
ఆస్ట్రేలియా దేశవాలీ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్‌లో (Sheffield Shield-2025) ఆసీస్ జాతీయ జట్టు ఆటగాడు, క్వీన్స్‌ల్యాండ్ కెప్టెన్ మార్నస్ లబూషేన్ (Marnus Labuschagne) భారీ శతకంతో కదంతొక్కాడు. ఈ ఎడిషన్ తొలి మ్యాచ్‌లోనే అతను ఈ ఘనత సాధించాడు. టాస్మానియాతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 206 బంతుల్లో 18 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 160 పరుగులు చేశాడు.
గత కొంతకాలంగా ఫామ్‌లేమితో సతమతమవుతున్న లబూషేన్ ఈ సెంచరీతో తిరిగి ఫామ్‌ను అందుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌తో రెడ్ బాల్ క్రికెట్‌లో తన క్లాస్‌ను మరోసారి చాటుకున్నాడు. 14 నెలల తర్వాత ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో లబూషేన్ చేసిన తొలి సెంచరీ ఇది.
అతను చివరిగా 2024 జులైలో ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో గ్లామోర్గన్‌పై మూడంకెల స్కోర్‌ను చేశాడు. ఓవరాల్‌గా లబూషేన్‌కు ఇది ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 33 శతకం.
ఈ సెంచరీతో అతను యాషెస్ సిరీస్‌కు ముందు ఆసీస్ సెలెక్టర్లకు గట్టి సవాల్ విసిరాడు. ఈ సెంచరీ చేయకపోయుంటే యాషెస్ జట్టులో అతనికి స్థానం ఖచ్చితంగా దక్కేది కాదు. గత కొంతకాలంగా లబూషేన్ ఆసీస్ తరఫున దారుణంగా విఫలమవుతూ వస్తున్నాడు.
గత డబ్ల్యూటీసీ సైకిల్‌లో (2023-25) అతని ప్రదర్శన మరీ తీసికట్టుగా ఉండింది. ఆ సైకిల్‌లో 20 మ్యాచ్‌ల్లో కేవలం 27 సగటున, ఒకే ఒక సెంచరీ సాయంతో పరుగులు చేశాడు. ఇది అతని కెరీర్ తొలినాళ్లలో ప్రదర్శనలతో పోలిస్తే చాలా తక్కువ.
లబూషేన్ కెరీర్ ఆరంభంలో 70కి పైగా సగటుతో పరుగులు చేశాడు. ఇప్పటివరకు 58 టెస్ట్‌లు ఆడిన లబూషేన్.. 46.2 సగటున 12 సెంచరీల సాయంతో 4435 పరుగులు చేశాడు.
తాజా సెంచరీతో లబూషేన్ ఓ అరుదైన మైలురాయిని కూడా తాకాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 12000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. కెరీర్‌లో 167 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 33 సెంచరీలు, 60 అర్ద సెంచరీల సాయంతో 12000 ప్లస్ పరుగులు చేశాడు.
కాగా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య యాషెస్ సిరీస్ నవంబర్ 21 నుంచి ప్రారంభమవుతుంది. ప్రతిష్టాత్మకమైన ఈ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టును ఇదివరకే ప్రకటించగా.. ఆసీస్ జట్టును మరికొద్ది రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది.