‘ఇది ఆరెంజ్ ఆర్మీ కోసం’ అనే ఆ అక్షరాలతో ఒక్కసారిగా జట్టులో నూతనోత్తేజం కనిపించింది. అభిషేక్‌తో పాటు హెడ్ కూడా ధడధడ లాడించడంతో సన్‌రైజర్స్ మరో 9 బంతులు మిగిలుండగానే కొండంత లక్ష్యాన్ని ఛేదించింది. సమస్యలన్నీ తీరినట్లే... తిరిగి విజయాల బాటపడతాం అని కెపె్టన్ విశ్వాసం వ్యక్తం చేయగా... ఇదే దూకుడు కొనసాగించాలని అభిమానులు ఆశించారు.
మళ్లీ అదే తీరు...
పంజాబ్‌పై గెలుపుతో వచ్చిన ఉత్సాహాన్ని రైజర్స్ కొనసాగించలేకపోయింది. తదుపరి ముంబైతో వరుసగా జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ రైజర్స్ పరాజయం పాలైంది. వాంఖడేలో ఓ మాదిరి పోరాటం అయినా కనబర్చిన కమిన్స్ సేన... ఉప్పల్‌లో అయితే అప్పనంగా మ్యాచ్‌ను ప్రత్యర్థి చేతుల్లో పెట్టింది. ఈ సీజన్‌లో చెత్త ప్రదర్శన చేస్తున్న చెన్నైపై గెలిచిన హైదరాబాద్... గుజరాత్ చేతిలో రెండో సారి కూడా ఓడింది. ఉప్పల్‌లో ఢిల్లీతో మ్యాచ్ వర్షం కారణంగా అర్ధాంతరంగా రద్దు కావడంతో రైజర్స్ ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతు కాగా... ఇక మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ఆరెంజ్ ఆర్మీ ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి.
గతేడాది భారీ హిట్టింగ్‌తో అదరి దృష్టి ఆకర్శించిన రైజర్స్... వేలంలోనే అనేక తప్పులు చేసింది. సుదీర్ఘకాలంగా ఫ్రాంఛైజీకి ప్రాతినిధ్యం వహిస్తున్న భువనేశ్వర్ కుమార్ వంటి తెలివైన బౌలర్‌తో పాటు... యార్కర్ కింగ్ నటరాజన్‌ను వదిలేసుకున్న హైదరాబాద్ జట్టు... భారీ ధరపెట్టి టీమిండియా పేసర్లు మొహమ్మద్ షమీ, హర్శల్ పటేల్‌ను కొనుగోలు చేసుకుంది. వీరిద్దరూ ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడం జట్టుకు భారం కాగా... కమిన్స్, హెడ్, క్లాసెన్ కాకుండా... నాణ్యమైన నాలుగో విదేశీ ప్లేయర్ కూడా అందుబాటులో లేకపోవడం ఫలితాలపై పడింది.
పదే పదే అవే తప్పులు...
భారీ షాట్లు ఆడటమే తమ లక్ష్యం అన్నట్లు ఆడుతున్న సన్‌రైజర్స్ ప్లేయర్లు ప్రాథమిక సూత్రాలను సైతం మరుస్తున్నారు అనేది సుస్పష్టం. జట్టు పరిస్థితి స్కోరుబోర్డుపై గణాంకాలు చూసి షాట్ల ఎంపిక అనేది ఆటలో ప్రాథమిక నియమం. కానీ ఈ సీజన్‌లో రైజర్స్ ఓడిన మ్యాచ్‌లను పరిశీలిస్తే... వారు దీన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదని అర్థం అవుతోంది. ఢిల్లీతో మ్యాచ్‌లో 20 పరుగులకే 2 ప్రధాన వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి రెండో బంతికే ఓ పేలవ షాట్ ఆడి వెనుదిరిగాడు.
ఏమాత్రం ఆసక్తి లేనట్టు నేరుగా ఫీల్డర్ చేతుల్లోకి బంతిని అందించి పెవిలియన్ బాట పట్టాడు. ఈ ఒక్క మ్యాచ్ అనే కాదు... చాలా సార్లు ఇదే తరహా ఆటతీరు కనిపించింది. కోల్‌కతాతో పోరులో 9 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన సమయంలో కాస్త సంయమనం చూపిన మిడిలార్డర్... దాన్ని ఎక్కువసేపు కొనసాగించలేక పోయింది. ఈ కోవలో ఒకటా రెండో ఎన్నో ఉదాహరణలు. ప్రయతి్నంచి విఫలం కావడం ఒక తీరు అయితే... ప్రతీసారి ఒకే విధంగా విఫలం కావడం మరో తీరు.
ఈ సీజన్‌లో రైజర్స్ రెండో దాన్నే కొనసాగించింది. పదే పదే చెత్త షాట్ సెలెక్షన్‌తో మూల్యం చెల్లించుకుంది. రైజర్స్ తరఫున అరంగేట్ర మ్యాచ్ తర్వాత ఇషాన్ కిషన్ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోగా... గత సీజన్‌లో ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’గా నిలిచిన తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి... ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు.
ఆ్రస్టేలియా గడ్డపై టెస్టు సెంచరీ బాది చరిత్ర సృష్టించిన ఈ యువ ఆల్‌రౌండర్... ధాటిగా ఆడాలనే తపనలో బంతిని నేల మీద నుంచి కొట్టడమే మరిచినట్లు పదే పదే గాల్లోకి షాట్లు ఆడి ఔటయ్యాడు. దీంతో అతడికి తుది జట్టులో స్థానం కూడా గగనం కాగా... అభిషేక్ అప్పుడప్పుడు తప్ప నిలకడ లేని ఆటగాడు అనే ముద్ర వేసుకున్నాడు. హెడ్, క్లాసెన్ రాణించినా... వారు కూడా ప్రతీ మ్యాచ్‌లోనూ సత్తాచాటకపోవడంతో రైజర్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది.
ఇక బౌలింగ్ వైఫల్యాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఈ సీజన్‌లో అత్యంత చెత్త బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన వారిలో రైజర్స్ బౌలర్లు ముందు వరుసలో నిలుస్తారు. షమీ, కమిన్స్, హర్షల్ పటేల్, ఉనాద్కట్, సిమర్‌జీత్ సింగ్ ఇలా ఒకరిని మించి ఒకరు పరుగులు ఇచ్చుకోవడంలో పోటీ పడ్డారు. దీంతో వికెట్లు పడగొట్టడం పక్కన పెడితే... కనీసం ప్రత్యర్థులపై ఒత్తిడి కూడా పెంచలేకపోయారు.
కెప్టెన్ కమిన్స్ సైతం భారీగా పరుగులు ఇచ్చుకుంటుండగా... మిగిలిన జట్ల మాదిరిగా ఓ ప్రధాన స్పిన్నర్ లేకపోవడం రైజర్స్‌ను దెబ్బకొట్టింది. మరి ఇక ఈ సీజన్‌లో మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో అయినా రైజర్స్ ఈ తప్పిదాలను సరిదిద్దుకొని సమష్టిగా కదంతొక్కితే కాస్త పరువైనా నిలుస్తుంది. లేదంటే గత ఏడాది పట్టికలో పై నుంచి రెండో స్థానంలో నిలిచిన హైదరాబాద్... ఈసారి కింది నుంచి రెండో స్థానంలో నిలవాల్సి ఉంటుంది.