సన్‌రైజర్స్‌ x సూపర్‌ కింగ్స్‌ | The stage is set for another exciting match at Uppal Stadium as part of the IPL | Sakshi
Sakshi News home page

సన్‌రైజర్స్‌ x సూపర్‌ కింగ్స్‌

Apr 18 2026 4:04 AM | Updated on Apr 18 2026 4:04 AM

The stage is set for another exciting match at Uppal Stadium as part of the IPL

నేడు హైదరాబాద్‌లో పోరు 

ధోనిపైనే అందరి దృష్టి 

రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

సాక్షి, హైదరాబాద్‌: ఐపీఎల్‌లో భాగంగా ఉప్పల్‌ స్టేడియంలో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. నేడు (శనివారం) జరిగే మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడుతుంది. సొంత మైదానంలో గత మ్యాచ్‌లో చెలరేగి రాజస్తాన్‌ను చిత్తు చేసిన రైజర్స్‌ అదే జోరును కొనసాగించి మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని పట్టుదలగా ఉంది. 

మరో వైపు తొలి మూడు మ్యాచ్‌లలో ఓటముల తర్వాత కోలుకున్న సీఎస్‌కే వరుస రెండు విజయాలతో ఫామ్‌లోకి వచ్చింది. ఇరు జట్లు ఐదు మ్యాచ్‌ల తర్వాత రెండేసి విజయాలతో సమంగా ఉన్న నేపథ్యంలో పైచేయి ఎవరు సాధిస్తారనేది చూడాలి. 2025 సీజన్‌లో హైదరాబాద్, చెన్నై మధ్య ఉప్పల్‌ స్టేడియంలో మ్యాచ్‌ జరగలేదు. 

కుర్రాళ్లు మళ్లీ చెలరేగేనా... 
గత మ్యాచ్‌లో యువ బౌలర్లు ప్రఫుల్‌ హింగే, సాకిబ్‌ హుస్సేన్‌ పదునైన బౌలింగ్‌తో సన్‌రైజర్స్‌ను గెలిపించారు. ఉప్పల్‌ స్టేడియంలో వీరిద్దరు మళ్లీ అదే తరహా ప్రదర్శనను పునరావృతం చేయాలని జట్టు కోరుకుంటోంది. స్పిన్నర్లు శివాంగ్, హర్ష్ దూబే కూడా ప్రత్యర్థిని నిలువరించగలరు. అయితే మెరుగైన బౌలింగ్‌ వనరులు కనిపిస్తున్నా...టీమ్‌ మళ్లీ తమ బ్యాటింగ్‌ బలాన్నే నమ్ముకుంది. ఈ సీజన్‌లో సొంతగడ్డపై రెండు మ్యాచ్‌లలో ‘డకౌట్‌’ అయిన అభిషేక్‌ శర్మ ఈ సారైనా చెలరేగాలని మేనేజ్‌మెంట్‌ కోరుకుంటోంది. 

హెడ్‌ కూడా ఇంకా తన స్థాయి ప్రదర్శనను చూపించలేదు. కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ అద్భుత ఫామ్‌లో ఉండటం సానుకూలాంశం. రెండు మ్యాచ్‌లలో కీలక భాగస్వామ్యాలతో జట్టును ఆదుకున్న క్లాసెన్, నితీశ్‌ కుమార్‌ రెడ్డి మళ్లీ సత్తా చాటాల్సి ఉంది. ముఖ్యంగా క్లాసెన్‌ స్ట్రయిక్‌రేట్‌లో గతంతో పోలిస్తే తక్కువగా ఉంటోంది. దీనిని అతను అధిగమిస్తే భారీ ఇన్నింగ్స్‌ ఖాయం. నితీశ్‌ మాత్రం ప్రతీ మ్యాచ్‌లో అంచనాలను అందుకుంటున్నాడు.  

రుతురాజ్‌ రాణించేనా... 
చెన్నై గత రెండు విజయాల్లో ఓపెనర్‌గా సంజు సామ్సన్‌ కీలక పాత్ర పోషించగా, యువ బ్యాటర్‌ ఆయుశ్‌ మాత్రమే చక్కటి ఇన్నింగ్స్‌లు ఆడాడు. బ్రెవిస్, సర్ఫరాజ్‌ కూడా అంచనాలకు అనుగుణంగా దూకుడుగా ఆడుతున్నారు. టాప్‌–5లో ఈ నలుగురు బ్యాటింగ్‌తోనే సీఎస్‌కే మెరుగైన ఫలితాలు రాబట్టగలిగింది. అయితే జట్టును ఆందోళనపరుస్తున్న అంశం కెప్టెన్‌ రుతురాజ్‌ ఫామ్‌ మాత్రమే. ఐదు మ్యాచ్‌లలో రుతురాజ్‌ వరుసగా 6, 28, 7, 15, 7 పరుగులు మాత్రమే సాధించాడు. 

ఇలాంటి స్థితిలో కెప్టెన్‌నుంచి ఒక మంచి ఇన్నింగ్స్‌ను జట్టు కోరుకుంటోంది. చివర్లో దూబే, ఒవర్టన్‌ కూడా ధాటిగా ఆడితే చెన్నై భారీ స్కోరు చేయడం ఖాయం. బౌలింగ్‌లో సీఎస్‌కే కొంత బలహీనంగానే కనిపిస్తోంది. స్పిన్నర్లు నూర్, అకీల్‌ మెరుగ్గానే బౌలింగ్‌ చేస్తున్నా...పేసర్లు గుర్‌జప్‌నీత్‌ సింగ్, ఒవర్టన్, కంబోజ్‌ భారీగా పరుగులిస్తున్నారు. ఈ సీజన్‌లో మెరుగ్గా ఆడిన ఖలీల్‌ అహ్మద్‌ గాయంతో టోర్నీకి దూరం కావడం చెన్నైని ఇబ్బంది పెట్టే అంశం. అతని స్థానంలో ఎవరికి చోటిస్తారనేది చూడాలి.   

ఐపీఎల్‌లో నేటి మరో మ్యాచ్‌
బెంగళూరు X ఢిల్లీ 
వేదిక: బెంగళూరు
మధ్యహ్నం 3: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement
 
Advertisement
Advertisement