భారత యువ ప్లేయర్ల మధ్య ఘర్షణ.. కొట్టుకున్నంత పని చేశారు..! | Irani Cup 2025 Ends In Heated Clash Between Yash Dhull And Yash Thakur As Vidarbha Clinch Victory, Video Went Viral | Sakshi
Sakshi News home page

భారత యువ ప్లేయర్ల మధ్య ఘర్షణ.. కొట్టుకున్నంత పని చేశారు..!

Oct 6 2025 11:08 AM | Updated on Oct 6 2025 11:50 AM

Ugly scenes in Irani Cup as Yash Dhull and Yash Thakur nearly come to blows

ఇరానీ కప్‌ 2025 (Irani Cup 2025) చివరి రోజు (అక్టోబర్‌ 5) హై వోల్టేజ్ డ్రామా చోటు చేసుకుంది. ఇద్దరు ఆటగాళ్ల మధ్య మాటామాటా పెరిగి తీవ్ర ఘర్షణకు దారి తీసింది. ఓ దశలో ఇరువురు కొట్టుకున్నంత పని చేశారు. ఈ ఘర్షణ గతంలో (2013) గంభీర్‌-కోహ్లి (Gambhir-Kohli) మధ్య జరిగిన ఫైట్‌ను గుర్తు చేసింది. తాజా ఘటన సోషల్‌మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.

పూర్తి వివరాల్లో వెళితే.. రంజీ ఛాంపియన్‌ విదర్భ, రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా జట్లు ఇరానీ కప్‌ 2025 కోసం తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో విదర్భ ఛాంపియన్‌గా నిలిచి గ్రాండ్‌ డబుల్‌ (రంజీ, ఇరానీ ట్రోఫీలు) సాధించింది.

అయితే ఆట చివరి రోజు హై డ్రామా చోటు చేసుకుంది. రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా బ్యాటర్‌ యశ్‌ ధుల్‌ (Yash Dhull), విదర్భ బౌలర్‌ యశ్‌ ఠాకూర్‌ (Yash Thakur) గొడవపడ్డారు. రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

మ్యాచ్‌ 63వ ఓవర్‌లో యశ్ ఠాకూర్ వేసిన షార్ట్ పిచ్‌ బంతిని యశ్ ధుల్ పుల్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా, అథర్వ తైడే అద్భుతమైన క్యాచ్‌గా మలిచాడు. ఆ సమయానికి ధుల్‌ 92 పరుగుల వద్ద ఆడుతూ మ్యాచ్‌ను రెస్ట్ ఆఫ్ ఇండియా వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నాడు. 

సెంచరీ ముందు ఔట్‌ కావడమే కాకుండా తన జట్టును గట్టెక్కించలేకపోయానన్న బాధలో ధుల్‌ ఉండగా.. యశ్‌ ఠాకూర్‌ అత్యుత్సాహంతో సంబురాలు చేసుకున్నాడు.

ఈ క్రమంలో యశ్‌ ఠాకూర్‌ ధుల్‌ను ఉద్దేశిస్తూ ఏదో అన్నాడు. అప్పటికే ఔటైన అసహనంలో ఉన్న ధుల్‌ యశ్‌ ఠాకూర్‌పైకి తిరగబడ్డాడు. దీంతో ఇరువురి మధ్య చిన్నపాటి యుద్దమే జరిగింది. ధుల్‌, ఠాకూర్‌ ఒకరిపైకి ఒకరు దూసుకుపోయారు. అంపైర్లు అడ్డుపడకుంటే ఖచ్చితంగా కొట్టుకునే వారు. అంతిమంగా అంపైర్లు, సహచరులు వారించడంతో ఇరువురు తగ్గారు. దీంతో గొడవ సద్దుమణిగింది.

ధుల్‌ ఔటయ్యాక లయ తప్పిన రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా 30 పరుగుల వ్యవధిలో చివరి నాలుగు వికెట్లు కోల్పోయి మ్యాచ్‌ను చేజార్చుకుంది. ధుల్‌కు చేదోడుగా ఉండిన మానవ్‌ సుతార్‌ అర్ద సెంచరీ పూర్తి చేసి చివరి వరకు క్రీజ్‌లో ఉన్నా ఎలాంటి ప్రయోజనం​ లేకుండా పోయింది. రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా లక్ష్యానికి 94 పరుగుల దూరంలో నిలిచిపోయి, ఓటమిపాలైంది.

తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగులు చేసి విదర్భ గెలుపుకు ప్రధాన కారకుడైన అథర్వ తైడే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. 

చదవండి: World Cup 2025: భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌.. స్ప్రే ప్రయోగించిన పాక్‌ కెప్టెన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement