
ఆసియా కప్ 2025లో ఘోర వైఫల్యాల తర్వాత శ్రీలంక క్రికెట్ జట్టు (Sri Lanka) తమ కోచింగ్ బృందంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. లాంగ్ స్టాండింగ్‌గా ఉన్న స్పిన్ బౌలింగ్ కోచ్‌తో పాటు రెండేళ్ల క్రితం నియమితుడైన బ్యాటింగ్ కోచ్‌ను కూడా మార్చింది.
2006 నుంచి స్పిన్ బౌలింగ్ కోచ్‌గా ఉన్న పియాల్ విజేతుంగే స్థానంలో రెన్ ఫెర్డినాండ్స్‌ను.. 2023 డిసెంబర్ నుంచి బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న తిలిన్ కందాబి స్థానంలో జూలియన్ వుడ్‌ను నియమించింది.
జూలియన్ వుడ్ ఏడాది ఒప్పందం మేరకు లంక పరిమిత ఓవర్ల జట్టుతో చేరతాడు. అతను లంక బ్యాటర్లకు పవర్ హిట్టింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నాడు. వుడ్ గతంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు.. ఇంగ్లండ్ కౌంటీలైన హ్యాంప్‌షైర్, గ్లోసెస్టర్‌షైర్, మిడిల్‌సెక్స్‌కు శిక్షణ ఇచ్చాడు. అలాగే అతను ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్‌కు కూడా బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా పని చేశాడు.
రెన్ ఫెర్డినాండ్స్ విషయానికొస్తే.. ఇతను లంక బోర్డుతో రెండేళ్ల ఒప్పందం మేరకు పని చేస్తాడు. ఈ సమయంలో అతను లంక స్పిన్ విభాగాన్ని పటిష్ట పరిచే ప్రయత్నం చేస్తాడు. గతంలో అతను న్యూజిలాండ్ క్రికెట్‌లో కన్సల్టెంట్‌గా పని చేశాడు. అలాగే బీసీసీఐ నేషనల్ అకాడమీలోనూ కొంతకాలం సేవలందించాడు.
శ్రీలంక జట్టు తాజాగా ముగిసిన ఆసియా కప్‌లో గ్రూప్ దశలో మంచి విజయాలు సాధించినా.. సూపర్-4 దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదుర్కొని టోర్నీ నుంచి నిష్క్రమించింది. సూపర్-4లో వారికంటే బలహీనమైన బంగ్లాదేశ్ చేతిలో శ్రీలంక పరాభవాన్ని ఎదుర్కొంది.
ఆసియా కప్ తర్వాత నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటున్న శ్రీలంక జట్టు నవంబర్‌లో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం పాకిస్తాన్ పర్యటనకు వెళ్తుంది. ఈ మ్యాచ్‌లు నవంబర్ 11, 13, 15 తేదీల్లో రావల్పిండి వేదికగా జరుగుతాయి. అనంతరం ఈ జట్టు పాకిస్తాన్‌లోనే జరిగే ముక్కోణపు ట్రై సిరీస్‌లో కూడా పాల్గొంటుంది. ఈ సిరీస్ నవంబర్ 17 నుంచి ప్రారంభమవుతుంది.