
రెండు మూడేళ్ల కిందట ఓ వెలుగు వెలిగిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (Babar Azam), ప్రస్తుతం ఫామ్ కోల్పోయి గడ్డుకాలం ఎదుర్కొంటున్నాడు. టీ20 జట్టును శాశ్వతంగా తప్పించబడిన అతను.. వన్డే, టెస్ట్ జట్లలో అడపాదడపా అవకాశాలు దక్కించుకుంటున్నాడు.
త్వరలో స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగబోయే టెస్ట్ సిరీస్ కోసం ఎంపికైన బాబర్.. పూర్వవైభవం సాధించేందుకు అష్టకష్టాలు పడుతున్నాడు. ఈ క్రమంలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. చాలాకాలంగా ఆడని దేశవాలీ ఫస్ట్‌క్లాస్ టోర్నీ 'క్వైద్ ఎ ఆజమ్ ట్రోఫీ'లో పాల్గొంటున్నాడు. ఈ టోర్నీలో అతను లాహోర్ వైట్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు.
గత కొంతకాలంగా రెడ్ బాల్ క్రికెట్ ఆడని బాబర్ క్వైద్ ఎ ఆజమ్ ట్రోఫీ ద్వారా టచ్‌లోకి రావాలని భావిస్తున్నాడు. బాబర్ తన చివరి టెస్ట్ మ్యాచ్‌ను ఈ ఏడాది ఆరంభంలో ఆడాడు. అప్పటి నుంచి వైట్ బాల్ క్రికెట్ ఆడతున్నా పెద్దగా రాణించింది లేదు. సౌతాఫ్రికాతో జరుగబోయే టెస్ట్ సిరీస్ బాబర్‌కు డు ఆర్ డై అన్న పరిస్థితిని తెచ్చిపెట్టింది.
ఈ సిరీస్‌లో రాణిస్తేనే అతని టెస్ట్ కెరీర్ నిలబడుతుంది. లేదంటే టీ20 ఫార్మాట్ తరహాలోనే టెస్ట్‌లకు కూడా దూరం కావాల్సి ఉంటుంది.
క్వైద్ ఎ ఆజమ్ ట్రోఫీలో బాబర్‌తో పాటు మరింత మంది స్టార్ ఆటగాళ్లు కూడా ఆడనున్నట్లు తెలుస్తుంది. బాబర్‌తో పాటు ఆసియా కప్ జట్టు నుంచి తప్పించబడ్డ మొహమ్మద్ రిజ్వాన్, టీ20 జట్టు కెప్టెన్ సల్మాన్ అఘా, హసన్ అలీ, సాజిద్ ఖాన్ తదితరులు క్వైద్ ఎ ఆజమ్ ట్రోఫీలో ఆడేందుకు సిద్దంగా ఉన్నారు.
ఈ టోర్నీలో అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానుండగా.. సౌతాఫ్రికాతో సిరీస్ అక్టోబర్ 12 నుంచి మొదలవుతుంది. ఈ సిరీస్‌లో తొలి టెస్ట్ అక్టోబర్ 12 నుంచి లాహోర్‌లో.. రెండో టెస్ట్ అక్టోబర్ 20 నుంచి రావల్పిండిలో ప్రారంభమవుతాయి.
పాక్ పర్యటనలో సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ తర్వాత మూడు మ్యాచ్‌ల టీ20, వన్డే సిరీస్‌లు కూడా ఆడనుంది. పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం సౌతాఫ్రికా జట్లను ఇదివరకే ప్రకటించగా.. పాక్ జట్లకు ప్రకటించాల్సి ఉంది.
సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కోసం పాకిస్తాన్ జట్టు:
షాన్ మసూద్ (కెప్టెన్), ఆమిర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, ఆసిఫ్ ఆఫ్రిది, బాబర్ ఆజమ్, ఫైసల్ అక్రమ్, హసన్ అలీ, ఇమామ్-ఉల్-హక్, కమ్రాన్ గులాం, ఖుర్రం షెహజాద్, మహ్మద్ రిజ్వాన్ (wk), నౌమాన్ అలీ, రోహైల్ నజీర్ (wk), సాజిద్ ఖాన్, సల్మాన్ అలీ ఆఘా, సౌద్ షకీల్, షాహీన్ షా ఆఫ్రిది
పాకిస్తాన్‌తో తొలి టెస్ట్ కోసం సౌతాఫ్రికా జట్టు:
ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, జుబేర్ హమ్జా, టోనీ డి జోర్జీ, సెనురన్ ముత్తాస్వామి, కార్బిన్ బాష్, వియాన్ ముల్దర్, మార్కో జన్సెన్, ప్రెనెలన్ సుబ్రాయన్, డేవిడ్ బెడింగ్హమ్, కైల్ వెర్రిన్, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, సైమన్ హార్మర్, కగిసో రబాడ
చదవండి: భారత యువ ప్లేయర్ల మధ్య ఘర్షణ.. కొట్టుకున్నంత పని చేశారు..!