వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక మ్యాచ్‌పై పట్టు సాధించింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసి, ఓవరాల్‌గా 142 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇంకా ఒక రోజు ఆట మాత్రమే మిగిలి ఉండటంతో విజయానికి అవసరమైన లక్ష్యాన్ని నిర్దేశించేందుకు శ్రీలంక ప్రయత్నిస్తోంది.
మూడో రోజు ప్రారంభమైన జస్టిన్ గ్రీవ్స్, షాయ్ హోప్ భాగస్వామ్యం నాలుగో రోజు కూడా కొనసాగింది. ఓపికగా బ్యాటింగ్ చేసిన ఈ ఇద్దరూ శతకాలు నమోదు చేశారు. హోప్ (112) తన కెరీర్‌లో ఐదో టెస్టు సెంచరీని, స్వదేశంలో తొలి టెస్టు శతకాన్ని నమోదు చేయగా.. గ్రీవ్స్ (180) తన మూడో టెస్టు సెంచరీని పూర్తి చేశాడు. గ్రీవ్స్ కెరీర్‌లో రెండో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.
గ్రీవ్స్-హోప్ 76.1 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 242 పరుగుల భారీ భాగస్వామ్యానికి నెలకొల్పారు. వీరిద్దరూ ఔటైన తర్వాత విండీస్ ఇన్నింగ్స్ ఎంతో సేపు కొనసాగలేదు.
ఓ దశలో 5 వికెట్లకు 438 పరుగులతో బలంగా కనిపించిన వెస్టిండీస్ చివరి ఐదు వికెట్లను కేవలం 61 పరుగులకే కోల్పోయి 499 పరుగులకు ఆలౌటైంది.
దీంతో తొలి ఇన్నింగ్స్‌ను 549/9 వద్ద డిక్లేర్ చేసిన శ్రీలంకకు 50 పరుగుల ఆధిక్యం లభించింది. అసిత ఫెర్నాండో ఐదు వికెట్లతో రాణించాడు.
రెండో ఇన్నింగ్స్ ప్రారంభంలోనే శ్రీలంకకు షమార్ జోసెఫ్, అల్జారీ జోసెఫ్ షాకిచ్చారు. లహిరు ఉదారా నాలుగు బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకుండానే ఎల్‌బీగా వెనుదిరగగా, నిషాన్ మదుష్కను అల్జారీ ఔట్ చేశాడు. దీంతో శ్రీలంక 32 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.
ఆ క్లిష్ట సమయంలో దినేశ్ చండిమల్, కమిందు మెండిస్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఇద్దరూ మూడో వికెట్‌కు అజేయంగా 60 పరుగులు జోడించి జట్టును గట్టెక్కించారు. చండిమల్ 66 బంతుల్లో 40 పరుగులతో, కమిందు మెండిస్ 35 బంతుల్లో 30 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
సంక్షిప్త స్కోర్లు:
శ్రీలంక: 549/9 డిక్లేర్ & 92/2 (దినేశ్ చండిమల్ 40*, కమిందు మెండిస్ 30*)
వెస్టిండీస్: 499 (జస్టిన్ గ్రీవ్స్ 180, షాయ్ హోప్ 112; అసిత ఫెర్నాండో 5/130)
శ్రీలంకకు మొత్తం 142 పరుగుల ఆధిక్యం
కాగా, రెండు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో తొలి మ్యాచ్ నెగ్గిన వెస్టిండీస్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.


